28, జూన్ 2016, మంగళవారం

తనకు తానుగా మోడీ విధించుకున్న తుది గడువు



సూటిగా...సుతిమెత్తగా .....భండారు శ్రీనివాసరావు
తనకు తానుగా మోడీ విధించుకున్న తుది గడువు
చంద్రకాంత్ కులకర్ణి. ఈయన ఒక విశ్రాంత ఉద్యోగి. ప్రధాని నరేంద్ర మోడీ నోట ఈయన పేరు వినబడేంత వరకు ఈ కులకర్ణి గారెవరో ఎవరికీ తెలియదు.
నెలనెలా ఆకాశవాణి ద్వారా ప్రధాని ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో దేశ ప్రజలతో ముచ్చటించడం అనేది  ఆనవాయితీ. గత ఆదివారం నాడు రేడియోలో మాట్లాడుతూ ప్రధాని ఈ కులకర్ణి ప్రసక్తి తెచ్చారు. తాను ప్రవేశపెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం పట్ల ముగ్ధుడైన చంద్ర కాంత్ కులకర్ణి, తనకు నెలనెలా వచ్చే పదహారువేల రూపాయల పించనులో నెలకు ఐదువేల చొప్పున స్వచ్చ భారత్ కార్యక్రమానికి  విరాళంగా ఇచ్చినట్టు తెలియచేశారు. ఒక పించనుదారుడు ఈ విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమానికి తనకున్నంతలో సాయపడాలి అనుకోవడం మెచ్చదగిన సంగతే.  అంతటి బృహత్తరమైన కార్యక్రమం అమలుకు ఆ అయిదువేలు ఏపాటి అనిపించవచ్చు. కానీ అందులో దాగున్న స్పూర్తిని లెక్కతీసుకుంటే అది గొప్ప సంగతే.


ప్రధాని పనిలో పనిగా తన మనసులోని మరో మాటగా నల్ల ధనం ప్రసక్తిని కూడా  తీసుకువచ్చారు. అసలు ఈ నల్లధనం గురించి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీనే ప్రజలకు వాగ్దానం చేసారు. విదేశాలకు తరలి వెళ్ళిన నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు మొదలు పెడతామని భారతీయ జనతా  పార్టీ తన ఎన్నికల ప్రణాళిక ఐదో పేజీలో పేర్కొన్నది.  ఈ వాగ్దానానికి కొన్ని రంగులు అద్ది విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న పాతిక లక్షల కోట్ల పైచిలుకు నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి ప్రతి పౌరుడికి  కొన్ని లక్షల రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల  సభల్లో బీజేపీ నాయకులు హామీలు గుప్పించిన మాట నిజమే అయినా అంత విస్పష్టంగా  ఎన్నికల  ప్రణాళికలో పేర్కొనని మాట కూడా నిజమే. అయితే,  బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాల్లో ఉత్ప్రేక్షాలంకారయుక్తంగా నేతలు ఇచ్చిన హామీలే జనాలకు బాగా గుర్తుండిపోయాయి. అందుకే నల్లధనం గురించి ఎవరయినా అడిగినప్పుడల్లా పాలక పక్షం నేతలు మొహం చాటేసుకోవాల్సి వస్తోంది.
ఇక  ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఈ ప్రసక్తి తీసుకు వచ్చారు. అయితే  మన్ కీ బాత్ ఆయన పేర్కొన్నది మన దేశంలో అడ్డూ అదుపూ లేకుండా కొండల్లా పెరిగిపోతున్న నల్లధనం గురించి. విదేశీ బ్యాంకుల్లో లెక్కా పత్రమూ తెలియకుండా  కొందరు సంపన్నులు దాచుకున్న నల్లధనం గురించి కాదు.  
సెప్టెంబర్ నెల ముగిసేలోగా ఇంతవరకు లెక్కల్లో చూపని అప్రకటిత  ధనానికి లెక్కలు చెప్పాల్సిందే అంటూ ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఇదే చిట్టచివరి అవకాశం. స్పందించని సంపన్నులకు తిప్పలు తప్పవు’  అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
‘స్వచ్చందంగా వివరాలు ప్రకటించేవారిపై ఎలాటి విచారణ జరగదు. ఎలాంటి ప్రశ్నలు అడగరు. ప్రభుత్వానికి తెలవకుండా గుప్తంగా దాచుకున్న ఆదాయాన్ని బయట పెడితే అపరాధ రుసుముతో సరిపెడతారు. తద్వారా అనేక రకాల భారాల నుంచి బయటపడవచ్చు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ పారదర్శక వ్యవస్థలో భాగం కావడానికి ఇది చిట్టచివరి అవకాశం’ అని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.
 ‘పాత భారాన్ని ఒదిలించుకొండి, కొత్త ఇబ్బందులను కొనితెచ్చుకోకండి’ ఇదీ ప్రధాని సందేశ సారాంశం.
దేశ జనాభా నూటపాతిక కోట్లు వుంటే ఇందులో యాభయ్ లక్షల పైచిలుకు  ఆదాయం కలిగిన వారు లక్షా యాభయ్ వేలమందే కావడం విచిత్రం. ఇవి అధికారిక లెక్కలు. ఇంతకు మించిన ఆదాయం కలిగిన వాళ్ళు లక్షల్లో వున్నారు. అయినా  వారు పన్ను చెల్లించడానికి సిద్ధంగా లేరు. 
ఆదాయం లేని వారి సంఖ్య కూడా ఈ పేద దేశంలో తక్కువేమీ కాదు. కానీ ఆదాయం భారీగా వుండి కూడా, పన్ను చెల్లించకుండా తప్పుకుంటున్న వారిని ఉద్దేశించే ప్రధాని తన మనసులోని మాట చెప్పారన్నది విస్పష్టం.
ఒక్క రోజు గడిచిందో లేదో, సోమవారం నాడే మోడీ మళ్ళీ కొరడా ఝలిపించారు.
‘అవినీతిపరులకి, నల్ల కుబేరులకి చట్టం అంటే ఏమిటో తెలిసివచ్చేట్టు చేస్తా’ అని ఒక ఆంగ్ల జాతీయ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోమారు తీవ్రంగా హెచ్చరించారు. ఈసారి ఆయన మాటల్లో పదును పెరిగింది. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయబోనని కూడా స్పష్టం చేసారు.       
ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన పెట్టిన గడువు కొంచెం  అటూ ఇటూగా మూడు మాసాలే. అంచేత, అప్పటివరకు వేచి ఉండడానికి అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. ఐతే, ఇది తాజాగా దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి అమలు విషయంలో ఏదైనా తాత్సారం జరిగితే అప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే వుంటుంది.
ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవాలి.
గుప్త ధనాన్ని స్వచ్చందంగా వెల్లడి చేసుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి  గంభీర ప్రకటనలు చేసాయి. ఇలానే తుది గడువులు విధించాయి. ఇలానే కఠిన  హెచ్చరికలు చేశాయి. కాబట్టి ఇలా అవకాశం ఇవ్వడం ఇదే ఆఖరుసారి కూడా కాకపోవచ్చన్న సందేహాలు జనంలో వున్నాయి.  
1997 లో ఒకసారి ఈ స్వచ్చంద గుప్త ధన వెల్లడి  పధకాన్ని అ నాటి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రకటించారు. అప్పుడు కూడా డిసెంబరు ముప్పయి ఒకటిని తుది గడువుగా పేర్కొన్నారు. గడువు పెంచేది లేదనీ, తిరిగి మరో అవకాశం ఇచ్చేదిలేదనీ ఇలాగే హెచ్చరించారు.
ఫలితాలు కళ్ళు తిరిగేలా వచ్చాయి. గుప్తధనం ఆసాములు పోటీలు  పడి, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అంచనాలను మించి తమ రహస్య ఆదాయాల లెక్కలు బయట పెట్టారు. మూడులక్షల  యాభయ్ వేలమందికి పైగా సంపన్నులు ఈ పధకం కింద ధరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ విధంగా ప్రకటించిన రెండువందల అరవై బిలియన్ రూపాయల నల్ల ధనం ఈ పధకం ధర్మమా అని  తెల్లధనం రూపాన్ని సంతరించుకుంది.  అందుకోసం వాళ్ళు ముప్పయి శాతం అపరాధ రుసుము ప్రభుత్వానికి చెల్లించారు. ఏతావాతా అక్షరాలా డెబ్బయి ఎనిమిది బిలియన్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అనుకున్న దానికి అయిదు రెట్లు, దాదాపు ఏడువేల ఎనిమిది వందల కోట్లు ఒకేఒక ఆర్ధిక సంవత్సరంలో సమకూరడంతో ప్రభుత్వ వర్గాలు రెట్టింపు  ఖుషీ.
“ప్రజలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు పులుకడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు అనేది నా నమ్మకం. అదే నిజమయింది” అని వ్యాఖ్యానించారు నాటి ఆర్ధిక మంత్రి చిదంబరం. ఇది జరిగి పందొమ్మిది ఏళ్ళు. అంటే అప్పటి రూపాయి విలువతో పోల్చి చూసుకుంటే అప్పుడు ఖజానాకు చేరిన మొత్తం లక్ష కోట్ల పైమాటే.
మళ్ళీ ఇప్పుడు మరోసారి తుది అవకాశం అంటున్నారు. మళ్ళీ కొన్ని లక్షల కోట్లు సర్కారు ఒళ్ళో అప్పనంగా వచ్చి పడతాయి. మోడీ అంటే ఏమిటో, తన తడాఖా అంటే ఏమిటో చూపిస్తాను అని ప్రధాని చాలా గట్టిగా చెబుతున్నారు కనుక ఈ మొత్తం మరింత బాగా పెరగనూ వచ్చు. ఖజానా పొంగి పొరలనూ  వచ్చు.
అయితే, ఇదే  ఆఖరు అవకాశమా అన్నదే సందిగ్ధం. ఎందుకంటే అలా అని అప్పుడు కూడా ఇంత భీకరంగానే చెప్పారు కాబట్టి.
ప్రభుత్వం అన్నా, చట్టాలు అన్నా ప్రజలకు భయం వుండాలి. అదే సమయంలో గౌరవం కూడా వుండాలి. ఇవి రెండూ వుంటే ఇక చెప్పే పనే లేదు. చట్టాలు చట్టుబండలు కాకుండా వుంటాయి.
అలాగే,  ప్రభుత్వాలు చెప్పే మాటలపై ప్రజలకు విశ్వాసం వుండాలి. ప్రభుత్వంలో వున్నవాళ్ళు ఏదైనా చెబితే దాన్ని అమలుచేసి తీరతారన్న నమ్మకం వారికి వుండాలి. అప్పుడే ప్రభుత్వాలు జారీ చేసే ఈ విధమైన హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేస్తారు.
నల్లధనం వివరాలు స్వచ్చందంగా వెల్లడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ ముప్పయి తుది గడువు అని ప్రకటించారు. సంతోషం.
దేశప్రజల ముందు తనని తాను  రుజువు చేసుకోవడానికి, ప్రజలు తనమీదపెట్టుకున్న ఆశలు అడియాసలు కాకుండా చూడడానికీ,  మోడీ గారికి కూడా  అదే సెప్టెంబర్ ముప్పయి తుదిగడువు.
భర్తృహరి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ అన్నాడు. అంటే గుప్తంగా దాచుకున్న ధనం వంటిది అని అర్ధం.  ఈ గుప్తధనం జాతిని ఉద్దీపింప చేస్తుంది. సంపన్నులు రహస్యంగా దాచుకునే  గుప్తధనం అలాంటిది కాదు. అది జాతిని నిర్వీర్యం చేస్తుంది. అంచేత మోడీ ఈ విషయంలో విజయులు కావాలనే అందరూ కోరుకుంటారు.  
ఉపశృతి:
సినిమా విడుదల పోస్టర్ విషయంలో బాపూరమణల జోక్  ఒకటి వుంది.
“నేడే విడుదల, రేపే ఆఖరి రోజు, త్వరపడి నేడే చూడండి”
దీనికీ, ఈ స్కీముకీ సంబంధం ఏమిటంటారా! ఏమో!
(29-06-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
     
    


కామెంట్‌లు లేవు: