ఆరోజు మంత్రి వర్గం
సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని
కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం.
విలేకరులు, అధికారులతో
సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
(కీర్తిశేషులు శ్రీ టంగుటూరి అంజయ్య)
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు.
విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం
మొయిన్ ! (మొయినుద్దీన్ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ
(కాఫీ టిఫిన్లు) అందాయా? అని
వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో
అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ
బులెటిన్ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. (ఇప్పటిమాదిరిగా ఇన్ని
టీవీలూ, టీవీ స్క్రోలింగులు లేవు. వార్త తెలుసుకోవాలంటే రోజుకు మూడుసార్లు వచ్చే
రేడియో వార్తలు కానీ, లేదా ఉదయం వెలువడే పత్రికలు కానీ ఆధారం ఆరోజుల్లో) కానీ
అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని
లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్ అవుతోందని చెప్పేసి- ఏం
చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది -
మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్ మంటూ బయటకు పరుగెత్తి -
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్ చేసి మంత్రుల రాజీనామా వార్తని
అందించాను. అందులో జరిగిన పొరబాటు ఏమిటంటే అరవై మంది మంత్రుల రాజీనామా అని
రేడియోలో చెప్పేసాం. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య అరవై. సాయంత్రం
వార్తల్లో తప్పు దిద్దుకుని చెంపలేసుకున్నాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే
తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి