8, అక్టోబర్ 2021, శుక్రవారం

మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు

 

అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. కంభంపాడు పెద్దబామ్మ అంటే రుక్మిణమ్మ బామ్మకు అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే.  మొత్తం కుటుంబానికి ఆవిడ విక్టోరియా మహారాణి. నాన్న నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు అంతంత మాత్రం.

ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా అమ్మగారికీ వెండి భోజనం పళ్ళేలు, వాటి మధ్యలో ఒక బంగారం పువ్వు. పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే. వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా.

ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన వాళ్ళకోసం  అమ్మ దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.

కంచమే కాదు, మా బామ్మ మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ, నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్ ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని భారతక్కయ్య మీద పడేది. అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.







కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, వెంకటేశ్వర రావుకూ (వెంకప్ప) ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు నాన్న మూడు నెలల జీతం అన్న మాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

శారదక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడి కంచాల గోల లేదు.

మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. ఓ దసరా పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు కంచం కొనుక్కొచ్చింది.

దానికి ప్రారంభోత్సవం చేయాలని సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా అది వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్ (మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం!) మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి, పిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు, మధ్యలో కలగచేసుకుని, నీళ్ళు సలసలా మరగబెట్టి, ఆ వేడి వేడి నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా సలక్షణంగా పూర్తి చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’ మాదిరిగా అలాగే వుండిపోయింది.

ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి పోయింది.

అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు, కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’

ఇప్పుడివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు. కంచం వుంది. ముచ్చట పడి కొన్న మనిషే లేదు.

కామెంట్‌లు లేవు: