దేవుడా నువ్వే దిక్కు
మా ఇంట్లో అందరూ దేవుడి పార్టీ.
నేనూ దేవుడూ ఒక పార్టీ.
'దేవుడు వేరూ తాము వేరు' అనుకుని వాళ్లు దేవుడుకి
దూరం అవుతున్నారని నా ఘోష.
'దేవుడితో ఫ్రెండ్ షిప్ చేయాలనే అత్యాశ పెంచుకోవడం
వల్ల నాకు దేవుడు దూరం అవుతున్నాడ'ని వాళ్ల బాధ.
కారణం ఏమైతేనేం నాకు మా ఇంట్లోనే కాదు మా
చుట్టపక్కాల్లో కూడా 'వీడొట్టి నాస్తికుడు' అనే ముద్ర పడిపోయింది.
'చిన్నప్పుడు గోరాగారితో తిరిగాడు. అలానే
మాట్లాడుతాడు' అనేవాళ్ళు పైగా.
ఆయన ఎప్పుడూ దేవుడు లేడు అనేవారు కాదు, అసలు
లేనివాడు ఆడో మగో అనవసరం అనేది గోరాగారి సిద్దాంతం, అందుకే 'దేవుడు లేదు' అంటుండేవారు.
అలా అన్న గోరాగారే, చనిపోయిన తరువాత వాళ్ల
కుటుంబానికి దేవుడుగా మారిపోయాడని కొందరు అంటుంటారు. అసలు దేవుళ్ళు పుట్టిందే
ఇలాగా అని మరి కొందరు సనాయి నొక్కులు
నొక్కుతుంటారు. శిష్యులకు, అభిమానులకు చెప్పింది తలకెక్కదు, అంచేతే 'విగ్రహారాధన
కాదుకూడదు' అన్న బుద్ధుడికి దేశదేశాల్లో ఇన్నేసి విగ్రహాలు వేశారని ఇంకొందరు
ఉవాచిస్తుంటారు (గ్రామరు తప్పయితే గోడ కుర్చీకి రెడీ)
నిజం చెప్పాలంటే నాకు దేవుడితో, దేవుడికి నాతొ ఏ
పేచీ లేదు. వున్న పేచీ అల్లా ఆ దేవుడి పేరుతొ నానా యాగీ చేసేవాళ్ళతో. (ఇక్కడ
తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏమిటంటే - 'ఈ బాపతు వాళ్ళల్లో' దేవుడ్ని నమ్మేవాళ్ళు,
నమ్మని వాళ్ళూ వున్నారు)
అసలు విషయానికి వస్తాను. మా మేనల్లుడు రామచంద్రం
నిన్న ఒక ఫంక్షన్ లో కలిసాడు. వాళ్ల నాన్నగారిలాగే
ఆధ్యాత్మిక మార్గం. చెప్పేవి పెద్ద పెద్ద విషయాలు కాబట్టి నాకంటే వయస్సులో చిన్నవాడయినా వాడికి పెద్దరికం
బాగానే అబ్బింది. ముచ్చట్లలో దేవుడి విషయం
వచ్చింది. 'దేవుడు వేరు, దైవం వేరు' అన్నాడు. 'దేవుళ్ళు అనేకమంది. దైవం మాత్రం
ఒక్కడే' అని కూడా అన్నాడు. 'దేవుడు ఎవ్వరో
కాదు, నువ్వే. ఎక్కడో లేడు, నీలోనే వున్నాడు' అని కూడా తేల్చేసాడు. 'ముందు నువ్వు 'నేను' అనే విషయం మరవగలిగితే
నువ్వే దేవుడివి' అని చెప్పాడు. విన్నప్పుడు కాస్త గందరగోళం అనిపించింది. అందుకే
వేదాంతం అన్నారేమో! ఆలోచించి చూస్తే 'ఆహా!' అనిపించింది మనసులో. కానీ పైకే
అన్నానేమో.
'యెందుకు అనిపించదు, ఇన్నేళ్లబట్టీ మీరూ అదేకదా
చెబుతోంది. అందుకే ఆ ఆహాలు, ఒహోలు' అంది మా శ్రీమతి హఠాత్తుగా ప్రత్యక్షమై.
'ఓ మై గాడ్!' అని పైకి మాత్రం అనలేదు.
1 కామెంట్:
ఇంతకీ మీరు దేవుడి ఫ్రెండా లేక దేవుడు మీ ఫ్రెండా చెప్పలేదు సర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి