9, జూన్ 2016, గురువారం

భద్రతా ఏర్పాట్లు - సామాన్యుల అగచాట్లు

సూటిగా...సుతిమెత్తగా.......
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 12-06-2016, SUNDAY)
  
అమెరికా  మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
“ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.”
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
నరేంద్ర మోడీ భారత ప్రధానుల్లో ఎంచదగిన వ్యక్తి. ఒక అతి సాధారణ కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మనిషి. ప్రతి  సామాన్య పౌరుడు తనలో ఆయన్ని చూసుకుంటారని ప్రతీతి.
ఆయన ఆ పదవిలోకి వచ్చిన తరువాత సెక్యూరిటీ పేరుతొ ప్రజలకు దూరం అవుతున్నారా అనిపిస్తోంది. అది ఆయన తప్పు కాదు. ఒక్కసారి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత భద్రతా వ్యవస్థ అధీనంలోకి  వెళ్లిపోవాల్సిందే. ఆ పదవి అలాంటిది.


బహుశా తన చుట్టూ ఇంతటి స్థాయిలో భద్రత వుందని ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఢిల్లీ లోని ఒక సాధారణ పోలీసు జవాను చెప్పేదాకా నిజానికి  మోడీకి కూడా ఈ విషయం తెలవదు. ఈ వివరం తెలుసుకోవడానికి ఒక ఏడాది వెనక్కి పోవాలి.
నిరుడు అక్టోబర్  రెండో తేదీ, గాంధీ జయంతి రోజున  దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంభమయినప్పుడు, ప్రధాని మోడీ, ఢిల్లీలో  అపరిశుభ్రంగా వున్న ఒక పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని గమనించారు. అక్కడి పోలీసు జవానుతో నేరుగా ఆయన ఆ విషయం ప్రస్తావించారు. రోజూ కాసేపు  శ్రమ దానం చేసి, పరిసరాలను శుభ్రం చేసుకోవచ్చు కదా అన్నది మోడీ  మహాశయుల సూచన.
దానికి ఆ  పోలీసు ఇచ్చిన సమాధానంతో మోడీ గారికి తన చుట్టూ అల్లుకుకుని వున్న భద్రతావలయం గురించీ, తన భద్రత పేరుతొ సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించీ తెలిసివచ్చింది.  ఇంతకీ  ఆ పోలీసు చెప్పింది ఏమిటంటే...
‘అయ్యా మీరు చెప్పేది నిజమే. కానీ, మా పోలీసుల్లో ఎక్కువమందికి, వీ.వీ.ఐ.పీ.ల భద్రత కనిపెట్టి చూడ్డంతోనే పుణ్యకాలం సరిపోతోంది. మీరు చెప్పిన పని చేయడానికి పోలీసు స్టేషన్లలో ఎవరూ మిగలడం లేదు’
ప్రధాని తిరిగి తన కార్యాలయం చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని, తన భద్రతా ఏర్పాట్లను గురించి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించడం, భద్రతను అవసరమయిన స్థాయికి తగ్గించాలని గట్టిగా సూచించడం.
అందుకు అనుగుణంగా ప్రధాని కార్యాలయం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నగర పర్యటనల సమయంలో అన్ని చోట్లా పోలీసులను మొహరించి మొత్తం నగరాన్ని ఒక దుర్భేధ్యమైన కంచుకోటగా మార్చవద్దనీ, అవసరమైన చోట్లనే తగిన  బందోబస్తు ఏర్పాటు చేయాలనీ.
ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఆక్షేపణీయం యెంత మాత్రం  కాదు. అయితే  ఆ పేరుతొ చేస్తున్న హడావిడీ, అనవసర వ్యయం గురించి ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనడం కూడా సబబు కాదు.
మరో ఉదంతం చెప్పుకోవాలి.
చైనా అధక్షుడు అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. ఆయన వెళ్ళే మార్గాలనే కాకుండా చుట్టుపక్కల దారులను కూడా దిగ్బంధించారు. ఆ క్రమంలో పార్కింగ్ చేసివున్న కొన్ని వాహనాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు.  పార్కింగు చేసి వున్న ఒక కారులోని మహిళను కిందికి దిగే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రేన్ తో పైకి లేపిన వాహనంలో ఆ మహిళ చిక్కుకు పోయిన సమాచారం బయటకు పొక్కి, పోలీసులను చిక్కుల్లో పడేసింది.


ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా,  ఏదైనా  జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా  ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది  మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు,  సాధారణ సమావేశం కావచ్చు  పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు  ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా  భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ  మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు.  ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఉదాహరణకు 2014 లో ఒక వ్యక్తికి అసాధారణ భద్రత కల్పించారు. అతడికి ఏర్పాటు చేసింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. అతడికి పహరా కాయడానికి కేంద్ర భద్రతా దళానికి చెందిన పాతికమంది సాయుధ పోలీసులను నియోగించారు. ఇంతకీ ఆ వీ.వీ.ఐ.పీ. వున్నది ఒక ఆసుపత్రిలో చావుబతుకుల నడుమ.  వెంటిలేటర్ల సాయంతో అతగాడి ప్రాణాలను  ఏ క్షణానికి ఆ క్షణం డాక్టర్లు నిలిపి వుంచుతున్న స్తితిలో.  వెంటిలేటర్లు ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు హరీ అంటాయి.  అయినా  పోలీసు  భద్రతమాత్రం  కొనసాగించారు. ఇది అవసరమా అంటే అవుననే అంటారు అధికారంలో వున్నవాళ్ళు.
రజ్బీర్ సింగ్.  ఎన్ కౌంటర్ స్పెషలిష్టు. ఉగ్రవాదుల ముప్పు కారణంగా అతడికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. దొంగవాడికి మడి బట్టలు అడ్డమా అన్నట్టు అంత సెక్యూరిటీ వున్నా అతడికి ఉగ్రవాదుల చేతుల్లో చావు తప్పలేదు. కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్  మహాజన్  ని అతడి సోదరుడే మట్టుబెట్టాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని  పదవిలో ఉన్నప్పుడే ఆమె వ్యక్తిగత అంగరక్షకులు కాల్చి చంపారు.
ఈ సందర్భంలో ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం.
స్వీడన్ దేశపు ప్రధాన మంత్రి పామే ప్రతి రోజూ మాదిరిగానే ఆఫీసునుంచి ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. సినిమాకు పోదామన్న కోరికను భార్య వెలిబుచ్చింది. సరే అన్నారు ప్రధాని. వారిద్దరూ కాలినడకన బయలుదేరి భూగర్భంలో వున్న మెట్రోలో ప్రయాణించి  గ్రాండ్ సినిమా  థియేటర్  కు చేరుకున్నారు. (మన దేశంలో ఇలాటివి కలలో కూడా ఊహించలేము). సినిమా చూసి, పామే దంపతులు తిరిగి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే క్రమంలో దారిలో ఒక దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు  జరపడంతో పామే అక్కడికక్కడే మరణించారు. ప్రధాని భార్య ఈ సంఘటనలో గాయపడింది. ఈ దుర్ఘటన  కారణంగా స్వీడన్ దివంగత ప్రధాని నిరాడంబర జీవన శైలి ప్రపంచానికి తెలిసివచ్చింది.
పలానా దేశపు ప్రధాన మంత్రి  విమానాశ్రయంలో తోటి ప్రయాణీకుల మాదిరిగానే క్యూలో నిలబడి బోర్డింగు పాసులు తీసుకున్నారనీ, మరో దేశపు ప్రధాని,  కొడుకును స్కూల్లో దింపి రావడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడనీ ఇలాటి  వార్తలు విన్నప్పుడు, ఫోటోలు చూసినప్పుడు  కూడా ఆశ్చర్యం అనిపించక మానదు. మన దేశంలో కూడా ఇటువంటి రాజకీయ ప్రముఖులు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఉదాహరణకు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్  కలాం,  కేంద్ర రక్షణ మంత్రి పరీకర్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ,  త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,  పుదుచ్చేరి మాజీ  ముఖ్యమంత్రి రంగస్వామి  ఈ కోవలోకి వస్తారు.
గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, పరీకర్,  తన నిరాడంబరత్వంతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ప్రభుత్వ వాహనాలను, భద్రతా సిబ్బందిని పక్కన బెట్టి హాయిగా ఝాం ఝాం  అంటూ మోటారు సైకిల్ పై  హాయిగా  తిరిగే వారు. కేంద్ర రక్షణ మంత్రి అయిన తరువాత గోవా బీజేపీ  శాఖవారు ఆయన గౌరవార్ధం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడుతూ పరీకర్, ప్రముఖుల భద్రత గురించి గమ్మత్తయిన వ్యాఖ్యలు చేసారు.
“నేనొక విషయం గట్టిగా చెప్పగలను. ఎవరయినా నిజంగా భద్రతను కోరుకుంటే,  ప్రముఖులకు ఇచ్చే భద్రత కావాలని ఎట్టి పరిస్తితుల్లోను కోరుకోకూడదు’ అన్నారాయన.
‘వీవీఐపీల కదలికలను గురించి భద్రతాధికారులు ముందస్తుగానే సమాచారాన్ని వాకీ టాకీల్లో సంబంధిత పోలీసు అధికారులకి అందిస్తుంటారు. ఆ సూచనలు వాళ్లకు ఏమాత్రం అర్ధం అవుతాయో లేదో తెలియదు కానీ, ఏదో చేయాలనీ, సంచలనం సృష్టించాలని తలపెట్టే సంఘ విద్రోహ శక్తులకు మాత్రం వీవీఐపీ కదలికలు గురించి ఇట్టే  తెలిసిపోతుంది’ ఇదీ పరీకర్ మహాశయులు వ్యంగంగా ఇచ్చిన వివరణ. 
అసామాన్యులకోసం అధికారులు అసాధారణ రీతిలో చేసే భద్రతా ఏర్పాట్ల కారణంగా  సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే  ఈ విషయం ఆ ప్రముఖులకు తెలుసో లేదో తెలవదు. శ్రీలంక అధక్షులు మహీంద్ర రాజ పక్సే వెంకన్న దర్శనం కోసం ఓ సారి తిరుపతి వచ్చారు. స్వామి సేవ చేసుకుని తిరిగి వెళ్ళారు. అయితే  అయన రాకను పురస్కరించుకుని చేసిన భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు చుక్కలు చూపించాయి. కొండ ఎక్కకుండానే వారికి దేవుడు కనబడ్డాడు. తిరుపతి అలిపిరి సెక్యూరిటీ గేటు వద్ద అసంఖ్యాకంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.   మరునాడు పత్రికల్లో వచ్చిన ఆ  ఫోటోలు  చూసే  అవకాశం ఆ విదేశీ  అతిధి దేవుడికి ఎలాగూ వుండదు. అంచేత తన భద్రత కారణంగా జనాలు ఎంతగా ఇక్కట్లకు గురయిందీ తెలిసివచ్చే అవకాశం ఆయనకి బొత్తిగా  లేదు. 


ఆర్భాటపు భద్రతా ఏర్పాట్లకోసం ప్రజాధనం ఖర్చయినా ప్రజలు సహిస్తారు, ఎంతవరకు అంటే, తమ దినవారీ పనులకు ఆ ఏర్పాట్లు అడ్డం  రాకుండా ఉన్నంత వరకు.
ఉపశృతి: 
ఎనభయ్యవ దశకం చివర్లో  నేను  మాస్కో రేడియోలో  పనిచేస్తుండేవాడిని. సోవియట్  యూనియన్  రాజధాని నగరం మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే వీధికి,  సోవియట్ వ్యవస్థకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా, (ఆనాటి) సోవియట్ అధినాయకుడు మిహాయెల్  గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండే వాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.
ఒకసారి మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది. ఆ కాన్వాయ్ ఏ ప్రముఖుడిదో కాకపోవడం ఇందులోని విశేషం.(11-06-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595కామెంట్‌లు లేవు: