13, ఆగస్టు 2014, బుధవారం

వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ


రేడియో న్యూస్ రీడర్లు గురించి నేను రాసినవాళ్ళందరూ  నాతో పాటు హైదరాబాదు కేంద్రంలో పనిచేసినవారే!. ఇక, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడలో, చదువరుల్లో కొందరు పేర్కొంటున్న మరికొందరు న్యూస్ రీడర్లు  ఢిల్లీలో - ఉదాహరణకు కొంగర జగ్గయ్య - రేడియోలో వార్తలు చదివినవారే. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వారే. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తూవస్తున్నాడు. యెంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. అది ఇంకా మంచి విషయం.
పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.


(ప్రయాగ రామకృష్ణ)

వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పండితత్వం ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా పనికొచ్చాయి. ఒక్కోసారి బులెటిన్ అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకువెళ్ళి అందించేలోగా రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ అనర్ఘళంగా చెప్పేవాడు. కొప్పుల సుబ్బారావుది మరో బాణీ. మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారుకాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగివచ్చి ఉద్యోగ పర్వంలో శిఖరాగ్రం చేరిన కొన్నాళ్ళకే కన్నుమూయడం బాధాకరం.

10 వ్యాఖ్యలు:

nagasrinivas చెప్పారు...

bagundi

nagasrinivas చెప్పారు...

bagundi

Swamy చెప్పారు...

చక్కటి ముచ్చట్లు. మీ సారధ్యంలో కొప్పుల, ప్రయాగ గార్లతో కలసి వార్తలు చదివే అవకాశం నాకు కలిగింది. బులెటిన్ పరిమాణం తగ్గినా ప్రయాగ వారు నప్పించడం నాకూ బాగా తెలుసు. ఒకరొజు మధ్యాహ్నం బులెటిన్లో సుమారు మూదు నిమిషాలు తగ్గింది. అంతే. స్టాండ్ బైగా వున్న నాకు కంగారు. ఆయన తాపీగా భద్రాద్రిలో నవమి ఏర్పట్ల గురించి అందుకున్నారు. అలాగే ఎన్.టీ.ఆర్. కన్నుమూసిన వేళ ప్రముఖుల సంతాపాలు, ప్రయాగ వ్యాఖ్యానంతో సాగిన వార్తా వాహినిలో మధ్యలో నా గొంతు కలవడం అపూర్వ,అపురుప అనుభూతి

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

"...ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది....."

A very good human interest item, which is difficult to be appreciated by the present generation born in 1990s.

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

శివరామప్రసాద్ గారికి - మీ అభిమానానికి ధన్యవాదాలు.- భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

@nagasrinivas - ధన్యవాదాలు

భండారు శ్రీనివాస రావు చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
భండారు శ్రీనివాస రావు చెప్పారు...

స్వామిగారికి మనం రేడియోలో కలిసి పనిచేసిన విషయం ప్రస్తావించినందుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

Jdk Rao చెప్పారు...

Koppula Subbarao garu chanipoyaraa? naaku istamaina voice

Jdk Rao చెప్పారు...

Indira Gandhi chanipoyinappudu Vaarthalu chadhinina Reader May be ADDANKI MANNAR anukunta chaala hrudhyumga chadhivaaru eenaati ki aa voice naa chevulalo vinipisthundhi