2, జూన్ 2022, గురువారం

కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు

 (జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)

తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటిమీద రాత కాకుండా  రాతిమీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం. 

తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  కాలం గడుస్తోంది. కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వేసవికాలంలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.

సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్న నీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. వారి అనుమానాలకు ప్రాతిపదిక కూడా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి.  అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. అలా అని రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోనూలేదు.

అంటే  ఈ ఎనిమిదేళ్ల  కాలంలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.

'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో pచేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.

సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు.

కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.   

ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు, ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?



ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం, వారి జీవితాలు  అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి.






అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో!

కామెంట్‌లు లేవు: