31, మే 2022, మంగళవారం

అన్నదాతా! సుఖీభవ!

ఆత్మీయ కలయికలకు  కరోనా మూడేళ్లు ముకుతాడు వేసింది. ఇప్పుడిప్పుడే నలుగుర్ని కలుసుకోవడాలు, ఒకరి  ఇళ్లకు మరొకరు వెళ్ళడాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ళుగా ముఖాముఖి కలవని రాయపాటి సాంబశివరావు గారిని నిన్న చూడడం జరిగింది.

మొన్న రాత్రి, జ్వాలా ఇంట్లో రాయపాటి ప్రసక్తి వచ్చింది.  ఆయన ఎక్కడ వున్నారో తెలుసుకోవాలని జ్వాలా వెంటనే ఫోన్ చేశాడు. హైదరాబాదులోనే  వున్నట్టు తెలిసి,  చూడడానికి వస్తామని అంటే, మీరు ఎందుకు రావడం మీ ఇంటికి రేపు రాత్రి  నేనే వస్తాను అన్నారాయన. అన్నట్టే వచ్చారు. తెల్లటి అంగీ, తెల్లటి లుంగీ. 78 ఏళ్ళ వయస్సు అన్న విషయం పైకి తెలియక పోయినా (నాకంటే ఏడాది, జ్వాలా కన్నా రెండేళ్లు పెద్ద)  ఈ మధ్య చేసిన సుస్తీల కారణంగా ఆరోగ్య రీత్యా నియమబద్ధమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు.

నన్ను చూడగానే  మనిద్దరిదీ ఇప్పుడు ఒకే పడవ అన్నారు. (వారి శ్రీమతి చనిపోయిన రెండేళ్లకే మా ఆవిడ కూడా చనిపోయింది)

రాయపాటి గారికి మా మేనకోడలు, జ్వాలా భార్య విజయలక్ష్మి  పెట్టే ఆవకాయ కారాలు బాగా ఇష్టం. బహుశా ఆయన మా ఇళ్ళ నుంచి అడిగి మరీ తీసుకువెళ్ళేవి ఈ కారాలు ఒక్కటే. మా ఆవిడ బతికున్న రోజుల్లో ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా దోసావకాయ కారం అడిగి చేయించుకుని తీసుకువెళ్ళే వారు. మాస్కోలో ఇక సరేసరి. ఆయన వ్యాపారపు పనుల మీద ఎప్పుడు వచ్చినా, ఎన్నాళ్ళు వున్నా, ఎక్కడ బస చేసినా రాత్రి భోజనం మా ఇంట్లోనే. కారాలు, పచ్చళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం. మాస్కోలో మా అన్నదాత అని బాహాటంగా చెప్పడం మాకు ఇబ్బందిగా  అనిపించేది.

రాయపాటి గారితో జ్వాలా కుటుంబానికి, మా కుటుంబానికి స్నేహం దశాబ్దాలుగా సాగుతోంది. ఎక్కడ ఏ యాగం తలపెట్టినా మా కుటుంబాలను గుర్తు పెట్టుకుని తీసుకు వెళ్ళేవారు. అలాగే తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా.

ఆయన రాజకీయాలు, వ్యాపారాలు మా స్నేహాలకు, పరిచయాలకు  ఏనాడు అడ్డం రాలేదు. వాటి ప్రసక్తి కూడా మా మధ్య మాటల్లో వచ్చేది కాదు.  జ్వాలా పిల్లల  పెళ్ళిళ్ళకే కాదు, మనుమడి ఉపనయనానికి కూడా వచ్చారు.

మా మేనకోడలు కొసరి కొసరి వడ్డించింది. మిగిలిన అధరవులు పక్కనపెట్టి, ఆవకాయ, మెంతికాయ, మాగాయ, వెల్లుల్లి ఆవకాయ, నీళ్ళావకాయలతోనే భోజనం ముగించారు. ముఖ్యంగా నూనె లేని నీళ్ళావకాయ  కారం ఆయనకు బాగా నచ్చింది. జ్వాలా  భార్య విజయలక్ష్మి ఆ కారాన్ని ప్యాక్ చేసి ఇచ్చింది. జ్వాలా కూడా కరోనా కాలంలో తాను రామాయణ, భారతాలపై  రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను బహుకరించాడు.

వెడుతూ వెడుతూ ఆయన ఎప్పుడూ అనే మాటే అన్నారు.

‘అన్నదాతా! సుఖీభవ!’



(30-05-2022)

30, మే 2022, సోమవారం

ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలన


2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో, లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
ఇదలా ఉంచితే,
అప్పట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
ఆయన ఈ మాట అంటున్నప్పుడు ప్రేక్షకులు విడవకుండా చేసిన కరతాళధ్వనులతో వెస్ట్ మినిస్టర్ హాల్ మారుమోగింది. అదో అపూర్వ దృశ్యం.
మరో ఏడాది గడిచింది.
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
ఈయనకు బహుముఖాలు వున్నాయి. ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్ బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన రెండేళ్లకు ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని గొప్ప కితాబు ఇచ్చారు.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గతంలో కలిసి పోయాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండితనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ఈ నిర్ణయం దేశానికి ఏ మేరకు మేలు చేసింది అనే విషయంలో, ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టినా, ఇప్పటికీ స్పష్టమైన అంచనా లేదు. అయితే మోడీ తీసుకున్న ఈ చర్యకు రెండోమారు ఘన విజయం కట్టబెట్టడం ద్వారా అధిక శాతం మంది ఆమోదముద్ర వేశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, 2019 లో జరిగిన ఎన్నికల్లో నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాధించిన ఘన విజయంతో నరేంద్ర మోడీ మరో మారు భారత ప్రధాన మంత్రిగా ఈరోజుకు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అప్పటి పరిస్థితులు ఛాయమాత్రంగా ప్రస్తావించడం ఇప్పటి పరిస్థితితో పోల్చుకోవడానికే.
ప్రతి పార్టీకి ముఖ్యంగా బీజేపీ వంటి జాతీయ భావాలు కలిగిన పార్టీలకు కొన్ని మూల సిద్ధాంతాలు వుంటాయి. మెజారిటీ ప్రజలు తమకు సమర్ధ ప్రభుత్వం కావాలనే ఆలోచనతో ఓట్లు వేసి గెలిపిస్తారు. అలాగని తమ మూల సిద్ధాంతాలకు కూడా వారు పట్టం కట్టినట్టు కాదు. కానీ అలాంటి వారిని తమ పాలనతో, విధానాలతో ఆకర్షించి మెల్లగా తమ సిద్ధాంతాల పట్ల వారిలో సానుకూలత పెరిగేలా చూసుకోవాలి. ఈ ప్రజాస్వామ్య ధర్మాన్నిపాటిస్తే ఏ చిక్కూ వుండదు. ఏది చెప్పినా సుద్దుల మాదిరిగా మృదువుగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి కానీ బలవంతాన రుద్దినట్టు ఉండరాదు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
(30-05-2022)



జగన్ మూడేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు


ప్రజలు ఇచ్చిన అయిదేళ్ళ అధికార గడువులో మూడేళ్లు ఈ నెల ముప్పయితో ముగుస్తాయి. ఇంకా రెండేళ్ల వ్యవధానం మిగిలి వుంది.
అంటే ఆగి నిలబడి వెనక్కి తిరిగి చూసుకుని ముందుకు సాగాల్సిన సమయం అన్నమాట.
గత మూడేళ్లను ఒకసారి గమనిస్తే, ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా, జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని, పార్టీ రధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే అధికారిక ప్రకటనలు. మరోపక్క తొందరపడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఎన్నికల ప్రణాళిక రూపంలో ప్రజలకు చేసిన వాగ్దానాలలో తొంభయ్ శాతానికి పైగా నేరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది. కాదంటున్నాయి ప్రతిపక్షాలు. అది సహజం. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుంటూ పోయే పరిస్థితి లేని , మాట కూడా నిజం. అయితే ఈ విషయంలో అసలు వాస్తవం ఏది, ఎంత అనేది ప్రయోజనం పొందిన లేదా అందని ప్రజలు మాత్రమే చెప్పగలుగుతారు. అంచేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన గడప గడపకు అనే కార్యక్రమం ఒక్కటే ఈ విషయంలో ఒక అవగాహనకు రావడానికి గీటురాయి. ప్రజలను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి అయినా అసాధ్యం. అయితే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి, క్షేత్ర స్థాయిలో వాస్తవాలని తెలుసుకున్న పక్షంలో పధకాలు బాగా అమలు జరుగుతున్న చోట పని తీరును మరింత మెరుగు పరుచుకోవడానికి, లేదా అసంతృప్తి వున్న చోట ఆ లొసుగులను తొలగించుకుని ముందుకు పోవడానికి ఈ కార్యక్రమాన్ని మించిన కొలమానం మరోటి వుండదు.
ప్రజల దినవారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ వుంటే అది ఉత్తమ ప్రభుత్వం అనిపించుకుంటుంది అని చాణక్యుడు చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ఈ దిశగా మంచి అడుగు. ప్రజలు ప్రతి చిన్న పనికి గ్రామం దాటి వెళ్ళకుండా, వున్న ఊళ్లోనే వ్యవహారాలు చక్కబరచుకోవడానికి ఈ గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుత ప్రజాప్రతినిధుల వ్యవస్థకు సమాంతరం కాకుండా జాగ్రత్త పడాలి.
కరోనా సమయంలో నవరత్నాల రూపంలో జరిగిన నగదు బదిలీలు కింది స్థాయి ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అన్ని నెలలు ఉపాధి కోల్పోయినా కూడా బడుగు బలహీన వర్గాల ఆర్ధిక స్థితి అతలాకుతలం కాకుండా ఈ నిధులు వారికి అక్కరకు వచ్చాయి. అమెరికా వంటి సంపన్న దేశాలలో సయితం కరోనా వేళ అక్కడి ప్రభుత్వాలు నగదు బదిలీ రూపంలో ప్రజలకు అందించిన సాయం జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తోడ్పడిందని పత్రికలు రాశాయి.
వాగ్దానాల అమలుకోసం మరో ధ్యాస పెట్టుకోకుండా, విమర్శలను ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి ఏకాగ్రతతో పనిచేయడం వల్ల వాటి అమలు శాతం ప్రభుత్వానికి సంతృప్తి కలిగించే స్థాయిలో వుంది. ఇక రానున్న రెండేళ్ల కాలాన్ని అత్యంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పొరబాట్లు జరిగితే దిద్దుకోవడానికి, తప్పులు జరిగితే పునరావృతం కాకుండా చూసుకోవడానికి, ఇక ముందు ముందు ఎలాంటి పొరబాట్లు, తప్పులు జరగకుండా చూసుకోవడానికి రెండేళ్ల సమయాన్ని వాడుకుంటే ప్రభుత్వ పధకాల అమలు, ప్రజల సంతృప్త స్థాయి నూటికి నూరు శాతం చేరడానికి వీలుపడుతుంది.
“జగన్ ఓ సీతయ్య. ఎవరి మాటా వినడు” ఇలాంటివి వినడానికి బాగుంటాయి. పాలకుడు అనే వాడు తన కళ్ళతో చూడాలి. తన చెవులతో వినాలి. అంటే వాస్తవాన్ని మాత్రమే చూడగలగాలి. వినగలగాలి. ఎవరో చెప్పింది వినడం, ఎవరో చూసి చెప్పింది నమ్మడం వంటి లక్షణాలు పరిపాలనను బలహీన పరుస్తాయి.
అయితే ఈ మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి అనుకోవడానికి కానీ, మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందన్న భరోసా కానీ లేదు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది అనేది ప్రతిపక్షాల వాదన. వాళ్ళు అలాగే అంటారు అని పైకి చెప్పుకోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా వుందని ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిన తర్వాత చేయగలింది ఏమీ వుండదు.
“అంతా బాగానే వుంది అని అనుకోవడానికి, అంతా సజావుగా వుంది అనడానికి చాలా తేడా వుంది. ప్రజల ఆలోచనా ధోరణి ఎల్లప్పుడూ ఒకే రీతిగా వుండదు. అది ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో పసి కట్టి చెప్పగల మేధావులు లేరు. పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా వుంది, లేదా పరిస్తితులు అత్యంత అనుకూలంగా వున్నాయి అనే ఈ రెండింటి నడుమ అసలు వాస్తవం దాగి వుంటుంది. దాన్ని ఒడిసిపట్టుకోగల చాకచక్యం కొరవడితే ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి”
గత ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో రాసిన వాక్యాలే ఇవి.
ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి.
గతం నుంచి పాఠాలు నేర్చుకుని, నేర్చుకున్న పాఠాలను వర్తమానంలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదిలంగా వుంటుంది.
లేని పక్షంలో గతమే చరిత్రగా మారుతుంది.




(30-05-2022)

29, మే 2022, ఆదివారం

ఓన్లీ ఇన్ ఇండియా - భండారు శ్రీనివాసరావు

 ఆయనకు రామారావు సినిమాలు ఇష్టం. ఆవిడకు నాగేశ్వర్రావంటే పిచ్చి. ఆయనకు రంగనాయకమ్మ రచనలు ఇష్టం. ఆవిడ పొద్దస్తమానం యద్దనపూడి పుస్తకాలు ముందేసుకు కూర్చుంటుంది. ఆయనకు ఉల్లిపాయ పకోడీలు ఇష్టం. ఉల్లిపాయ పేరు చెబితే ఆమెకు వాంతి. ఆయనకు పేపర్లు ముద్దు. ఆవిడకి టీవీ సీరియళ్లు తప్ప వార్తలు పట్టవు. ఆయనకు ఐస్ క్రీం పడదు. కొంకర్లు పోయే చలికాలంలో కూడా ఐస్ క్రీం తినడం ఆవిడకి ఇష్టం. తీర్ధయాత్రలు చేయాలని ఆవిడ కోరిక. సాయంకాలపు 'తీర్ధ'యాత్రలు తప్ప పుణ్య క్షేత్రాల గొడవ ఆయనకు పట్టదు. ఇలా వారి అభిరుచులు, అభిప్రాయాలు ఒకదానికొకటి పొసగవు. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం. అయినా సరే వారి దాంపత్య జీవితం ఎలాటి ఒడిదుడుకులు లేకుండా యాభయ్ ఏళ్ళుగా సాగిపోతోంది.

అద్భుతాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే కాదు, అప్పుడప్పుడూ జీవితాల్లోకి కూడా తొంగి చూస్తుండాలి సుమా!



(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)

28, మే 2022, శనివారం

కాకతాళీయం కావచ్చు ..... భండారు శ్రీనివాసరావు


పాత తెలుగు సినిమాల్లో రానున్న ఘటనలను ముందు సూచనాప్రాయంగా చెప్పడానికి కొన్ని దృశ్యాలను చూపించేవారు. దేవుని గూట్లో వెలుగుతున్న దీపం హఠాత్తుగా ఆరిపోయినట్టు చూపిస్తే ఆ సినిమాలో ఒక పెద్ద  పాత్ర మరణించబోతున్నదని ప్రేక్షకులు ముందే  అర్ధం చేసుకునే వారు. ఇలాంటి షాట్లని సినిమా పరిభాషలో ఏమంటారో తెలియదు.

సినిమా రంగం నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఎన్టీఆర్ మాజీ  ముఖ్యమంత్రిగా 1990 లో కాబోలు బాపు దర్సకత్వంలో శ్రీనాధకవి సార్వభౌముడు అనే సినిమాలో నటించారు. గౌఢడిండిమభట్టు కంచుడక్క పగలగొట్టించి, తన కవితాపటిమతో తెలుగు నేల నాలుగు చెరగులా పేరు ప్రఖ్యాతులు ఆర్జించి ఓ వెలుగు వెలిగిన శ్రీనాధ కవిసార్వభౌముడు, తన అవసాన దశలో సమస్త భోగభాగ్యాలను పోగొట్టుకుని దయనీయ స్థితిలో కన్నుమూస్తాడు. అయినా ఆయన  గుండెధైర్యం ఆయనది. చెక్కు చెదరినది.

చివరి క్షణాల్లో కూడా 

“దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాధుడమరపురికి” అంటూ మరణిస్తాడు.

తన భవిష్యత్తు ఎలా వుండబోతోందో తెలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆ పాత్ర ధరించారని నేను అనుకోను. కానీ ముందు చెప్పిన సినిమా ఫార్ములా ఇక్కడ అచ్చుగుద్దినట్టు సరిపోయేలా, తదనంతర కాలంలో అనేక ఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి.




ఎక్కివచ్చిన మెట్లు -భండారు శ్రీనివాసరావు

నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.

1975లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లి లోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
ఇప్పుడు పిల్లల పుణ్యమా అని కారు యోగం. ఈ దశలో, అదేమిటో కారు ఆసాముల కష్టాలమీదనే నా ధ్యాస.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కేపై మెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.

ఎన్టీఆర్ తో ముడిపడిన కొన్ని జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు మే  28. ఎన్టీఆర్ జయంతి)

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.

"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు"

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.

అలాగే మరో జ్ఞాపకం.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.

ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.

ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు  కూడా వచ్చారు.

లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటినుంచి కబురు వచ్చినట్టు వుంది.

ఆయన మాతో చెప్పారు.

రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడినికాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను దూరంగా గోడకు ఆనుకుని నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరన్నది ఆరోజు ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక మరునాడు ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ. ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి అందులో ఎస్టీడీ సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’ అనే మాట వినబడింది. అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణారావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.

ఇక రేడియోకి, రామారావు గారికీ నడుమ సాగిన ఒక వివాదం చెప్పి ముగిస్తాను.

1982 లో టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగపాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.

ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రుచెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధ అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.

"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవానికి రాని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద సిబ్బందిని  పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు మా వాళ్ళు.

అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆ రాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) వి. సైదులు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.

దటీజ్ ఎన్టీఆర్.

అయితే ఈ ఉదంతం ఎంతగా చిలవలు పలవలు వేసిందంటే ఒక దశలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివాద స్థాయికి చేరుకుని ఆ పిదప అలాగే చల్లారిపోయింది.







27, మే 2022, శుక్రవారం

జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు

 

ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.

మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.

నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి.

ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.

నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)

నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.

1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.

అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.

అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.

దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.

దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.

1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.

మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.

మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –

'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం.

ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.

నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి.

దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు.

నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.

చివరిగా ఒక మాట.

గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.

(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)