25, అక్టోబర్ 2021, సోమవారం

ఆగండి వినండి గమనించండి వెళ్ళండి

 ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. రెండు దశాబ్దాల నాటి సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే  కేసీఆర్ తత్వం, ఏ దశలోనూ తెలంగాణా ఉద్యమ స్పూర్తిని  దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు, సీమాంధ్రుల మనోభావాలను కొంత మేరకు దెబ్బతీసేవిలా ఉన్నప్పటికీ, తెలంగాణావాదుల ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా ఎప్పటికప్పుడు  చేయగలిగాయి. వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో  గాలి ఒత్తిడి తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు. ఈ పరిణామ క్రమంలో కేసీఆర్ ఎదుర్కున్న ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ  సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా పుష్కర  కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా  నిభాయించుకోవడం మరో ఎత్తు. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే ఇతర పార్టీల్లోనే కాదు స్వపక్షంలోని  రాజకీయ శక్తులను కూడా  ఆదిలోనే కట్టడి చేసి, తనదారి లోకి తెచ్చుకున్న విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి  తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

అందలం ఎక్కినంత మాత్రాన పండగ కాదు. తెలంగాణాలో రాజకీయం చాలా విభిన్నమైనది. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తూ వుంటుంది.  లక్ష్యసాధనలో ఏకోన్ముఖంగా సాగిన తెలంగాణా సమాజం అదేమాదిరి కొత్త ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ తలూపకపోవచ్చు. తెలంగాణా స్వప్నం నెరవేరింది కనుక, ఇప్పుడు ప్రజల దృష్టిలో  ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి పాలక పక్షం అయిన  టీఆర్ఎస్ కూడా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటి మాత్రమే.

ఒక విషయం పార్టీ అధినేత గుర్తుంచుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన విధంగానే అన్ని వైపులనుంచి ప్రత్యర్ధులు బాణాలు గురిపెడతారు. పద్మవ్యూహాల రచన బృహత్తరంగా సాగుతుంది. వాళ్ళు ఎక్కుబెట్టే అస్త్రాల పదును పెరగడానికి  పాలకపక్షం స్వయంకృతాపరాధాలు కూడా తోడ్పడడానికి అవకాశం వుంది.

అన్నిటికన్నా ముఖ్యం, అలనాడు ప్రజల్లో అపరిమితంగా భావోద్వేగాన్ని రగిల్చిన  తెలంగాణా అనే బ్రహ్మాస్త్రం  ఇప్పుడు టీఆర్ఎస్ అంబుల పొదిలో లేదు. అదిప్పుడు స్వతంత్ర భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం రూపంలో ఆవిర్భవించి ఏడేళ్లు దాటిపోయాయి.

టీఆర్ ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఏళ్ళు. వ్యక్తుల జీవితాల్లో అయినా, వ్యవస్థల జీవితాల్లో అయినా ఈ వయసు చాలా ప్రమాదకరమైనది. దారి తప్పడానికి, గాడి తప్పడానికి ఈ ప్రాయమే కారణం. ఒకింత జాగ్రత్త పడగలిగితే అవసరమైన పరిణతి  లభిస్తుంది. ఆగి, నిలిచి, వెనక్కి తిరిగి చూసి తిరిగి  ముందడుగు వేయాల్సిన సమయం.

అధికారంలో ఉన్నవాళ్ళకి ఎన్నో చేశామనే అభిప్రాయం వుంటుంది. అన్నీ చేయలేదేమో అని కొందరికి అనిపిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాధాన్యతల ఎంపికలో వచ్చే తేడా ఇది.

టీఆర్ఎస్ ప్లీనరీలో ఇటువంటి ‘కీలక’ అంశాలపై దృష్టి పెట్టాలనేది హిత వాక్యం.



(25-10-2021)

కామెంట్‌లు లేవు: