అసెంబ్లీలో ఏం జరుగుతోంది అనేది ఈనాడు అందరి
మనస్సులను కలచివేస్తున్న అంశం. దీనికి
సమాధానం అన్వేషించడానికి, సమస్యను పరిష్కరించడానికి అయిదు నక్షత్రాల హోటళ్ళలో
లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి శాసన సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన
పనిలేదు. శాసన సభ ప్రాంగణంలోనే సభ్యులకోసం అత్యంత విలువైన గ్రంధాలయం వుంది. నేను
విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో కదాచిత్ గా ఆ గ్రంధాలయంలోకి అడుగుపెడుతూ
ఉండేవాడిని. తెన్నేటి విశ్వనాధం గారు, పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు గారు, బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, వెంకయ్యనాయుడు
గారు, జయపాల్ రెడ్డి గారు, సీ హెచ్
విద్యాసాగర్ రావు గారు వంటి ఉద్దండులు ఆ
గ్రంధాలయాన్ని ఉపయోగించుకుంటూ వుండడం నాకు తెల్సు. ఇప్పటి శాసన సభ్యులు, ముఖ్యంగా
తొలిసారి సభలో అడుగుపెట్టిన వారు ఈ లైబ్రరీకి వెళ్లి వెనుకటి కాలంలో సభ ఎలా
నడిచేది అన్న విషయంపై అవగాహన పెంచుకోగలిగితే అసలు సమస్య దూదిపింజలా ఎగిరిపోయే
అవకాశం ఎక్కువ. కానీ వారికి అంతటి తీరికా ఓపికా వుంటాయా అంటే నాకు అనుమానం కూడా ఎక్కువే.
శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు వాటిని
సజావుగా నిర్వహించడానికి కొన్ని నిర్దేశిత నియమ నిబంధనలు వుంటాయి. వాటిని గురించి
కొత్త సభ్యులకు, పాతవారికి కూడా పూర్తి సమాచారం అందిస్తారు. సభలో ఎలా మాట్లాడాలి,
ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఇలా అన్ని విషయాలపై సభ్యులకు వివరాలు అందచేస్తారు.
పాలక ప్రతిపక్షాలు వీటిని తుచ తప్పకుండా పాటిస్తే పేచీయే లేదు. ఇలాటి వ్యాసాల
అవసరమూ వుండదు. గతాన్ని తవ్వితీయడంలో చూపిస్తున్న శ్రద్ధాసక్తులు గతంలోని మంచిని
గ్రహించడంలో ప్రదర్శిస్తే వర్తమానం ఇంట బాధాకరంగా వుండదు. భవిష్యత్తు గురించి
బెంబేలు పడాల్సిన పరిస్తితి ఉత్పన్నం కాదు.
జనతా ప్రభుత్వం నాటి ఒక ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం.
మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. జార్జ్
ఫెర్నాండెజ్ ఆయన మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన ఓ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశించి 'She is a perennial
liar' (ఆవిడ ఎప్పుడూ అబద్దాలే
చెబుతారు) అని వ్యాఖ్యానించారు. దానిపై దుమారం రేగింది. అభ్యంతరపెట్టింది కూడా
ప్రధానమంత్రి కావడం విశేషం. 'ఉన్నమాటే చెప్పాను' అంటారు ఫెర్నాండెజ్. 'అయినా కానీ
అలా అనివుండాల్సింది కాదు. కాదూ కూడదు అనాలని అనిపిస్తే 'She seldom tells truth' (ఆవిడ చాలా అరుదుగా నిజం చెబుతారు) అనాలి' అన్నారు మొరార్జీ.
అలాగే ఒకనాటి రోజుల్లో, శాసనసభ నడిచే తీరుతెన్నులు ఎలా వుండేవో తెలుసుకోవడానికి కొన్ని మచ్చు
తునకలు:
ఆంద్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి
ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి గారు ఒకసందర్భంలో ప్రతిపక్ష కమ్యూనిస్ట్ సభ్యులు శాసన సభ నుంచి
వాకవుట్ చేస్తేనే ఎంతగానో మధన పడ్డారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగం అసెంబ్లీ
లైబ్రరీ రికార్డులలో పదిలంగా వుంది.
1959 ఆగస్టు ఒకటో
తేదీన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు
సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు తన ప్రసంగాన్ని ఇలా
ప్రారంభించారు.
"చర్చ ఇంత సవ్యంగా జరుగుతున్న ఈ తరుణంలో తలవని తలంపుగా దేశంలో ఎక్కడో జరిగిన ఒక చర్యకు నిరసనగా
మిత్రులు సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలా విచారకరం. కేరళలో అంశాన్ని నేను సభలో
ప్రస్తావించడం న్యాయం కాదు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది.
కాంగ్రెసు వారు నాలుగు సీట్లు కూడా గెలవరని అనుకున్నారు. కానీ ఎంతో మెజారిటీతో
ప్రజలు గెలిపించారు. ఒకసారి ఒక పార్టీ, మరొకసారి మరో పార్టీ అధికారం లోకి రావచ్చు.
ఇది ఈనాటి ధర్మం కాదు. వేదకాలం నుంచి వస్తోంది. పాత కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు
కూడా రెండు పక్షాలు గెలవ్వు. ఎవరో ఒకరే గెలుస్తారు. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు
దుర్యోధనుడితో చెబుతాడు. 'రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే'
అని. అందువల్ల ప్రతిపక్షం ఇక్కడ లేకపోయినా నేను వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి
చేస్తున్నాను. మనం ఈ ప్రశాంతతను కాపాడుకోవాలి. ప్రశాంతవాతావరణం వుందని గవర్నర్ తన
ప్రసంగంలో చెప్పారు. దానికి క్రెడిట్ ప్రభుత్వానిది కాదు, పోలీసులదీ కాదు ఆ
క్రెడిట్ ప్రతిపక్షానిది అని వెంకటేశ్వర్లు గారు చెప్పారు. నేను వారితో
ఏకీభవిస్తున్నాను. అప్పోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కల్సి చేయాల్సిన అభివృద్ధి
కార్యక్రమాలు అనేకం వున్నాయి."
ప్రతిపక్ష నేత, కమ్యూనిష్ట్ నాయకుడు పుచ్చలపల్లి
సుందరయ్య గారు 1960 రాష్ట్ర బడ్జెట్ పై చేసిన ప్రసంగాన్ని ఓసారి
పరికిద్దాం.
"శాసనసభ అంటే ప్రభుత్వానికి ఎంతమాత్రం
లక్ష్యం లేదు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం లేదు. ....శాంతిభద్రతల విషయానికి
వస్తే ...ముఖ్యమంత్రి సంజీవయ్యగారు ఈమధ్య ఖమ్మం జిల్లా ఉద్యోగస్తులు, కాంగ్రెస్
కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్టుగా
నడుచుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రిగారు బోనకల్లు, కనికల్లులలో చేసిన ప్రసంగాల
పేపర్ కటింగ్స్ మాదగ్గర వున్నాయి. కమ్యూనిష్టులను తంతాము, చంపుతాము అన్నారు. మేము ఏకొద్దిమందిమో
ఉన్నాము. ముఖ్యమంత్రిగారికి తమ పార్టీకి మెజారిటీ వున్నదని, పోలీసు, సైన్యం బలం వున్నదన్న
ధీమాతో అలా చెప్పవచ్చు. కానీ మమ్మల్ని చంపినంత మాత్రాన ఆహార సమస్య పరిష్కారమవుతుందా.
ముఖ్యమంత్రిగారు తాను అలా అనలేదని
అంటున్నారు. సంతోషమే. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం వారు అలా మాట్లాడారని
తెలుస్తోంది"
కర్నూలు రాజధానిగా వున్న
ఆంద్ర రాష్ట్ర శాసనసభలో
1956 ఫిబ్రవరి ఒకటో తేదీన విశాలాంధ్ర ఏర్పాటు తీర్మానం ప్రవేశపెడుతూ, అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు
చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలు. అందులో ప్రస్తుతానికి కూడా వర్తించే కొన్ని
అంశాలు:
"విశాలాంధ్ర ఏర్పాటు చేసే ప్రతిపాదనపై పొరుగునవున్న మైసూరు, మహారాష్ట్ర వాళ్ళు తమ ప్రాంతాలకు సంబంధించిన శ్రేయస్సు
గురించి ఆలోచిస్తుంటే ఆంధ్రులు మాత్రం 'మా భవిష్యత్తు ఎలా వుంటుంది, కలిసివుంటామా,
లేక ఆంధ్రులలోనే చీలికలు వస్తాయా' అని ఆందోళన చెందుతున్నారు. 'ఆంధ్ర రాష్ట్రాన్ని
హైదరాబాదులో విలీనం చేయకుండా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచుదాం, ఆరేళ్ళ తరువాత
ఆలోచిద్దాం' అని కొందరు అంటున్నారు. మద్రాసునుంచి విడిపోయి రెండేళ్ళు గడుస్తున్నా
ఇంకా ఆఫీసులు అక్కడే వున్నాయి. కర్నూలుపై ఇప్పటిదాకా రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం. అయిదేళ్ళదాకా మన ఆఫీసులు
మద్రాసులో ఉంచుకుని ఇక్కడ కర్నూలులో మనం వుంటే పాలన అవకతవకగా ఉంటోంది. మరో
అయిదేళ్ళు ఇక్కడే వుండాల్సివస్తే, మరో మూడుకోట్లు వృధా ఖర్చు. అయిదారేళ్ళ తరువాత
మూటా ముల్లె సర్దుకుని హైదరాబాదు పొతే ఎవరికి లాభం? ఇన్నేళ్ళు ఇక్కడ ఇసుక సున్నం
మీద పెట్టే మూడుకోట్ల డబ్బుతో వెనుకబడిన
హైదరాబాదులో వంద స్కూళ్ళు కట్టుకోవచ్చు'
ఆంద్రప్రదేశ్ ఆవిర్భావం
తరువాత ఏర్పడ్డ తొలి శాసన సభకు తొట్టతొలి స్పీకర్ గా కాంగ్రెస్ కురువృద్ధుడు
అయ్యదేవర కాళేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1956 నవంబర్ నాలుగో
తేదీన ఆయన స్పీకర్ గా మొదటి ప్రసంగం చేసారు.
"మీరందరూ ఈ సభాద్యక్ష
స్థానాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు. మీరందరూ ఇష్టపడినట్టయితే, మీ
అందరి అనుమతితో ఒక పని చేయదలచుకున్నాను. స్పీకర్ బల్ల మీద వున్న ఈ వెండి దండాన్ని
తీసివేస్తాను. ఈ వెండిదండం భూస్వామ్య వ్యవస్థకు, రాచరికానికి గుర్తు. ప్రజాస్వామ్యంలో
దీనికి స్థానం లేదు."
1959 ఆగష్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి,
గవర్నర్ ప్రసంగాని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు అంశాలవారీగా
సమాధానం చెప్పారు.
"ఎవరూ చెప్పని ఒక
విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా
ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో, న్యాయం అని తోచినప్పుడు కూడా
పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్
శాతం వాళ్ళ సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్? ఒక్క
శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి, పల్లెతూరివారికి తెలియదు కానీ, తెలిస్తే
ముఖ్యమంత్రి మొదలుకుని కిందివరకు రాళ్ళతో కొడతారు. 330 లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటే, ఒక లక్షమందో, రెండు లక్షల మందో చదువుకున్నవాళ్ళమని
మనం అనుకుని, వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని పంచేసుకుంటూ- (వుంటే బాగుంటుందా!)
ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి
ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ
రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి, రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి
కరెంటు వస్తుంది అని అడిగితె అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి
తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు. చదువు
సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే ఏమిటో,
కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు
పంపుతారు. 'మీరూ వద్దు, మీ రాజ్యమూ వద్దు, మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని
విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతాము' అంటారు. ఆ పచ్చి నిజాన్ని బాగారెడ్డి
గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"
ఇది ఒక ముఖ్యమంత్రి
శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా. ఒక ప్రతిపక్ష నేత కూడా ఈ విధంగా
నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి.
కాబట్టి నేతలూ, గతం ఎలా
ఉండేదో, ప్రజా ప్రతినిధులు ఎలా
వ్యవహరించేవారో తెలుసుకోవడానికి ఒక్కసారి అసెంబ్లీ లోని ఆ గ్రంధాలయానికి వెళ్ళండి.
'కాదు, ఇలానే వాద ప్రతివాదాలతో సమయం గడుపుతాము, రాజకీయాలతోనే పొద్దు పుచ్చుతాము' అంటే
ఎవరూ చేయగలిగింది ఇప్పట్లో ఏమీ లేదు. సర్వం
తెలిసినవాళ్ళని, సర్వజన సంక్షేమం కనిపెట్టి చూస్తారని ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధులుగా శాసన సభలోకి
పంపారు. శాసన కర్తలుగా మీకు ఎన్నో హక్కులు
వున్నాయి. అదేసమయంలో బాధ్యతలు కూడా అంతే వున్నాయి. హక్కులు గుర్తున్నవారు
బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రోజూ అసెంబ్లీలో జరిగేది చూస్తున్నప్పుడు నిష్టురమైన ఈ నిజాన్ని చెప్పకతప్పని రోజులు
వచ్చాయనిపిస్తోంది.
5 కామెంట్‌లు:
can the speaker allow numerous interruptions to the oppostion ledare's speech and cut off the microphone while the opp leader is talking?
legally=yes
ethically-this id bullying by the ruling party because they can "rule"
this trend was predicted when the newsmedia which is the ruling party's friend termed cbn's swearing in "pttaabhishekam" instead of "padavi pramaanam.
Please correct the photo. You are showing Telangana assembly.
@Jai Gottimukkala - No. Telangana Assembly is located in the new building just behind this building. AP assembly is now functioning in the old one constructed during Nijam's time,is part of this old building. I have been covering assembly proceedings as a news correspondent of AIR since 1975.- Bhandaru Srinivas Rao
అన్నీ తెలిసిన జై గారి నే తప్పు పడుతున్నారా శ్రీనివాసరావు గారు మీరు :)
@అజ్ఞాత : తప్పులెన్నడం, తప్పుపట్టడం నా తత్వం కాదు. ఎవరన్నా తప్పు రాసారన్నప్పుడు వారు చెప్పింది సరయినది అనుకున్నప్పుడు కృతజ్ఞతలు తెలిపి మరీ సరిదిద్దుకున్న సందర్భాలు వున్నాయి. ఎవ్వరం సర్వజ్ఞులం కాదు. ప్రమాదో ధీమతామాపి. - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి