27, మే 2022, శుక్రవారం

జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు

 

ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.

మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.

నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి.

ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.

నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)

నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.

1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.

అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.

అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.

దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.

దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.

1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.

మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.

మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –

'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం.

ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.

నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి.

దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు.

నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.

చివరిగా ఒక మాట.

గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.

(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)




1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నెహ్రూ గారు ఎప్పుడూ గాంధీ టోపీ ధరించేవాడు. ఆయన కూతురు మనవల్లకు గాంధీ పేరు వచ్చి చేరింది.

1962 చైనా యుద్ధం తరువాత మానసికంగా కృంగి పోయాడు అని చెబుతారు.