4, అక్టోబర్ 2021, సోమవారం

పిచ్చ అసూయగా వుంది. నా మీద నాకే! – భండారు శ్రీనివాసరావు

 మొన్న ఆగస్టుకి డెబ్బయ్ ఆరులో పడ్డాను. దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే నేను పుట్టిన ఆగస్టులోనే, 2019లో కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎనభయ్యో పుట్టినరోజు ఇటీవలే జరుపుకున్న మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు.

సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది. వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువులకోసం ఈ ఏడాది బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టం లేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఆఫరు చేశారు. ఈరోజే చేరుతోంది.
నా రెండో కోడలు మొన్నీమధ్య పుట్టింటికి వెళ్ళింది. అన్ని రోజులూ ఉదయం కాఫీ నుంచి రాత్రి భోజనం వరకు మా అబ్బాయే కనుక్కున్నాడు. రాత్రి కోడలు ఫ్లయిట్ దిగి ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. అర్ధరాత్రి అలికిడి వినిపించి వెళ్లి చూస్తే, బయట డ్రాయింగు రూములో ఇన్నిరోజులుగా దుమ్ముకొట్టుకుపోయిన కుర్చీలు, బల్లలూ మెరుస్తూ కనిపించాయి. తను లోపల వంటిల్లు శుభ్రం చేస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లో ఆడదక్షత లేదుగా. ఇల్లు ఎలా ఉండాలో అలా వుంది. ఆమెకు ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలో పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఈ టైములో ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంది.
ఈరోజు పొద్దున్న నాకు బ్రేక్ ఫాస్ట్ పెడుతూ చెప్పింది తనకు ప్రమోషన్ వచ్చిందని ఇప్పుడే తెలిసిందని. మా ఇంటికి వచ్చిన రెండేళ్ళలో ఇది రెండోది. మంచి మనుషులపట్ల భగవంతుడు కూడా దయ చూపిస్తాడు.
నాకు మరో అదృష్టం వుంది. నా రాతలు మా పిల్లలు ఎవ్వరూ చదవరు. ఎందుకంటే వాళ్లకి ఈ మాధ్యమాలు ఆట్టే నచ్చవు. అంచేత ఎలా రాసినా ఇలా ఎందుకు రాశావు అనేవాళ్ళు లేరు. వాళ్ళ ఫోటోలు పెట్టవద్దు అంటారు, అంతే!
నామీద నేను అసూయ పడడానికి ఇదో కారణం కూడా.
మా ఆవిడ వుండివుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు.
దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో, ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిటని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత?

04-10-2021)


(అమెరికాలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర) 

కామెంట్‌లు లేవు: