27, ఆగస్టు 2014, బుధవారం

కాటికాపరి కధ


‘కలం కూలీ’, కీర్తిశేషులు  జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా  విభిన్న వ్యావృత్తులకు చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు.  ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ  గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే – బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో  సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చొను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.

(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)


(అలాటి గొప్ప జర్నలిష్ట్ కృష్ణ గారితో నేను - రోశయ్యగారి వెనుక)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
నోళ్ళంటూ వుంటే వెళ్ళబెట్టకుండా వుంటారా యెవరయినా ఆ సంభాషణకి,LOL and ROFL