21, జూన్ 2016, మంగళవారం

ప్రధాని మోడీ యోగ మహిమ


సూటిగా.....సుతిమెత్తగా.........భండారు శ్రీనివాసరావు

మోడీ అనే రెండక్షరాలకు ఇప్పుడు యోగా అనే మరో రెండక్షరాలు జోడీ కలిసాయి. గత రెండు రోజులుగా ఈ రెండూ  దేశదేశాల్లో మారుమోగిపోయాయి. బుల్లితెరల పుణ్యమా  అని వాటి ప్రతిధ్వనులు ఇంటింటా వినిపించాయి కూడా.
భారత ప్రధాని మోడీ అభ్యర్ధన మేరకు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో,  అనేక దేశాల్లో దీన్ని పాటించారు. ఇది సాధించిన ఘనత ఆయన ఖాతాకే చేరుతుంది. ఇందుకు ఆయన్ని అభినందించి తీరాలి.
చండీఘడ్  లో ప్రధాన వేడుక ప్రధానమంత్రి మోడీ సమక్షంలో జరిగింది. దాదాపు ముప్పయివేలమంది యోగాభ్యాస విన్యాసాల్లో పాల్గొనడం, భద్రత కోసం అయిదు వేలమంది సాయుధ పోలీసులను నియోగించడం చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని  ప్రభుత్వం ఎంత ప్రతిష్టగా తీసుకుందో అర్ధం అవుతుంది. నిరుటిమాదిరిగానే  ప్రధాని  యోగాభ్యాసం కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యువతరానికి స్పూర్తిని కలిగించే ప్రయత్నం చేసారు.


న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం భవనంపై మెరిసిన భారతీయ యోగా లోగోతో సహా పత్రికలన్నీ యోగా ప్రాశస్త్యాన్ని వివరించడంలో పోటీ పడ్డాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ దినోత్సవాన్ని అంగరంగవైభోగంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కానవచ్చింది. పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాలో, అటు వైపువున్న మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఈ యోగా భజంత్రీలు మోగిన దాఖలా అంతగా కానరాలేదు. హైదరాబాదు  రాజభవన్ లో  గవర్నర్ నరసింహన్, వెలుపల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో యోగా దినోత్సవం జరిపారు.
దేశదేశాల్లో జరిగిన ఈ ఉత్సవాల క్లిప్పింగులు చూస్తుంటే, వాటిల్లో యోగా కంటే చూపరులను బాగా ఆకట్టుకునే  జిమ్నాస్టిక్ ప్రదర్శనల ఛాయలు ఎక్కువగా గోచరించాయి. నీళ్ళపై తేలుతూ యోగా విన్యాసాలు చేస్తున్న వారిని చూస్తుంటే అలానే అనిపించింది. దేశ వ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవాల్లో  భాగంగా అత్యంత శీతల ప్రదేశం సియాచిన్  లో భారత సైనికులు, అలాగే, కొన్ని చోట్ల వేలాదిమంది గర్భిణీ స్త్రీలు, పలు చోట్ల బాలబాలికలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అధికారులు, అనధికారులు,  భారతీయ జనతా పార్టీకి  చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎన్డీయే  భాగస్వామ్య పక్షాల నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా డే ని  విశ్వ వ్యాప్తంగా  జరుపుకోవడం  ఇది రెండో సారి. నిరుడు కూడా ఇలానే ఆర్భాటంగా నిర్వహించి, యోగా విశిష్టతను  వివరిస్తూ ఉద్బోధలు చేసారు. ఆ సందర్భంగా,  జనంలో యోగా స్పూర్తిని  రగిలించడానికి ప్రయత్నించిన నేతల్లో చాలామంది ఈ ఏడు జరిగిన యోగా వేడుకల్లో  కాళ్ళు ముడవడానికి సయితం కీళ్ళు సహకరించక  నానా  ఇబ్బందులు పడిన దృశ్యాలు  టీవీల్లో దర్శనమిచ్చాయి.  నేతల్లో చాలామంది సందర్భానికి తగ్గట్టుగా యోగా వైశిష్ట్యాన్ని గురించి యధాశక్తి  బోధలు చేస్తున్నారే కాని, వాటిని మనస్పూర్తిగా అను నిత్యమూ అభ్యాసం చేయడం లేదన్న విషయం తేటతెల్లం అవుతోంది.
ఈ మొత్తం తంతును టీవీల్లో చూస్తున్నవారికి ఇదంతా ప్రచార ఆర్భాటం అనే భావన కలిగింది. చక్కటి అంశాన్ని మోడీ ఎత్తుకున్నారు అని నమ్మేవారికి కూడా ఈ మాదిరి అభిప్రాయమే కలిగింది.
యోగాని ప్రపంచానికి ప్రసాదించింది పతంజలి అయినప్పటికీ, దాన్ని తొలిసారి  పరిచయం చేస్తోంది  నరేంద్ర మోడీ అనే స్థాయికి ప్రచార  స్థాయి సాగింది.  సాంఘిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు ఈ విషయంలో మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆర్భాటాన్ని  ప్రశ్నించిన వారిని అసహనంతో వ్యాఖ్యానిస్తున్నారు.   యోగా అంటేనే, శరీరాన్ని,  మనసును అదుపులో ఉంచుకోవడం. మరి వారు యోగా చేస్తున్నారో లేదో తెలియడం లేదు.
గతంలో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా వున్న  రోజుల్లో ధీరేంద్ర బ్రహ్మచారి అనే ఒకాయన వున్న సంగతి, ప్రధాని ప్రాపకంతో ఆయన దూరదర్శన్ జాతీయ ఛానల్లో జాతి మొత్తానికీ యోగాభ్యాసాలు బోధించిన సంగతి ఈనాటి తరానికి గుర్తుండక పోవచ్చు. ప్రధానికి  సన్నిహితుడు అనే ఒకే ఒక్క పేరుపొందిన ఈ ప్రముఖుడు,  ప్రధాని ఇందిర పేరుకు యెంత చేటు తెచ్చిందీ  బహుశా ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు.
ఇప్పుడు మరో యోగి పేరు విస్తృతంగా వినబడుతోంది. యోగా అనగానే ఆయన పేరు గుర్తు వచ్చేంతగా ఆయన పేరు ప్రఖ్యాతులు  పెరిగిపోయాయి. కానీ, ఆయన ఆధ్వర్యంలో తయారవుతున్న కొన్ని ఔషధ ఉత్పత్తుల విషయంలో చెలరేగుతున్న వివాదాలు కూడా తక్కువేమీ కాదు. ప్రోత్సహిస్తున్న పాలకులు ఈ విషయాలతో పాటు గత పాలకుల అనుభవాలను కూడా గమనంలో వుంచుకోవాలి.
భారతీయ యోగా సమస్త ప్రపంచానికి ఆరాధ్యనీయం కావడం చాలా గొప్ప సంగతి. కానీ,  యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆరాధనని కార్పొరేట్ శక్తులు వాళ్ళ పద్దతుల్లో దోపిడీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం.
పైసా ఖర్చు లేకుండా, మనుషుల   మానసిక, శారీరక ఆరోగ్యాలకు యోగా భరోసా ఇస్తుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. పేదలు అత్యధిక సంఖ్యలో వున్న మనదేశానికి  యోగా  ఆ రకంగా మన ప్రాచీనులు  ప్రసాదించిన  వరం. అలాంటి యోగా ఇంటింటికీ వ్యాప్తి చెందాలి. అంతే కాని, ఏడాదికోమారు తలచుకుని, మురిసిపోయి  మరిచిపోయే వ్యవహారం కాకూడదు.   
ప్రచారం కారణంగా యోగా పట్ల ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయితే ఇది వికర్షించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదీ వ్యాపారమయమవుతున్న ఈ రోజుల్లో ఈ జాగరూకత మరింత అవసరం.
చాలామందికి గుర్తుండకపోవచ్చు.  1995 లోనే పసుపుకు  అమెరికా చట్టం ప్రకారం పేటెంటు హక్కు పొందే ప్రయత్నం జరిగింది. అప్పట్లో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి  డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.ఏ. మష్లేకర్ ఈ అంశంపై సవాలు చేయడం వల్ల ఆ దేశపు పేటెంటు హక్కుల కార్యాలయం వెనక్కి తగ్గింది. మళ్ళీ పేటెంటు హక్కుల విషయంలో పాలకుల అలసత్వం కారణంగా వేప ఆకుపై పేటెంటు హక్కును  ఒక అమెరికన్ కంపెనీ పొందగలిగింది. తులసీ దళాలకు కూడా పేటెంటు ముప్పు వచ్చి పడుతోంది. అలాగే బాస్మతీ బియ్యం. ఆ బియ్యం పేరు మార్చి కస్మతీ బియ్యం, టె క్స్మతీ బియ్యం పేరుతొ పేటెంటు హక్కులు ఇతర దేశాల కంపెనీలు పొందిన కారణంగా ఆ హక్కులు మనకు కాకుండా పోయాయి. ఈ నేపధ్యంలో, ఇంత ప్రజాదరణ పొందిన ఈ బహుళార్ధ సాధక యోగాపై పెట్టుబడిదారుల కన్ను పడకుండా వుండదు. విద్యా వైద్య రంగాలపై కార్పొరేట్ పెత్తనం తాలూకు దుష్ప్రభావాలు గమనించిన తరువాత అందరికీ  అందుబాటులో వుండే యోగా,  క్రమంగా   సామాన్యుడికి దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదంతా కొంతమందికి నిరాశావాదంలా కనిపించవచ్చు. కానీ, జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం తప్పు  కాదేమో!
ఇది సరే! అసలు దేశదేశాల్లో ఇంతటి ఆసక్తిని రగిలిస్తున్న భారతీయ యోగా గురించి కొన్ని చెప్పుకోవడం సబబుగా  ఉంటుంది.
పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితేసాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగంరెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాలప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూనన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటానుఅని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసాఅనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలుమొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీకాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుందిఅది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మటఅని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతోకర్మ యోగమురాజ యోగముభక్తి యోగముధ్యాన యోగముజ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడంమానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానముఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యముశమదమాది సాధన సంపదమోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము)రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం)అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాసఅంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించినపిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మరాజభక్తిధ్యానజ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమనియమఆసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణసమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరేమామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యంఅపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
ఉపశ్రుతి:
పాతికేళ్ళకు పూర్వం నేను పూర్వపు సోవియట్ యూనియన్  రాజధాని మాస్కోలో ఉద్యోగంచేస్తున్నరోజులవి. రష్యన్ టీవీ నేషనల్ ఛానల్ ప్రైం టైంలో నాటి కమ్యూనిష్ట్ పార్టీ అధినేత, ఆ దేశాధ్యక్షుడు అయిన  మిహాయిల్ గోర్భచెవ్ తో సమానంగా టెలివిజన్ తెరపై గంటలు గంటలు కనిపించే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి ఒక సాధారణ భారతీయుడు అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన పేరు లక్ష్మణరావు గారు. తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. భారత రాయబార కార్యాలయం నడిపే ఇండియన్ స్కూలులో యోగా టీచరు. ఆయన ప్రతి రోజూ టీవీ ద్వారా రష్యన్ పౌరులకు యోగా పాఠాలు బోధించేవారు. దీనిబట్టి భారతీయ యోగాకి  అప్పట్లోనే విదేశాల్లో వున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595    



3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఉప్పల లక్ష్మణరావుగారు కదా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - కాదండీ. ఉప్పల లక్ష్మణ రావు గారు రష్యన్ ప్రభుత్వ రాదుగా విభాగంలో పనిచేసేవారు అనుకుంటా. నేను వెళ్ళింది 1989 లో. ఈ యోగా లక్ష్మణరావు గారు పరమ నైష్టికులు. తిండి ఒక సమస్యే కాని ఆ దేశంలో మా రెండు కుటుంబాలకు అదే పెద్ద సమస్య అయి కూర్చుంది. జర్నలిష్టు నేపధ్యం కనుక నా మాట కొంత చెల్లేది. ఏదో విధంగా కాసిని కూరగాయలు ఢిల్లీ నుంచి తెప్పించేవాళ్ళం. బియ్యం దొరకవని కాదు కాని, రష్యన్ బియ్యం బాగా మొద్దు. నోటికి హితవు కాదు. అంచేత ఈ శాకాహార భోజన పదార్ధ అన్వేషణ మా ఇద్దరినీ కలిపింది. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా మంచి స్నేహితులు. అంచేత మా స్నేహం కూడా బాగా కొనసాగింది. హైదరాబాదు వచ్చిన తరువాత కూడా చాలా సార్లు ఆయన ఆయన కుటుంబం మైసూరు నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు.

అజ్ఞాత చెప్పారు...

Good article sir. But you have mixed modi topic with other topics. it is a kichidi article still good to read