16, డిసెంబర్ 2015, బుధవారం

డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?

సూటిగా .....సుతిమెత్తగా ........ 
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 17-12-2015, THURSDAY)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలురాజాల పాత్ర స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పోరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.
అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.
యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలుదించు కుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘కాల్ మనీ’ రాకెట్  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది.
మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.
అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు  ధర్మ వడ్డీ  వసూలు చేస్తే మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు.
ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులుపోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలాఅని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. మొన్నీ మధ్య గవర్నర్ నరసింహన్ కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేసి, అనవసరమైన అప్పులు చేసి కోరి కష్టాలు కొని తెచ్చు కోవద్దని సామాన్య ప్రజలకు హితవు పలికారు.
గవర్నర్ హిత వాక్యానికి నేపధ్యం వుంది. నవజాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఆవిష్కృతం కాబోతున్న ప్రాంతంలో అప్పుల వసూళ్ళ ఆధునిక రూపం, ‘కాల్ మనీ’ పేరుతొ పురుడు పోసుకుంది. మామూలుగా అయితే ఇది ఎన్నో ఏళ్ళుగా పెరిగి  ఎరిగిన దందాకిందనే కొట్టిపారేయాల్సిన విషయం. కానీ, ఇది మరో వికృత రూపం సంతరించుకుని ఎవ్వరూ సమర్ధించడానికి అవకాశం లేని అంశంగా తయారయింది. వసూళ్ళ పేరుతొ ఆడవారి శీలాన్ని దోచుకునే ఒక కొత్త కోణం ఈ దందాలో వెలుగు చూసింది. విలువల పతనం యెంత వేగం పుంజుకుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఈ కాల్ మనీ వ్యవహారంలో పాల్గొంటున్న వారికి  మీడియా,  ‘కాల్ నాగులు’ అని నామకరణం చేసింది. అయితే పత్రికల్లో వస్తున్న దీన గాధలు చదువుతుంటే వీరికి ‘కాల నాగులు’ అనే పేరు కంటే ‘ఆనకొండలు’ అనే పేరే సబబుగా ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటె పాము ఒక్కరినే కాటేస్తుంది. ఈ ‘కాల్ నాగులు’ మొత్తం కుటుంబాలు,కుటుంబాలను ‘ఆనకొండ’ మాదిరిగా పొట్టనపెట్టుకుంటున్నారు.
ఒక పత్రికలో వచ్చిన కధనం ఇలా వుంది.
“కుమార్తెను బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఆ తల్లి ఎన్నో కలలు కన్నది.  మంచి చదువులకు ఆర్ధిక స్థోమత సహకరించక ఋణం కోసం ‘కాల్ మనీ’ వ్యాపారులను ఆశ్రయించింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆమెను వశపరచుకున్నారు. ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి బెదరగొట్టారు. కుమార్తె ఫీజు కట్టాల్సిన సమయంలో డబ్బులు ఇవ్వకుండా, కుమార్తెను కూడా తమ వద్దకు పంపిస్తే కానీ, సొమ్ము ఇచ్చేదిలేదని  షరతులు పెట్టారు. ఆవిధంగా తల్లినీ,పిల్లనూ కూడా లైంగికంగా లోబరుచుకోవడమే కాకుండా చివరి తమ దగ్గర పనిచేసే బౌన్సర్ల దగ్గరికి కూడా పంపారు. ఫలితం. చదువుల తల్లిగా వెలగాల్సిన ఆ యువతి ప్రస్తుతం తన తప్పు ఏమీ లేకుండానే, పెళ్లి కాకుండానే ఒక పిల్లకు తల్లి కావాల్సిన దుస్తితిలో చిక్కుకుంది’ 
అన్నం ఉడికిందో  లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే  చాలంటారు. బెజవాడ కాల్ మనీ వ్యాపారుల నీచ నికృష్ట చర్యలు యెంత అధోగతిలోకి దిగజారిపోయాయో తెలియడానికి ఇలాటి దృష్ట్యాంతం ఒక్కటి చాలేమో!
కాల్ మనీ రాకెట్ బయట పడిన తరువాత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ బాధితులు ఎవ్వరూ ఒక్క పైసా అప్పు చెల్లించవద్దనీ, వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తూ ఒక ప్రకటన చేసారు. ప్రజలకు ఇలాటి సమయాల్లోనే ప్రభుత్వాలు బాసటగా నిలబడాలి. ముఖ్యమంత్రి చేసిన ఈ ఒకే ఒక్క ప్రకటన వడ్డీ వ్యాపారులను యెంత బెదరగొట్టిందో తెలవదు కానీ ఆప్రకటన బాధితులకు మాత్రం మంచి మేలే చేసిందనే చెప్పాలి. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలవగానే బాధితులందరూ తమ బాధలు, దీన గాధలు చెప్పుకోవడానికి క్యూ కట్టారు. అప్పటివరకు వడ్డీ వ్యాపారుల వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి, మౌనం వీడి వున్నసంగతులన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే. ప్రభుత్వం తమకు బాసటగా వుందని తెలిసిన మరుక్షణం ప్రజలకు ఇక పరవాలేదనే ధైర్యం కలిగింది. ప్రజారంజక  పాలన చేయాలనుకునే పాలకులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇదే. 
సరే! ‘ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగంతుండు ......’ అని  పోతన పద్యంలో చెప్పినట్టు ‘రాజకీయాలు దూరని ప్రదేశం కానీ, వాటి ప్రభావం సోకని అంశం కానీ ఈ సృష్టిలో వున్నట్టు లేవు.
కాల్ మనీ  కుంభకోణం ఇలా వెలుగు చూసిందో లేదో, దానితో పాటే రాజకీయాలు కూడా  రంగ ప్రవేశం చేసాయి. దాంతో మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని అసలు విషయం మరుగున పడిపోయే పరిస్తితి ఏర్పడింది.
ఈ గందరగోళంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు బయటపడడంతో పాలక పక్షం తెలుగు దేశం పార్టీ కొంత ఇరుకున పడింది. వెంటనే తేరుకుని ఇందులో కీలక  పాత్రధారులందరూ ఒకప్పుడు వైరి పక్షం వారే అని ఎదురుదాడికి దిగింది. వైఎస్సార్ పార్టీ నాయకుడు ఏకంగా తన బాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదికే ఎక్కుబెట్టారు.ఈ కాల్ మనీ లావాదేవీల్లో ముఖ్యమంత్రి, పాలకపక్షం నాయకుల అక్రమ సంపాదన వుందని తీవ్రమైన ఆరోపణ చేసారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఢిల్లీలో మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేసారు.   
చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎడాపెడా దాడులు జరిపి అనేకమంది ఇళ్ళ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి ఒక పత్రికలో వచ్చిన కధనం ఇలా వుంది.
“తెలతెలవారుతుండగా దాడి. తేరుకునే సరికే ఇంటి చుట్టూ వాహనాలతో చక్రబంధం. చుట్టుపక్కల వారికి  తెలిసేలోగానే పోలీసు  బృందాలు ఇంట్లోకి  చొచ్చుకు వెళ్లి , బంధించి బండిలో వేసుకుని మెరుపు వేగంతో మాయం’
పోలీసుల పనితీరుకు ఇది అద్దం పడుతోంది. అంటే ఏమిటి. ఈ దందాలో ఎవరున్నారన్నది వారికి తెలియని విషయం ఏమీ కాదన్నమాట. కాకపొతే ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు, అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనుకోవాలి. సీఎమ్ గారు సీరియస్ అయ్యారు అని తెలియగానే వాళ్ళూ సీరియస్ గా తీసుకున్నారు. మొగ్గలోనే తుంచివేసి, ఇటువంటి నేరాలను అదుపు చేయగలిగితే ఈ స్థాయిలో టి ఘోరాలు జరిగిఉండేవి కావనే వాదన వుంది. ఆ రకంగా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా పోలీసు వైఫల్యం.
నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ ఛోటామోటా’ వ్యాపారులు , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజు. అయితే, ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకున్నదంటే పెద్ద తలకాయలకు కూడా అంతో ఇంతో ప్రమేయం లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పడం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక పేరు వుంది. సమస్య ఎదురయినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మలచుకుని తనకు అనుకూలంగా  మార్చుకుంటారని. ఇప్పుడు ఈ కాల్ మనీ రూపంలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. తను ఇచ్చిన ఒక్క భరోసాతో బాధితుల్లో కలిగిన చైతన్యాన్ని, తద్వారా వారిలో తాను నింపిన  ధైర్యాన్ని ఆయన  కళ్ళారా చూడగలిగారు. నేరాలను, రాజకీయాలనుంచి విడదీసి చూడగల విజ్ఞతను ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ప్రదర్శించి చూపారు. అలనాడు గుంటూరు మేయరుగా వున్న తన సొంత పార్టీ మనిషికి  కూడా నిబంధనల విషయంలో మినహాయింపు ఇవ్వని సంగతి చాలామందికి గుర్తుంది. ఇది గుర్తున్నవారికి చంద్రబాబు తిరిగి ఈ కేసులో కూడా అదేవిధమైన ధీరోదాత్తత చూపుతారనే ఆశ వుంది.

అసలు ఇలాటి నేరాలు జరిగినప్పుడు నేరస్తుడు, నేరము తప్ప మిగిలిన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మానేయాలి. పలానా నేరం చేసిన వాడు పలానా పార్టీ మనిషి అని చెప్పడం మీడియా సంచలనానికి ఉపయోగపడవచ్చు. పోలీసులే ఈ మధ్య ఈ రకమైన వింత ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వారిపని నిజమైన నేరస్తుడు ఎవరో కనిపెట్టి చెప్పడం వరకే. నేరస్తుల రాజకీయ నేపధ్యాలు బయట పడగానే  కేసు నీరుగార్చే ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలవుతాయి. రాజకీయాలతో నిమిత్తం లేకుండా నేరస్తులను శిక్షించగలిగే పరిస్తితులు లేనంతకాలం రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మినహా జరిగేదేమీ వుండదు. నేరాల విషయంలో కూడా పోలీసుల దర్యాప్తులు ఈ కోణం నుంచే జరుగుతూ వుండడం మరో విషాదం. నేరస్తులు ఎంతటివారయినా ఉక్కుపాదంతో అణచి వేస్తాం అనే గంభీర వాక్కులు ప్రకటనల వరకే పరిమితమవుతున్నాయి. అమాయక ప్రజలను శలభాలుగా మార్చి సులభంగా డబ్బు   సంపాదించాలని అనుకున్న వాళ్లకు రాజకీయనాయకులు, పోలీసులు ఒక రక్షరేఖ మాదిరిగా ఉపయోగపడుతున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ‘అదే విధంగా ఇప్పుడూ  ఎందుకు వ్యవహరించడం లేదు అని అడగడం తేలికే. కానీ, ప్రస్తుత రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి అందులోని సంక్లిష్టత అర్ధం అవుతుంది.
కానీ, ఈ తర్క వితర్కాలన్నీ న్యాయం కోరేవారికి అర్ధం కావు.  రాజకీయాలతో నిమిత్తం లేకుండా వారికి న్యాయం చేయగలిగితే పాలకుల పాత్రకు సార్ధకత చేకూరుతుంది.
అది జరిగే పనా అంటే ‘ఆశ’ పడడం అన్నది  సగటు మనిషికి మిగిలిన ఏకైక ఉపశమనం.
ఉపశ్రుతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.
ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయనప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.
దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు. (16-12-2015)
రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  
  
             

                              
        



కామెంట్‌లు లేవు: