29, ఆగస్టు 2014, శుక్రవారం

తప్పులున్న క్షమించగలరు


పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా తప్పులున్న క్షమించగలరుఅనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీ  సారీఅనే పదాన్ని  ఉదారంగా ఎక్కువసార్లు  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీచెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడంఅని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖఃడం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే  దుష్కృత్యాలు.  చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  ‘నేను చేసిన తప్పులను మన్నించండిఅని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.





NOTE: Courtesy Image Owner


కామెంట్‌లు లేవు: