మాజీ ముఖ్యమంత్రి
కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ
పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి
సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది. "పీవీ నరసింహారావు ఒక తెలుగు
మహిళా ఎంపీ తో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని,
ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇలా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం కదా!" అని శ్రీమతి ఇందిరా గాంధీ తనతో చెప్పారని ఆయన తన
పుస్తకంలో పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు గురించి శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు
దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ)
అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ వంటి
సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసాను. వివాహేతర సంబంధం పెట్టుకుని
తిరగడం తప్ప ఆయన ఉద్దరించిది ఏమీ లేదు. ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అంత బాధ్యతా
రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో
చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు. శ్రీమతి గాంధీ పీవీ గురించి కొన్ని
విషయాలు తనతో చెప్పి, అందువల్లే ఆయన్ని మార్చి నిన్ను (వెంగళరావును) ముఖ్యమంత్రిగా
పంపాలని నిర్ణయానికి వచ్చినట్టు తనతో చెప్పారని వెంగళరావు తన పుస్తకంలో
పేర్కొన్నారు.(ఆ విషయాలు మరీ దారుణంగా
వుండడంవల్ల ఈ వ్యాసంలో పొందు పరచడం లేదు - భండారు శ్రీనివాసరావు)
అలాగే మర్రి చెన్నారెడ్డి
గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన
ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో
అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త
చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా
చెన్నారెడ్డి సంబరాలు చేఉకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు
చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన
చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు
అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది
ముఖ్యమంత్రులవద్ద పీ ఆర్ వొ గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల
పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పుస్తకంలోని అంశాలను ఒక పద్దతిలో కూర్చడంలో
సూచనలు చేయడం తప్ప, ఎవరినైనా కించబరిచే ఎలాటి
ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం లేదని వెంగళరావు
సమర్ధించుకున్నారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు వ్యక్తులను బాధపెట్టేవిగా వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను
ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు. అయినా ఆయన తన సహజ శైలిలోనే, 'ఏం పర్వాలేదంటూ' తన సలహాను పట్టించుకోలేదని, అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని
కోరినట్టు పర్వతాలరావు చెప్పారు.
వెంగళరావు పేరుతొ వెలువడిన ఆ
పుస్తకంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు కూడా సంచలనాత్మకంగా తయారయ్యాయి. దేశంలో
అత్యవసర పరిస్తితి (ఎమర్జెన్సీ) విధించాలనే నిర్ణయం తీసుకోబోయేముందు ఇందిరాగాంధి ఆ
విషయాన్ని మొట్టమొదట తనతోనే చెప్పారని వెంగళరావు పేర్కొన్నారు. జీవించిలేని వ్యక్తుల
గురించి ఈ విధంగా రాయడం సబబు కాదని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.
1975 లో అలహాబాదు హైకోర్టు శ్రీమతి గాంధీ ఎన్నిక చెల్లదని
తీర్పుఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ సిన్హా, తన తీర్పు యెలా వుండబోతోందో రెండు నెలలకు
ముందే (కీర్తిశేషులు) జయప్రకాష్ నారాయణ్
కు తెలియచేసినట్టు తనతో చెప్పారని వెంగళరావు రాయడం మరింత వివాదాన్ని
రేకెత్తించింది. ఆ ఆరోపణను జస్టిస్ సిన్హా
తీవ్రంగా తప్పుపట్టారు. 'ఇంతకంటే దారుణమైన పచ్చి అబద్ధం మరోటి వుండదు' అని ఆయన వ్యాఖ్యానించారు.
వెంగళరావు సొంత పార్తీవారిపైనే
ఎక్కువ విమర్శలు చేశారు. ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి,
బియ్యపు మిల్లర్ల నుంచి భారీ మొత్తాల్లో
డబ్బులు వసూలు చేశారనీ, ఆ విషయం శ్రీమతి గాంధీ దృష్టికి వెళ్లినట్టు తెలియగానే
అందులో కొంత డబ్బు పార్టీ ఫండ్ కు
జమచేసారనీ ఆ పుస్తకంలో రాశారు. ఆయన చాలావరకు ఇలాటి సంగతులు, తాను విన్నవి,
ఇతరులద్వారా తెలియవచ్చినవీ రాసారు. ఆ ఆరోపణలకు నిర్దిష్టమైన ఆధారాలు లేకుండానే
రాసుకుంటూ వెళ్లారు.
ఈ కోవలోకి వచ్చేదే మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర
నిర్మాత ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'.
ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం
అయ్యాయి. ఎన్టీ రామారావు, జమున, డైరెక్టర్ గుణశేఖర్, యువ హీరో జూనియర్ ఎన్టీయార్ మొదలయినవారిని
కించబరిచే వ్యాఖ్యానాలు వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను
విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
నాటి మేటి నటుడు ఎస్వీ
రంగారావుతో ఎన్టీ రామారావుకు పొసిగేది
కాదని, అందువల్ల ఎస్వీయార్తో కలిసి నటించడానికి ఎన్టీ రామారావు నిరాకరించిన
సందర్భాలు వున్నాయని మల్లెమాల రాశారు.'శ్రీ కృష్ణ రాయబారం' సినిమా సెట్టుపై
తమిళనాడు ముఖ్యమంత్రి, నాటి నటి జయలిత, జమునల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ప్రస్తావన
కూడా ఈ పుస్తకంలో వుంది.
తెలుగు
సినిమా పరిశ్రమ మొత్తంలో జూనియర్ ఎన్టీయార్ వంటి గర్విష్టి మరొకడు లేడంటూ చేసిన
ఆరోపణ ఆ యువ నటుడి అభిమానుల ఆగ్రహానికి కారణం
అయింది. ఈ విమర్శలు, ఆగ్రహ ప్రకటనలు మొత్తం మీద మార్కెట్ నుంచి తన పుస్తకాలను మల్లెమాల
ఉపసంహరించుకునేలా చేసాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి