30, మే 2022, సోమవారం

జగన్ మూడేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు


ప్రజలు ఇచ్చిన అయిదేళ్ళ అధికార గడువులో మూడేళ్లు ఈ నెల ముప్పయితో ముగుస్తాయి. ఇంకా రెండేళ్ల వ్యవధానం మిగిలి వుంది.
అంటే ఆగి నిలబడి వెనక్కి తిరిగి చూసుకుని ముందుకు సాగాల్సిన సమయం అన్నమాట.
గత మూడేళ్లను ఒకసారి గమనిస్తే, ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా, జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని, పార్టీ రధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే అధికారిక ప్రకటనలు. మరోపక్క తొందరపడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఎన్నికల ప్రణాళిక రూపంలో ప్రజలకు చేసిన వాగ్దానాలలో తొంభయ్ శాతానికి పైగా నేరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది. కాదంటున్నాయి ప్రతిపక్షాలు. అది సహజం. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుంటూ పోయే పరిస్థితి లేని , మాట కూడా నిజం. అయితే ఈ విషయంలో అసలు వాస్తవం ఏది, ఎంత అనేది ప్రయోజనం పొందిన లేదా అందని ప్రజలు మాత్రమే చెప్పగలుగుతారు. అంచేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన గడప గడపకు అనే కార్యక్రమం ఒక్కటే ఈ విషయంలో ఒక అవగాహనకు రావడానికి గీటురాయి. ప్రజలను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి అయినా అసాధ్యం. అయితే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి, క్షేత్ర స్థాయిలో వాస్తవాలని తెలుసుకున్న పక్షంలో పధకాలు బాగా అమలు జరుగుతున్న చోట పని తీరును మరింత మెరుగు పరుచుకోవడానికి, లేదా అసంతృప్తి వున్న చోట ఆ లొసుగులను తొలగించుకుని ముందుకు పోవడానికి ఈ కార్యక్రమాన్ని మించిన కొలమానం మరోటి వుండదు.
ప్రజల దినవారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ వుంటే అది ఉత్తమ ప్రభుత్వం అనిపించుకుంటుంది అని చాణక్యుడు చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ఈ దిశగా మంచి అడుగు. ప్రజలు ప్రతి చిన్న పనికి గ్రామం దాటి వెళ్ళకుండా, వున్న ఊళ్లోనే వ్యవహారాలు చక్కబరచుకోవడానికి ఈ గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుత ప్రజాప్రతినిధుల వ్యవస్థకు సమాంతరం కాకుండా జాగ్రత్త పడాలి.
కరోనా సమయంలో నవరత్నాల రూపంలో జరిగిన నగదు బదిలీలు కింది స్థాయి ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అన్ని నెలలు ఉపాధి కోల్పోయినా కూడా బడుగు బలహీన వర్గాల ఆర్ధిక స్థితి అతలాకుతలం కాకుండా ఈ నిధులు వారికి అక్కరకు వచ్చాయి. అమెరికా వంటి సంపన్న దేశాలలో సయితం కరోనా వేళ అక్కడి ప్రభుత్వాలు నగదు బదిలీ రూపంలో ప్రజలకు అందించిన సాయం జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తోడ్పడిందని పత్రికలు రాశాయి.
వాగ్దానాల అమలుకోసం మరో ధ్యాస పెట్టుకోకుండా, విమర్శలను ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి ఏకాగ్రతతో పనిచేయడం వల్ల వాటి అమలు శాతం ప్రభుత్వానికి సంతృప్తి కలిగించే స్థాయిలో వుంది. ఇక రానున్న రెండేళ్ల కాలాన్ని అత్యంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పొరబాట్లు జరిగితే దిద్దుకోవడానికి, తప్పులు జరిగితే పునరావృతం కాకుండా చూసుకోవడానికి, ఇక ముందు ముందు ఎలాంటి పొరబాట్లు, తప్పులు జరగకుండా చూసుకోవడానికి రెండేళ్ల సమయాన్ని వాడుకుంటే ప్రభుత్వ పధకాల అమలు, ప్రజల సంతృప్త స్థాయి నూటికి నూరు శాతం చేరడానికి వీలుపడుతుంది.
“జగన్ ఓ సీతయ్య. ఎవరి మాటా వినడు” ఇలాంటివి వినడానికి బాగుంటాయి. పాలకుడు అనే వాడు తన కళ్ళతో చూడాలి. తన చెవులతో వినాలి. అంటే వాస్తవాన్ని మాత్రమే చూడగలగాలి. వినగలగాలి. ఎవరో చెప్పింది వినడం, ఎవరో చూసి చెప్పింది నమ్మడం వంటి లక్షణాలు పరిపాలనను బలహీన పరుస్తాయి.
అయితే ఈ మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి అనుకోవడానికి కానీ, మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందన్న భరోసా కానీ లేదు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది అనేది ప్రతిపక్షాల వాదన. వాళ్ళు అలాగే అంటారు అని పైకి చెప్పుకోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా వుందని ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిన తర్వాత చేయగలింది ఏమీ వుండదు.
“అంతా బాగానే వుంది అని అనుకోవడానికి, అంతా సజావుగా వుంది అనడానికి చాలా తేడా వుంది. ప్రజల ఆలోచనా ధోరణి ఎల్లప్పుడూ ఒకే రీతిగా వుండదు. అది ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో పసి కట్టి చెప్పగల మేధావులు లేరు. పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా వుంది, లేదా పరిస్తితులు అత్యంత అనుకూలంగా వున్నాయి అనే ఈ రెండింటి నడుమ అసలు వాస్తవం దాగి వుంటుంది. దాన్ని ఒడిసిపట్టుకోగల చాకచక్యం కొరవడితే ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి”
గత ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో రాసిన వాక్యాలే ఇవి.
ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి.
గతం నుంచి పాఠాలు నేర్చుకుని, నేర్చుకున్న పాఠాలను వర్తమానంలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదిలంగా వుంటుంది.
లేని పక్షంలో గతమే చరిత్రగా మారుతుంది.




(30-05-2022)

కామెంట్‌లు లేవు: