28, జూన్ 2016, మంగళవారం

నాది నాది అనుకున్నది నీది కాదురా


పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్ళు మారుస్తున్దంటారు. మేము పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము.  ఆఖరికి ఇళ్ళ సమస్య లేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను  బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే  మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.
1975 లో హైదరాబాదు  రేడియోలో  చేరినప్పుడు 75  రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్.  కాలనీలో, సెకండ్ క్లాసు టిక్కెట్టుతో  ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కాపురం.  రిటైర్ కాగానే,  తదుపరి ఎల్లారెడ్డి గూడా. ఇదిగో ఇప్పుడు మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో తెలవదు. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో. ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు  పరిచయం అవుతారు. అదే  కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.
నిన్ననే మా ఇంటాయన, ఆయన  ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము,  ఆయన తాలూకు ఒక పెద్ద మనిషి నిన్న పొద్దున్నే వచ్చి  చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు. రెండు నెలల్లో ఖాళీ చేయమని.
మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే  పోలా.

బాధ అల్లా ఒక్కటే. మిగిలిన చోట్లతో పోలిస్తే, ఈ మాదాపూర్ లో మానవ సంబంధాలు అంతంత మాత్రం. పావురాలు, మొక్కలతోనే అనుబంధం. దాన్ని తెంచుకోవడం ఎల్లా అన్నదే ఇప్పుడు పట్టుకున్న మనాది.       

3 వ్యాఖ్యలు:

నీహారిక చెప్పారు...

శ్రీకృష్ణులవారు కూడా నివాసం మీద మమకారం లేనివాడే ఉత్తమ భక్తుడు అని చెప్పారండీ ! ఎవరైనా కారణజన్ముడు పుట్టి ఉంటే కేసీఆర్ మరియు చంద్రబాబు నాయుడు గార్లు కట్టుకుంటున్న ఆకాశసౌధాలను వదలమంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.ఆశలసౌధాన్ని పోగొట్టుకునేటప్పుడు కలిగేవేదనకన్నా ఆకులూ అలములే మిన్న కదూ ?

అజ్ఞాత చెప్పారు...

sir you do not own house/flat?

voleti చెప్పారు...

Sir..అప్పట్లో జర్నలిష్టులకు జాగాలు ఇచ్చేవారని విన్నాను..మీవంటి సీనియర్ పాత్రికేయులకు ఇండ్ల స్థలం కేటాయించక పోవడం అన్యాయమే...