ఎనభయ్యవ దశకం చివర్లో మేము
మాస్కోలో వున్నప్పుడు మాకు ఏ కొరతా వుండేది కాదు, ఒక్క తెలుగు పేపర్ రాదే అన్న లోటు తప్ప. అందుకే ఇండియా నుంచి మా
వాళ్ళు ఏదయినా సరుకులు అంటే చింతపండు, బెల్లం లాటివి పంపేటప్పుడు వాటిని
న్యూస్ పేపర్ లలో చుట్టి పంపాలని కోరేవాళ్ళం. ఆ విధంగానయినా ఆ పాత పేపర్లలోని
పాత వార్తలనయినా తాజాగా
చదువుకోవచ్చన్నది మా తాపత్రయం. ఆ రోజుల్లో
మాస్కోలో విదేశీ పత్రికలు దొరికేవి
కావు. విదేశీ రేడియోలు వినబడేవి కావు. విదేశీ టీవీ ఛానళ్ళు కనబడేవి కావు. అందుకని
ఇండియా వార్తలకోసం ముఖ్యంగా తెలుగు వార్తలకోసం మొహం వాచినట్టుగా వుండేది. నేను పని
చేసేది మాస్కో రేడియోలో కాబట్టి కొంత పరవాలేదు. కాస్త ఆలస్యంగానన్నా యేవో కొన్ని వార్తలయినా చెవిన
పడుతుండేవి. కానీ వాటిని శ్రోతల చెవిన వేయాలంటే వెయ్యి అడ్డంకులు. ఒక రోజు ఎం జీ
రామచంద్రన్ మరణించిన వార్త వచ్చింది. కానీ వెంటనే ప్రసారానికి నోచుకోలేదు.
ఎందుకంటె ఆ మదరాసీ రాజకీయ నాయకుడు ఢిల్లీ లోని ఫెడరల్ ప్రభుత్వానికి అనుకూలమో కాదో
నిర్ధారణ చేసుకునేవరకు ఆ చావు వార్తను చావనివ్వకుండా బతికించే వుంచారు.
పోతే, సమాచారానికి సంబంధించినంతవరకు మాస్కోలో వున్న మిగిలిన ఇండియన్ల పరిస్తితి మరీ
ఘోరం. అర్ధం కాని రష్యన్ టెలివిజన్, చదవడానికి భాష తెలియని రష్యన్ పత్రికలూ తప్ప, కనీసం ఒక్క ఇంగ్లీష్ పత్రిక కూడా కనబడేది కాదు. అయితే ఈ విషయంపై మాస్కోలోని హిందుస్తానీ సమాజ్ చేసిన
అభ్యర్ధన మేరకు ఇండియన్ ఎంబసీ వారు ఢిల్లీ నుంచి కొన్ని ఇంగ్లీష్
దినపత్రికలు తెప్పించేవారు.
పదిరోజులకోమారు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చే డిప్లొమాటిక్ బాగ్ లో ఈ
పత్రికలు భారత రాయబార కార్యాలయానికి చేరేవి. మాస్కో రేడియో నుంచి మూడు మెట్రో
రైల్వే స్టేషన్ల అవతల ఇండియన్ ఎంబసీ
వుండేది. రేడియోలో పనిచేసే భారతీయులం వంతులు వేసుకుని ఎంబసీ కి వెళ్లి పత్రికలు పట్టుకొచ్చేవాళ్ళం. ఈ
బాధ్యతను ఒకటికి రెండు సార్లు నేనే భుజానికి ఎత్తుకునేవాడిని. దీంట్లో నా స్వార్ధం
కూడా కొంత వుంది. ఇంటికి తిరిగి వస్తూ ఎంచక్కా మెట్రో లోనే పేపర్లు చదువుకోవచ్చు.
అంతేకాదు, డిప్లొమాటిక్ బాగ్ లోనే మాస్కోలోని ఇండియన్లకు ఉత్తరాలు కూడా వచ్చేవి. అదెలాగంటే, హైదరాబాద్ లో కానీ మరో చోట వున్న వారు
కానీ మాస్కోలో వున్న తమ వాళ్లకు జాబు
రాయాలనుకుంటే ఎయిర్ మెయిల్ అవసరం లేదు. కవరుపై
పేరురాసి కేరాఫ్ ఇండియన్ ఎంబసీ, మాస్కో -
విదేశీ వ్యవహారాల శాఖ, న్యూ ఢిల్లీ అని రాసి ఢిల్లీ కి పోస్ట్ చేస్తే – అది డిప్లొమాటిక్ బాగ్ ద్వారా మాస్కో
చేరేది. కాకపొతే ఆ ఉత్తరాలను ఎంబసీ కి వెళ్లి ఎవరికి వారే తెచ్చుకోవాలి. ఉత్తరాలతో
పాటు అలా తెచ్చుకున్న పత్రికలనే –రేడియో మాస్కో బిల్డింగ్ లో వున్న భారతీయులం అందరం అపురూపంగా చదువుకునేవాళ్ళం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే – దూరంగా వున్నప్పుడు సొంత వూరి సమాచారం కోసం మనిషి ఎంతగా వెంపర్లాడి
పోతాడో చెప్పడానికి.
అయితే, విదేశాల్లో వుంటున్న భారతీయులకు కానీ,
ప్రత్యేకించి
తెలుగు వారికి కానీ ఇలాటి ఇబ్బందులు వున్నట్టు వినలేదు. ఉపగ్రహాల ద్వారా
సమాచార వినిమయం పెరిగిన తరువాత విషయాలు
తెలిసిరావడానికి అమలాపురంలోవున్నా ఒకటే అమెరికాలో వున్నా వొకటే. టీవీల్లో
బ్రేకింగ్ న్యూస్ ల పుణ్యమా అని ఎలాటి కబురయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది.
ముప్పయి నలభయ్ ఏళ్ళ క్రితం మన దగ్గర కూడా పరిస్తితి వేరుగా వుండేది. ఆ రోజుల్లో ఏదయినా
వార్త ముందు తెలిసినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్రుత వుండేది. విషయం
తెలుసుకున్న వారు కూడా తెలిపినవారిపట్ల కృతజ్ఞతతో వుండేవారు. ప్రత్యేకించి వార్తా
పత్రికల్లో, రేడియోలో పనిచేసే వారిపట్ల ఒక ప్రత్యేక గౌరవభావం సమాజంలో వుండడానికి
కూడా ఇది ఒక కారణం. కొన్ని విషయాలు జర్నలిష్టులు ఫోను చేసి చెప్పేవరకు అధికారులకు,
మంత్రులకు కూడా ముందుగా తెలిసేవి కావు. రేడియోలో వార్తలు రోజూ నియమబద్ధంగా నియమిత
సమయాల్లో మాత్రమే ప్రసారం అయ్యేవి. పత్రికలు చదవాలంటే మరునాటి దాకా ఆగాలి. అందుకే
మాకు ముందుగా తెలిసిన వార్తలను తెలిసినవారితో పంచుకోవడం ఒక ఉత్సాహంగా వుండేది.
అలాగే, మానుంచి వార్తలు తెలుసుకోవాలనే వాళ్ళల్లో ఓ మంచి ఆత్రుత కనబడేది. కానీ, ఇప్పుడో!. మిన్ను విరిగి మీద పడ్డంత సంచలన
సమాచారం తెలుపుదామని ఎవరికయినా ఫోను చేసారనుకోండి. ‘ఓస్ ఇదా! మాకెప్పుడో తెలుసు.
టీవీ స్క్రోలింగుల్లో ఆల్రెడీ చూసేశాము’ అనేస్తారు. అందుకే, వార్త అనే దానిలో ఒకప్పుడు దాగున్న ఉత్సుకత
ఇప్పుడు కలికానికి కూడా లేకుండా పోయింది.
NOTE: Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి