3, ఆగస్టు 2014, ఆదివారం

ఇద్దరు మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు


(ఈరోజు స్నేహితుల దినోత్సవం)
సరిగ్గా   ముప్పయ్యారేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడుకొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి. ఎందుకంటే...


(ఒకనాటి ప్రాణ మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు)

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అలాగే, రెండో టరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది కూడా  మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యూటర్  వేగంతో శ్రీకారం చుట్టారు. 
ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో.  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు.

ఒకప్పటి వారి స్నేహానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అందుకే, రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం చాలా విషాదం అనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: