8, జూన్ 2016, బుధవారం

అధికారంతో ప్రాణం విలువ పెరుగుతుందా ?


వ్యక్తుల ప్రాణాల విలువలో హెచ్చుతగ్గులు వుంటాయా? అధికారం వున్నప్పుడు  ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా  వారి  ప్రాణాల  విలువల్లో  తేడాలు వస్తాయా? అవుననే అంటున్నాయి ప్రముఖుల ప్రాణాలకు డేగ కళ్ళతో పహరా కాసే భద్రతా వర్గాలు.
ఈ వ్యాసంతో పాటు జోడించిన చిత్రం చూడండి. అందులో అనేకమంది సాయుధ అంగరక్షకుల నడుమ వున్న వ్యక్తిని గుర్తుపట్టే వుంటారు. ఎందుకంటే దేశంలోనే కాదు విదేశాల్లో  కూడా చప్పున జనం గుర్తు పట్టగల వ్యక్తి మన ప్రధాని  నరేంద్ర మోడీ.
మోడీ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పేది, మోడీని అభిమానించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు అంగీకరించేది ఒక్కటే,  మోడీ అత్యంత నిరాడంబర జీవితం గడుపుతారని. మరి ప్రధాన మంత్రి కాగానే ఈ హడావిడి ఏమిటి?
బహుశా తన చుట్టూ ఇంతటి స్థాయిలో భద్రత వుందని ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఢిల్లీ లోని ఒక సాధారణ పోలీసు జవాను చెప్పేదాకా మోడీకి కూడా ఈ విషయం తెలవదు. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక ఏడాది వెనక్కి పోవాలి.
స్వచ్చభారత్ కార్యక్రమం ప్రారంభమప్పుడు కాబోలు ప్రధాని మోడీ, ఢిల్లీలో  అపరిశుభ్రంగా వున్న ఒక పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని గమనించారు. అక్కడి పోలీసుజవానుతో నేరుగా ఆయన ఆ విషయం ప్రస్తావించారు. రోజూ కాసేపు  శ్రమ దానం చేసి, పరిసరాలను శుభ్రం చేసుకోవచ్చు కదా అన్నది మోడీ  మహాశయుల సూచన.
దానికి ఆ  పోలీసు ఇచ్చిన సమాధానంతో మోడీ గారికి తన చుట్టూ అల్లుకుకుని వున్న భద్రతావలయం గురించి తెలిసివచ్చింది.  ఇంతకీ  ఆ పోలీసు చెప్పింది ఏమిటంటే...
‘అయ్యా మీరు చెప్పేది నిజమే. కానీ, మా పోలీసు బలగాల్లో అత్యధికులకు వీ.వీ.ఐ.పీ.ల భద్రత కనిపెట్టి చూడ్డంతోనే పుణ్యకాలం సరిపోతోంది. మీరు చెప్పిన పని చేయడానికి పోలీసు స్టేషన్లలో ఎవరూ మిగలడం లేదు’
ప్రధాని తిరిగి తన కార్యాలయం చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని, తన భద్రతా ఏర్పాట్లను గురించి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించడం, భద్రతను అవసరమయిన స్థాయికి తగ్గించాలని గట్టిగా సూచించడం.

మరి ఇది జరిగిందా అంటే. తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాలేమో.          

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

అనేకమంది సాయుధ అంగరక్షకుల నడుమ వున్న వ్యక్తిని గుర్తుపట్టే వుంటారు. ఎందుకంటే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చప్పున జనం గుర్తు పట్టగల వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ.
Maaku kanabadani aa avataara moorti meeku kanabaddam aascharyamgaa undi B S Rao garu?
Aa spot kaasta mark cheyyagalaraa?

Bhandaru Srinivasrao చెప్పారు...

అజ్ఞాత : ఆ వ్యాఖ్య నాది కాదు. ఇండియా టుడే వాళ్ళు ఇంగ్లీష్ లో పెట్టింది. వాళ్ళు ఇంకా చాలా ఫోటోలు వేసారు.

Bhandaru Srinivasrao చెప్పారు...

@ అజ్ఞాత: Try this LINK:http://downloadlagump3.4ds.me/downloadvideo/FLvtM25pzOs/pm-narendra-modi-india--impenetrable-security-cover.html