31, ఆగస్టు 2014, ఆదివారం

కుంచె కన్నీళ్లు కారుస్తోంది



బాపు ఇక లేరు. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి  గుండెలు బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే  ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఈరోజు పూర్తయింది. బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ  చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు.  బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.  కాకపొతే ఇన్నేళ్ళుగా ఆయన  బొమ్మల్ని చూసి కడుపారా నవ్వుకున్న జనాలు, ఆయన మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఆదివారం తెలుగు చిత్రపరిశ్రమకు గాడాంధకారం.

డెబ్భయ్ ఏళ్ళుగా రాస్తున్న కలం


ఆయన రచనా దాహం తీరనిది. అందుకే డెబ్భయ్ ఏళ్ళనుంచి రాస్తూ నిన్నటికి నిన్న తొంభయ్యవ పడిలో ప్రవేశించిన జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో తనకోసం ఏర్పాటయిన ఆత్మీయ సత్కార సమావేశానికి వచ్చేముందు కూడా వీక్షణం పత్రిక్కి వ్యాసం రాసేవచ్చారు. ఇన్నేళ్ళుగా ఆయన్ని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చిన వారి శ్రీమతి సరళ గారు, కుమారుడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ బాబు, కోడలు మాధురి, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు వరదాచారి గారు, చాలా నిరాడంబరంగా, సంసార పక్షంగా సాగిపోయిన ఈ  ఈ చిరు కార్యక్రమంలో పాల్గొన్నారు.



జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు అనేకమంది ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ తొంభయ్యవ ఏట ప్రవేశించిన హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి.
ఈ చిన్ని సమావేశంలో చాలాకాలం గుర్తుంచుకోవాల్సిన అనేక గొప్ప విషయాలను వక్తలు ప్రస్తావించారు. పాత సంగతులు నెమరు వేసుకున్నారు. హనుమంతరావు గారితో తమ పరిచయం గురించి సింహావలోకనం చేసుకున్నారు. ఆయన గురించి బాగా తెలిసిన వారికి కూడా ఆయన్ని గురించి తెలియని విషయాలు బాగా తెలిసివచ్చేలా ప్రసంగాలు సాగాయి.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకే. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా నిన్న జరిగిన సత్కారంలో  న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగం వాటా నిస్సంశయంగా హనుమంతరావు గారి అర్ధాంగి సరళ గారిదే.  

           

30, ఆగస్టు 2014, శనివారం

ఆడ తెలివి


'ఆడవాళ్ళ మెదడు చాలా చురుగ్గా పాదరసంలా  పనిచేస్తుందోయ్' అన్నాడు ఏకాంబరం
'అల్లా అని యెల్లా చెప్పగలవు' అడిగాడు లంబోదరం.
'ఇల్లా' అంటూ మొదలెట్టాడు ఏకాంబరం
ఏకాంబరానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా స్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఒకరోజు చావుబతుకుల్లో వున్న దూరపు చుట్టాన్ని చూట్టానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ సాయంత్రం భార్యతో అన్నాడు.
'చావు ప్రతివాడికీ తప్పదు. అటువంటప్పుడు ఆసుపత్రిలో అన్ని రకాల గొట్టాలు తగిలించుకుని రేపోమాపో అనే ప్రాణాన్ని కాపాడుకోవడం అవసరమా? నేనయితే అలాటి లైఫ్ సపోర్టింగ్ కనెక్షన్లు తీసేసి హాయిగా ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటాను'
ఏకాంబరం వాగుడు విని అతగాడి భార్య లేచి వెళ్లి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించింది. 


Note: Courtesy Cartoonist 

నారు పోసినవాడే......

యేవో అనుకున్నాం కానీ మధ్య మధ్య ఈ అల్పపీడనాలు గట్రా లేకపోతే జనాలు ఏవయిపోయేవాళ్ళో ఏమో!


(Note:Courtesy Image Owner)
  

29, ఆగస్టు 2014, శుక్రవారం

తప్పులున్న క్షమించగలరు


పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా తప్పులున్న క్షమించగలరుఅనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీ  సారీఅనే పదాన్ని  ఉదారంగా ఎక్కువసార్లు  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీచెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడంఅని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖఃడం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే  దుష్కృత్యాలు.  చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  ‘నేను చేసిన తప్పులను మన్నించండిఅని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.





NOTE: Courtesy Image Owner


28, ఆగస్టు 2014, గురువారం

శాసనసభల్లో అనకూడని మాటలు


Article 208 (1) of the Indian Constitution empowers each House of the Legislature of a State to make rules for regulating its Procedure and conduct of its Business. In pursuance of the said article, the Legislative Assembly of Andhra Pradesh, immediately after the formation of the State of Andhra Pradesh, has framed its own Rules of Procedure and Conduct of Business.
Words containing insinuations, and offensive and unparliamentary expressions should be carefully avoided by all when addressing the Chair.
When the speaker holds that a particular word or expression is unparliamentary, it should be immediately withdrawn by the member who has used it, without trying to raise any debate over it.
Unparliamentary Expressions
Members are informed that a publication titled “Unparliamentary Expressions (2009) is available on sale at Loksabha Secretariat. (Price: Rs.1700/-)
SOME UNPARLIAMENTARY EXPRESSIONS WHICH ARE IN THE BOOK
Bad words deemed ‘unparliamentary’ include:
‘Ringmaster’
■ Communist
‘Animal’
‘Scumbag’
‘Sh*t’ or the ever-popular ‘bucket of sh*t’
‘Badmashi’
‘Bad’ (as in bad man)
‘Bandicoot’ (fair enough too)
cannot refer to female MPs as ‘beloved’ or ‘darling’
‘double-minded’ having ‘double-standards’ or engaging in ‘double-talk’
‘rat’ or ‘dirty little rat’
Some such words are:
"black mailers", "blackmarketeers", "buffoons", "bullies", "cheats", "goondas", "monkeys", "monsters", "scoundrels", or  "rogues" to describe members; "imbecile" or "irresponsible" to describe the House or a section thereof, "rubbish", "rotten lie", “tissue of lies", "insincere", "ridiculous" or "nonsense", to describe a speech of a member.

(Kind courtesy of Shri Pattabhi garu, Advocate by profession)

వాద సంవాదాల సభగా మిగిలిపోతున్న శాసనసభ


అసెంబ్లీలో ఏం జరుగుతోంది అనేది ఈనాడు అందరి మనస్సులను కలచివేస్తున్న అంశం.  దీనికి సమాధానం అన్వేషించడానికి, సమస్యను పరిష్కరించడానికి అయిదు నక్షత్రాల హోటళ్ళలో లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి శాసన సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన పనిలేదు. శాసన సభ ప్రాంగణంలోనే సభ్యులకోసం అత్యంత విలువైన గ్రంధాలయం వుంది. నేను విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో కదాచిత్ గా ఆ గ్రంధాలయంలోకి అడుగుపెడుతూ ఉండేవాడిని. తెన్నేటి విశ్వనాధం గారు, పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు గారు,  బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, వెంకయ్యనాయుడు గారు,  జయపాల్ రెడ్డి గారు, సీ హెచ్ విద్యాసాగర్ రావు గారు వంటి ఉద్దండులు  ఆ గ్రంధాలయాన్ని ఉపయోగించుకుంటూ వుండడం నాకు తెల్సు. ఇప్పటి శాసన సభ్యులు, ముఖ్యంగా తొలిసారి సభలో అడుగుపెట్టిన వారు ఈ లైబ్రరీకి వెళ్లి వెనుకటి కాలంలో సభ ఎలా నడిచేది అన్న విషయంపై అవగాహన పెంచుకోగలిగితే అసలు సమస్య దూదిపింజలా ఎగిరిపోయే అవకాశం ఎక్కువ. కానీ వారికి అంతటి తీరికా   ఓపికా వుంటాయా అంటే నాకు అనుమానం కూడా ఎక్కువే.
శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు వాటిని సజావుగా నిర్వహించడానికి కొన్ని నిర్దేశిత నియమ నిబంధనలు వుంటాయి. వాటిని గురించి కొత్త సభ్యులకు, పాతవారికి కూడా పూర్తి సమాచారం అందిస్తారు. సభలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఇలా అన్ని విషయాలపై సభ్యులకు వివరాలు అందచేస్తారు. పాలక ప్రతిపక్షాలు వీటిని తుచ తప్పకుండా పాటిస్తే పేచీయే లేదు. ఇలాటి వ్యాసాల అవసరమూ వుండదు. గతాన్ని తవ్వితీయడంలో చూపిస్తున్న శ్రద్ధాసక్తులు గతంలోని మంచిని గ్రహించడంలో ప్రదర్శిస్తే వర్తమానం ఇంట బాధాకరంగా వుండదు. భవిష్యత్తు గురించి బెంబేలు పడాల్సిన పరిస్తితి ఉత్పన్నం కాదు.
జనతా ప్రభుత్వం నాటి ఒక ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి.  జార్జ్ ఫెర్నాండెజ్ ఆయన మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన ఓ సందర్భంలో మాజీ ప్రధాని  ఇందిరాగాంధీని ఉద్దేశించి 'She is a perennial liar'  (ఆవిడ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు) అని వ్యాఖ్యానించారు. దానిపై దుమారం రేగింది. అభ్యంతరపెట్టింది కూడా ప్రధానమంత్రి కావడం విశేషం. 'ఉన్నమాటే చెప్పాను' అంటారు ఫెర్నాండెజ్. 'అయినా కానీ అలా అనివుండాల్సింది కాదు. కాదూ కూడదు అనాలని అనిపిస్తే 'She seldom tells truth'  (ఆవిడ చాలా అరుదుగా నిజం చెబుతారు) అనాలి' అన్నారు మొరార్జీ.
   
అలాగే ఒకనాటి రోజుల్లో,  శాసనసభ  నడిచే తీరుతెన్నులు ఎలా  వుండేవో తెలుసుకోవడానికి కొన్ని మచ్చు తునకలు:       
ఆంద్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి గారు ఒకసందర్భంలో  ప్రతిపక్ష కమ్యూనిస్ట్ సభ్యులు శాసన సభ నుంచి వాకవుట్ చేస్తేనే ఎంతగానో మధన పడ్డారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగం అసెంబ్లీ లైబ్రరీ రికార్డులలో పదిలంగా వుంది. 
1959  ఆగస్టు ఒకటో తేదీన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి  సంజీవరెడ్డి గారు తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించారు.
"చర్చ ఇంత సవ్యంగా జరుగుతున్న  ఈ తరుణంలో తలవని తలంపుగా  దేశంలో ఎక్కడో జరిగిన ఒక చర్యకు నిరసనగా మిత్రులు సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలా విచారకరం. కేరళలో అంశాన్ని నేను సభలో ప్రస్తావించడం న్యాయం కాదు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. కాంగ్రెసు వారు నాలుగు సీట్లు కూడా గెలవరని అనుకున్నారు. కానీ ఎంతో మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఒకసారి ఒక పార్టీ, మరొకసారి మరో పార్టీ అధికారం లోకి రావచ్చు. ఇది ఈనాటి ధర్మం కాదు. వేదకాలం నుంచి వస్తోంది. పాత కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా రెండు పక్షాలు గెలవ్వు. ఎవరో ఒకరే గెలుస్తారు. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు. 'రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే' అని. అందువల్ల ప్రతిపక్షం ఇక్కడ లేకపోయినా నేను వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ ప్రశాంతతను కాపాడుకోవాలి. ప్రశాంతవాతావరణం వుందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. దానికి క్రెడిట్ ప్రభుత్వానిది కాదు, పోలీసులదీ కాదు ఆ క్రెడిట్ ప్రతిపక్షానిది అని వెంకటేశ్వర్లు గారు చెప్పారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. అప్పోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కల్సి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం వున్నాయి."          

ప్రతిపక్ష నేత, కమ్యూనిష్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు 1960 రాష్ట్ర బడ్జెట్ పై చేసిన ప్రసంగాన్ని ఓసారి పరికిద్దాం.
"శాసనసభ అంటే ప్రభుత్వానికి ఎంతమాత్రం లక్ష్యం లేదు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం లేదు. ....శాంతిభద్రతల విషయానికి వస్తే ...ముఖ్యమంత్రి సంజీవయ్యగారు ఈమధ్య ఖమ్మం జిల్లా ఉద్యోగస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్టుగా నడుచుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రిగారు బోనకల్లు, కనికల్లులలో చేసిన ప్రసంగాల పేపర్ కటింగ్స్ మాదగ్గర వున్నాయి. కమ్యూనిష్టులను తంతాము, చంపుతాము అన్నారు. మేము ఏకొద్దిమందిమో ఉన్నాము. ముఖ్యమంత్రిగారికి తమ పార్టీకి  మెజారిటీ వున్నదని, పోలీసు, సైన్యం బలం వున్నదన్న ధీమాతో అలా చెప్పవచ్చు. కానీ మమ్మల్ని చంపినంత మాత్రాన ఆహార సమస్య పరిష్కారమవుతుందా. ముఖ్యమంత్రిగారు తాను  అలా అనలేదని అంటున్నారు. సంతోషమే. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం వారు అలా మాట్లాడారని తెలుస్తోంది" 
కర్నూలు రాజధానిగా వున్న ఆంద్ర రాష్ట్ర శాసనసభలో 1956  ఫిబ్రవరి ఒకటో తేదీన  విశాలాంధ్ర ఏర్పాటు తీర్మానం ప్రవేశపెడుతూ,  అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలు. అందులో ప్రస్తుతానికి కూడా వర్తించే కొన్ని అంశాలు:
"విశాలాంధ్ర  ఏర్పాటు చేసే ప్రతిపాదనపై  పొరుగునవున్న  మైసూరు,  మహారాష్ట్ర వాళ్ళు తమ ప్రాంతాలకు సంబంధించిన శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంటే ఆంధ్రులు మాత్రం 'మా భవిష్యత్తు ఎలా వుంటుంది, కలిసివుంటామా, లేక ఆంధ్రులలోనే చీలికలు వస్తాయా' అని ఆందోళన చెందుతున్నారు. 'ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాదులో విలీనం చేయకుండా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచుదాం, ఆరేళ్ళ తరువాత ఆలోచిద్దాం' అని కొందరు అంటున్నారు. మద్రాసునుంచి విడిపోయి రెండేళ్ళు గడుస్తున్నా ఇంకా ఆఫీసులు అక్కడే వున్నాయి. కర్నూలుపై ఇప్పటిదాకా రెండున్నర  కోట్లు ఖర్చు పెట్టాం. అయిదేళ్ళదాకా మన ఆఫీసులు మద్రాసులో ఉంచుకుని ఇక్కడ కర్నూలులో మనం వుంటే పాలన అవకతవకగా ఉంటోంది. మరో అయిదేళ్ళు ఇక్కడే వుండాల్సివస్తే, మరో మూడుకోట్లు వృధా ఖర్చు. అయిదారేళ్ళ తరువాత మూటా ముల్లె సర్దుకుని హైదరాబాదు పొతే ఎవరికి లాభం? ఇన్నేళ్ళు ఇక్కడ ఇసుక సున్నం మీద పెట్టే  మూడుకోట్ల డబ్బుతో వెనుకబడిన హైదరాబాదులో వంద స్కూళ్ళు కట్టుకోవచ్చు'
ఆంద్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత ఏర్పడ్డ తొలి శాసన సభకు తొట్టతొలి స్పీకర్ గా కాంగ్రెస్ కురువృద్ధుడు అయ్యదేవర కాళేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1956 నవంబర్ నాలుగో తేదీన ఆయన స్పీకర్ గా మొదటి ప్రసంగం చేసారు.      
"మీరందరూ ఈ సభాద్యక్ష స్థానాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు. మీరందరూ ఇష్టపడినట్టయితే, మీ అందరి అనుమతితో ఒక పని చేయదలచుకున్నాను. స్పీకర్ బల్ల మీద వున్న ఈ వెండి దండాన్ని తీసివేస్తాను. ఈ వెండిదండం భూస్వామ్య వ్యవస్థకు, రాచరికానికి గుర్తు. ప్రజాస్వామ్యంలో దీనికి స్థానం లేదు."
1959 ఆగష్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ ప్రసంగాని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు అంశాలవారీగా సమాధానం చెప్పారు.
"ఎవరూ చెప్పని ఒక విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో, న్యాయం అని తోచినప్పుడు కూడా పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్ శాతం వాళ్ళ సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్? ఒక్క శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి, పల్లెతూరివారికి తెలియదు కానీ, తెలిస్తే ముఖ్యమంత్రి మొదలుకుని కిందివరకు రాళ్ళతో కొడతారు. 330  లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటే,  ఒక లక్షమందో, రెండు లక్షల మందో చదువుకున్నవాళ్ళమని మనం అనుకుని, వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని పంచేసుకుంటూ- (వుంటే బాగుంటుందా!) ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి  ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి,  రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి కరెంటు వస్తుంది అని అడిగితె అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు.  చదువు సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే  ఏమిటో, కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు పంపుతారు. 'మీరూ వద్దు, మీ రాజ్యమూ వద్దు, మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతాము' అంటారు. ఆ పచ్చి నిజాన్ని బాగారెడ్డి గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"
ఇది ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా. ఒక ప్రతిపక్ష నేత కూడా ఈ విధంగా నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి.
కాబట్టి నేతలూ, గతం ఎలా ఉండేదో,  ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించేవారో తెలుసుకోవడానికి ఒక్కసారి అసెంబ్లీ లోని ఆ గ్రంధాలయానికి వెళ్ళండి. 'కాదు, ఇలానే వాద ప్రతివాదాలతో సమయం గడుపుతాము, రాజకీయాలతోనే పొద్దు పుచ్చుతాము' అంటే ఎవరూ చేయగలిగింది ఇప్పట్లో ఏమీ  లేదు. సర్వం తెలిసినవాళ్ళని, సర్వజన సంక్షేమం కనిపెట్టి చూస్తారని  ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధులుగా శాసన సభలోకి పంపారు.  శాసన కర్తలుగా మీకు ఎన్నో హక్కులు వున్నాయి. అదేసమయంలో బాధ్యతలు కూడా అంతే వున్నాయి. హక్కులు గుర్తున్నవారు బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రోజూ అసెంబ్లీలో జరిగేది చూస్తున్నప్పుడు  నిష్టురమైన ఈ నిజాన్ని చెప్పకతప్పని రోజులు వచ్చాయనిపిస్తోంది.


27, ఆగస్టు 2014, బుధవారం

కాటికాపరి కధ


‘కలం కూలీ’, కీర్తిశేషులు  జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా  విభిన్న వ్యావృత్తులకు చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు.  ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ  గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే – బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో  సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చొను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.

(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)


(అలాటి గొప్ప జర్నలిష్ట్ కృష్ణ గారితో నేను - రోశయ్యగారి వెనుక)

26, ఆగస్టు 2014, మంగళవారం

ఐస్ బకెట్ సవాల్


ఓ  అరవై  ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో  అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. దానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము,  వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు  అన్నం వొండిపెట్టేవారు. అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునేవాళ్ళు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,  చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు.
ఈనాడు బహుళప్రచారంలో వున్న 'ఐస్ బకెట్ ఛాలంజ్' గురించి చదువుతున్నప్పుడు జ్ఞాపకాల పొరల్లో దాగుండిపోయిన అన్నదాన సమాజం గుర్తుకువచ్చింది.   
సోషల్ మీడియా సైట్స్ తెరిచి చూస్తె చాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తాయి ఐస్ బకెట్ ఛాలంజ్  వీడియోలు. వాటి తాలూకు  ఫోటోలు, బకెట్ల కొద్దీ ఐస్ నీళ్ళను నెత్తిన దిమ్మరించుకుంటూ, 'చూశారా నేనెంత సాహసం చేశానో, మీరూ చెయ్యండి చూద్దాం' అనే  సవాళ్లు విసురుతూ
బకెట్లకొద్దీ ఎన్ని నీళ్ళు వృధా  అయ్యాయో తెలియదు కానీ, ఈ బకెట్ల సవాళ్ళ ఉద్యమం మొదలైన నెల రోజుల్లోనే అక్షరాలా పదహారు మిలియన్  డాలర్లు  ఏ.ఎల్.యస్. అసోసియేషన్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నందుకు, ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు   ఇదే  అసోసియేషన్ కు నిరుడు ఇదే కాలంలో వచ్చిన విరాళాలు పద్దెనిమిది లక్షల డాలర్లు మాత్రమే. కానీ ఈసారి సోషల్ మీడియా పుణ్యమా అని విరాళాల  మొత్తం ఒక్కసారిగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. 'అమ్యోట్రాపిక్ లేటరల్ స్క్లెరోసిస్' అనబడే ఒక నోరు తిరగని వ్యాధిపై ఈ అసోసియేషన్  ఏళ్ళతరబడి పరిశోధనలు చేస్తూ వస్తోంది. అది మరీ నోరుతిరగడం లేదని మరొకరు దీనికి లౌ గెహ్రిగ్స్ జబ్బు అంటూ మరో నోరుతిరగని పేరు పెట్టి ప్రచారంలో పెట్టారు. నరాలకు సంబంధించిన ఒకరకమైన జబ్బు ఇది. నరాలు కుంచించుకుపోవడం, మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. అమెరికాలో ఏటా అయిదారువేలమంది దీని బారిన పడుతున్నారని, వ్యాధి సోకినవారిలో లక్షమందిలో ఇద్దరు మృత్యువాత పడుతున్నారనీ గణాంకాలు తెలియచేస్తున్నాయి. బకెట్ ఐస్ నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుంటూ, దాన్ని వీడియోలు తీయించుకుంటూ, మళ్ళీ వాటిని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తూ, 'మీరూ ఇలా చేయగలరా' అని తమ సన్నిహితులకు సవాళ్లు విసురుతూ వందలకొద్దీ డాలర్లు ఆ ఏ.ఎల్.యస్. అసోసియేషన్ కు విరాళాలు పంపుతున్న వారికి అసలు ఏ.ఎల్.యస్. అసోసియేషన్ అంటే ఏమిటో తెలుసా అంటే అనుమానమే. ఇందులో పాల్గొంటున్నవాళ్ళు  ఆ అసోసియేషన్ కు ఇచ్చే విరాళం కంటే కూడా ఎక్కువ మొత్తాలను  ఐస్ కొనడానికి  ఖర్చుచేస్తున్నారని విమర్శించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే, ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఐస్ వాటర్ బకెట్లకొద్దీ నెత్తిన దిమ్మరించుకుంటున్న వాళ్ళలో అనేకమంది ఆ సంస్థకు విరాళాలు పంపుతున్నారో లేదో తెలియదు కాని. ఐస్ వాటర్ బకెట్ దృశ్యాలను వీడియోల్లో  చిత్రీకరించి, సోషల్ మీడియాలో ప్రదర్శించడం ద్వారా మంచి ప్రచారం మాత్రం కల్పిస్తున్నారనేది కాదనలేని సత్యం. అందుకే ఈ ఉద్యమం ''భయంకరమైన అంటువ్యాధి' మాదిరిగా అతి తక్కువకాలంలో దేశదేశాలకు పాకిపోయింది. పైగా మైక్రో సాఫ్ట్ వంటి కంప్యూటర్ దిగ్గజాల సీ.ఈ.ఓ. లు స్వయంగా ఈ ఐస్ వాటర్ బకెట్ ఛాలంజ్ వీడియోల్లో స్వయంగా దర్శనం ఇవ్వడంతో దీనికి విశ్వవ్యాప్త ప్రచారం ఇట్టే లభించింది. ఇక మనదేశంలో సరేసరి. అమెరికాలో ఎవరయినా విజిల్ చేతిలో పట్టుకుంటే మనదగ్గర ఈలలు వేసే సంస్కృతి. ఇక చెప్పాలా. ఐస్ వాటర్ బకెట్లకు ఎక్కడలేని ప్రచారం. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని సెలెబ్రిటీ అనిపించుకోవాలని చూసేవారే.  
     
సరే బాగానే వుంది. ప్రచారం బాగానే వుంది. కానీ ప్రచారం ఒక్కటే ఏ ఉద్యమానికయినా ఊతం ఇస్తుందా. ఈ ప్రశ్నకు సమాధానం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ 'యునిసెఫ్' ఒక ప్రకటన రూపంలో కనబడింది.
'ఫేస్ బుక్ లో మాకు లైక్ కొట్టండి. కానీ ఆ లైక్ లతో  మేము ఒక్కరంటే ఒక్కబిడ్డకు కూడా పోలియో చుక్కలు వెయ్యలేము'  (అంటే ఏమిటన్నమాట. ప్రచారంతో పనులు జరగవని)
ఏ.ఎల్.యస్. సంస్థ పేరుతొ సాగిపోతున్న ఈ ఆన్ లైన్ ప్రచారంపై కెనడాలో కొంత పరిశోధన జరిగింది. 'ఆన్ లైన్ లో ఏదో చేస్తున్నారు అని ఒక వ్యక్తికీ కానీ, సంస్థకు కానీ బహుళ ప్రచారం జరిగిందంటే, ఇక వాస్తవ జీవితంలో వాళ్ళు సాధించేది ఆ స్థాయిలో వుండదు'అన్నది ఆ పరిశోధన సారాంశం.
సోషల్ సైట్లను సందర్శించేవారికి అనునిత్యం ప్రజా సమస్యలపై  అనేక రకాల పిటీషన్లు , విరాళాలకోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా కానవస్తుంటాయి. చాలామందికాకపోయినా కొందరయినా వాటికి స్పందించి చేతనయిన సాయం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఆ రకమైన ఆన్ లైన్ పిటీషన్ లపై స్పందించనివారు, సంతకాలు చేయనివారు కూడా తమకు ఏమాత్రం సంబంధం లేని ప్రజాహిత కార్యక్రమాలకు అంతకంటే ఎక్కువగా విరాళాలు పెద్ద ప్రచారం లేకుండా ఇస్తుంటారని మరో అధ్యయనంలో తేలింది.
ఇప్పుడు ఉధృతంగా సాగిపోతున్న ఐస్ బకెట్ ఛాలంజ్ విషయానికి వస్తే, ఇది ఎన్నాళ్ళు నిలవగలదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మనిషి సంఘజీవి (సోషల్ యానిమల్) అంటారు. ఈనాటి మనుషుల్లో కొందర్ని 'సోషల్ మీడియా యానిమల్స్' అనొచ్చు అనేది శాస్త్రవేత్తల అబిప్రాయంగా వుంది.
'కొన్ని అంశాలు  సోషల్ మీడియాలో సంచరించే ప్రజల  దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిపై స్పందించి దాన్ని వెంటవెంటనే ఇతరులకు క్షణాలమీద చేరవేస్తారు. కాని ఇటువంటివారు తాము ఇచ్చిన  విరాళాలు ఎలా ఖర్చు అవుతున్నాయో అనే దానిపై దృష్టి పెడతారు. వారికి ఆ విధానాలు నచ్చకపోతే మరోసారి అటువంటివాటి జోలికి వెళ్ళరు' అంటున్నారు వారు.

ఐస్ బకెట్ వాటర్ ఛాలంజ్ పట్ల  భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా  ప్రాచుర్యం పొందిన అంశం మరోటి లేదు అనే విషయంలో మాత్రం అందరు ఏకీభవిస్తున్నారు.   

NOTE: Photo Courtesy Image Owner  

24, ఆగస్టు 2014, ఆదివారం

333333

ఇదో తుత్తి
333333

ఆరు  మూళ్లు. అంటే  మూడు లక్షల ముప్పై మూడువేల మూడువందల ముప్పై మూడు. నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటితో ఈ అంకెను దాటిపోయింది. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

ఓ మొగుడి 'ఆత్మ'కధ


(నిజంగా కధే సుమా!)

మా ఆవిడ కంటే మా కోడలు అదృష్టవంతురాలు. ఆమెకు ప్రేమించే మొగుడు దొరికాడు.
ఆ మాటకు వస్తే  నేనూ ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఈ వయస్సులో అబద్ధం చెప్పడం యెందుకు? నన్ను ప్రేమించిన మా ఆవిడను నేను పెళ్ళాడాను.
నన్ను పెళ్ళిచేసుకుని ఆవిడ ఏం సుఖపడిందో నేను గ్యారంటీగా చెప్పలేను కాని ఆవిడ్ని చేసుకుని నేను చాలా లాభపడ్డాను.
అంటే బోలెడు బోలెడు కట్నం డబ్బులతో మా ఇంటిని మెట్టిందని కాదు. కట్టుడు చీరేతోనే కాపురానికి వచ్చినా ఆ తరువాత నా జీవితానికి ఎక్కడా లేని నిశ్చింతను తెచ్చిపెట్టింది. నా భార్య కుడికాలు మోపిన దగ్గరనుంచి నేను కాలు మీద కాలు వేసుకుని బతగ్గలిగే బతుకు నా సొంతమయింది.
మొదటినుంచీ నాది స్వతంత్ర ప్రవృత్తి. దానికి తోడు ఏదో కధలూ కాకరకాయలు గిలుకుతానని నమ్మకం.
ఈ చేతకానితనానికి నేను ఓ సిద్ధాంతాన్ని  తగిలించి ప్రచారం చేసుకున్నాను.   తన రెండు కాళ్ళమీద తాను నిలబడలేని వాడే ఉద్యోగం చేస్తాడని, తనపై తనకు నమ్మకం వున్న ఏ మనిషయినా సరే  తనకు తానుగా పైకి ఎదగడమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తాడని బీరాలు పలుకుతూ, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చినా చేయకుండా రెండు కాళ్ళు ముడుచుకుని ఇంట్లోనే వుండిపోయాను. దాంతో మా ఆవిడే నన్నూ, నా వల్ల పెరిగిన సంసారాన్నీ ఒంటిచేతిపై  సాకడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె తేనెటీగలా నిరంతరం శ్రమించింది. నన్ను నా మానాన వొదిలేసిందన్న సంతోషంతో నా బాధ్యతారాహిత్య జీవితాన్ని మరింత ఆనందంగా గడపడం మొదలుపెట్టాను.
మా అందరికోసం అంతగా కష్టపడే మా ఆవిడ పట్ల నేనెప్పుడూ రవంత జాలి చూపిన జ్ఞాపకం లేదు. అదేదో ఆవిడ బాధ్యత అనుకునేవాడిని. నేనూ నా స్నేహితులూ, కధలూ, సభలూ, సమాజాన్ని మార్చడానికి అడ్డమయిన చర్చలూ, అలా అలా అదోవిధమయిన మత్తులో జీవితం గడిచిపోయింది.
దేవుడనేవాడు వున్నాడో లేదో తెలియదుకాని, వుంటే వాడి దయవల్ల  వున్న ఒక్క కొడుకు ప్రయోజకుడయ్యాడు. అందులో నా ప్రయోజకత్వం యెంత మాత్రం లేదు. ఆ విషయం నాకు తెలుసు కానీ నలుగురికీ తెలియదు కదా. వాడి ఎదుగుదలలో నా పాత్రను గురించి  తెలిసిన నలుగురూ పదిమందిలో పొగుడుతుంటే తెలియని ఆనందంతో పొంగిపోయేవాడిని. కనీసం  మర్యాదకు కూడా అలాటి సందర్భాలలో మా ఆవిడ ప్రసక్తి తెచ్చేవాడిని కాదు.
ఇలా ఇలా మా కధ సాగిపోతూవుండగా  సినిమాలో ఇంటర్వెల్ ముందు చిన్న క్లైమాక్స్ మాదిరిగా -
కన్నతండ్రిని,  నాతో  ఒక్క మాట కూడా చెప్పకుండా నా ఒక్కగానొక్క కొడుకువాడి ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయిని గుళ్ళో పెళ్ళాడి ఇంటికి తీసుకువచ్చాడు. బుద్దులెక్కడికి పోతాయి చెప్పండి.
కానీ నా బుద్దులు వాడికి వొంటబట్టిన దాఖలాలు ఆ తరువాత కనబడలేదు. కొత్త పెళ్ళాన్ని కాలుకందనీయకుండా చూసుకునే వాడి వైనాన్ని చూస్తుంటే నాకు వొళ్ళు మండిపోయేది. అదేమిటో ఆ క్షణంలో నాకు వాడు కొడుకన్న సంగతి కూడా మరచిపోయి కోడలిపట్ల వాడు చూపుతున్న ప్రేమా,ఆదరణా చూసి, పైకి అనకూడదు కానీ లోలోపల   అసూయపడేవాడిని. కానీ,  మా ఆవిడ మాత్రం కోడలంటే ప్రాణం పెట్టేది.  కూతురు లేని కొరతను కోడలుతో తీర్చుకుంటున్నట్టుగా వుండేది ఆమె ప్రవర్తన. నిజానికి మా ఆవిడ పడాలి అసూయ, నన్ను కట్టుకున్న అనుభవంతో, నాతో  కాపురం చేసి పొందిన  అనుభవాలతో.  
పాపీ చిరాయువు అంటారు. కానీ, జీవుల జమాలెక్కలు పైనుంచి చూసే ఆ భగవంతుడికి అది తెలిసినట్టు లేదు.
అందుకే    రోజు ఇంట్లో కాళ్ళు బారజాపి  టీవీలో సీరియల్ చూస్తున్న నన్ను, ఎవరినో అడ్డంపెట్టి బయటకు పిలిచాడు. మామూలుగా సహజ బద్ధకంతో  పట్టించుకోని నేను వెంటనే బయలుదేరిపోయాను. నేను వెడుతున్న ఆటో సందు మలుపు తిరుగుతుండగానే ఓ లారీ వచ్చి కొట్టింది. అంతే. అంతవరకే తెలుసు.
కాకపోతే ప్రాణాలు పోతున్నప్పుడు మా ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఆవిడ మా కుటుంబం కోసం పడ్డ కష్టం జ్ఞాపకం వచ్చింది. బహుశా ఈ ఒక్క కారణం తోనే అనుకుంటా నేను నమ్మని ఆ దేవుడు ఈ నాలుగు ముక్కలు నలుగురితో చెప్పి గుండె బరువు తగ్గించుకునే ఈ వెసులుబాటు ప్రసాదించాడు. ఇందులో మరో మతలబు కూడా వుండవచ్చేమో. ఇది చదివి నాలాటి వారిలో ఏదయినా కొద్ది మార్పు అయినా వస్తుందన్న ఆశతో చేసివుంటాడేమో! అందుకే దేవుడు పిచ్చివాడన్నారు.పిచ్చి దేవుడన్నారు. 
ఇలాటివి నేను ఎన్ని రాయలేదు గనుక.  ఎవరయినా మారారా! అంతెందుకు. నేనేమయినా మారానా!


NOTE:Courtesy Image Owner



23, ఆగస్టు 2014, శనివారం

బాబోయ్ హెచ్చార్!


ఉద్యోగంలో చేరి రెండేళ్లు కావస్తోంది. ప్రమోషన్ సంగతి దేవుడెరుగు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అనుకుని హెచ్ ఆర్ మేనేజర్ దగ్గరకు వెళ్లాను. వెళ్ళి ముసిముసి నవ్వొకటి విసిరి మనసులో మాట బయట పెట్టేలోగా ఆయనే ఒక మందహాసం పారేసి కుర్చీలో కూర్చోబెట్టి బాంబు లాటి కామెంటు ఒకటి నా మొహం మీదే పేల్చాడు.
‘చూడండి సుందరరావు గారు మీరు ఆఫీసుకు రాకుండానే జీతం తీసుకుంటున్నారట’
నాకు నోటమాట రాలేదు. ఇదేమిటి ఇలా ఎదురు వచ్చాడు.
మేనేజర్ మళ్ళీ  అడిగాడు
‘చూడండి సుందరరావు గారు ఏడాదికి ఎన్ని రోజులు?’
ఓ పక్క వొళ్ళు మండుతున్నా నెమ్మదిగా జవాబిచ్చాను
365 లేదా కొన్ని సార్లు 366
‘అవునా! మరయితే రోజుకు ఎన్ని గంటలు?’
అందుకే అంటారు  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని. ఏం చేస్తాను? పని నాది కదా, ఓపక్క నోరు నొక్కుకుని  మరో పక్క నోరు తెరిచి చెప్పాను.
24 గంటలు’
‘అవునా! మరి మీరు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు?’
‘ఉదయం పది నుంచి  సాయంత్రం ఆరుగంటల దాకా. అంటే ఎనిమిది గంటలు’
‘అవునా! అంటే  ఏమిటన్న మాట. రోజుకు 24  గంటల్లో మీరు పనిచేసేది మూడో వంతు’
(అవునొరేయ్) 'అవును'  
‘ఏడాదికి  366 రోజుల్లో మూడో వంతు అంటే యెంత 122రోజులు అవునా!’
( అవున్రా! గాడ్దీ! )
‘మీరు పనిచేసేది వారానికి అయిదు రోజులు. శనాది వారాలు ఆఫీసుకి  రారు’
‘అంటే ఏమిటన్నమాట. 52  ఆదివారాలు, 52 శని వారాలు. మొత్తం 104  రోజులు ఆఫీసు మొహం చూడరు’
‘సరే! ఇందాకటి  122 రోజులనుంచి ఈ 104  తీసేస్తే మిగిలినవి ఎన్ని?’
(నాబొంద నీ శ్రాద్ధం) 
అలా నీళ్ళు నమలడం కాదు. నేను చెప్పేది వినండి. ఇవికాక ఏడాదికి రెండువారాలు,  రోగం రొస్టు అంటూ సిక్  లీవులు.    ఆ 14 తీసేస్తే మిగిలేవి నాలుగు రోజులు’ 
ఇక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, జనవరి ఫస్ట్, దీపావళి పండుగలకి  ఎట్లాగు  రారు.
‘అంటే ఏమిటన్నమాట. మీరు సంవత్సరంలో ఒక్క రోజు కూడా పనిచేయడం లేదన్నమాట. అంటే ఏమిటి అర్ధం. ఆఫీసులో  ఏపనీ చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటున్నారని అర్ధం.  ఎట్లాగు వచ్చారు కదా! ఇప్పుడు చెప్పండి  నన్నేం  చెయ్యమంటారో.  పనిచేయని కాలానికి తీసుకున్న డబ్బుల్ని  ఇకనుంచి ఎన్ని వాయిదాల్లో మీ నెల జీతం నుంచి పట్టుకోమంటారో చెప్పి మరీ  వెళ్ళండి.’



తోక మాట: ప్రత్యేకంగా చెప్పేదేవుంది? ఇది కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎత్తిపోతే! కాకపోతే నా సొంత బాణీలో రాతే! 
NOTE: Courtesy Image Owner