14, అక్టోబర్ 2021, గురువారం

కులాల ప్రసక్తి అవసరమా – భండారు శ్రీనివాసరావు

 

మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడు కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.

మా బాబాయి కుమారుడు భండారు సత్యమూర్తి అన్నయ్య మా గ్రామానికి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. ఊళ్ళోని అన్ని కులాల వారు ఆయన్ని బాగా అభిమానించే వారు. ఆయన  గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించినప్పుడు ఇది మరింత ప్రస్పుటంగా కనబడింది. మామూలుగా పాడె మీద కాకుండా బండి మీద పడుకోబెట్టి మనుషులు లాగుతూ ఊరేగింపుగా  దాన్ని శ్మశానానికి చేర్చారు. ఆయనకీ తల కొరివి పెట్టే హక్కు మాకూ వుందని బహిరంగంగా ప్రకటించి అలాగే చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ కాదనలేని పరిస్థితి. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు.

అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా ఒక కవితలో రాశారు.

ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో SC నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.

నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.

 

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కులాలు, మతాలు, జాతులు ఎప్పటికి పొయేవి కావు. ఎవరికి నచినట్టు వారుంటారు. వీటి గురుంచి ఎంత తక్కువ మాటాడితె వాటి ప్రధాన్యత అంత తగ్గుతుంది. మాకు వీటి గోల లేదు అని చెప్పుకున్నవారికి ఉండకుండ పోదు, ఉంది ఉంది అనుకున్నవాళ్ళు వాటికి అతీతంగ ప్రవర్తించకపోరు.

bonagiri చెప్పారు...

అసలు సోషల్ మీడియా వచ్చాకే, కులమతాల పిచ్చి ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఇంచుమించు ప్రతి విద్యార్థి, వాళ్ళ కులం గ్రూపు లో మెంబర్ గా ఉంటున్నారు.
మధ్య వయసు వాళ్ళు మతాల గ్రూపు లో ఉంటున్నారు.

Chiru Dreams చెప్పారు...

కులం, మతం వొదులుకునేవాల్లకి రిజర్వేషన్ కల్పించాలి.