(ఈరోజు హెచ్.ఎం.ఆర్.ఐ. ఆవిర్భావదినం సందర్భంగా)
కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా
నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి
స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది.
రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి ఎత్తులు పైఎత్తులకు చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది
పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె
చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. ఎందుకంటె వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక
సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు. అందుకే, ప్రచారానికి
పనికిరాని ఈ పధకం నీరుకారిపోతున్నా ఎవరికీ
పట్టలేదు.
‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ అన్నట్టు భ్రష్టుపట్టిపోతున్న ఈ పధకం గురించి తెలుసుకోవాలంటే కొంత నేపధ్యం అర్ధం
చేసుకోవాలి.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో
సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల
కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల
గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య
కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి
సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా
అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల
పైనా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో
సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే
పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో
బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె
ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా
తెలియదు.
వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం
లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా
ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో
నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.
అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా
కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్) వారు ఈసమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా
వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి
రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే
ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా
చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే-
ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య
ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని
సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం
లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు
సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో
నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి
మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన
జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్
చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి
నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు
నిర్వహిస్తారు.
నిజానికి ఇలాటి వారందరూ ప్రతినెలా పరీక్షలు చేయించుకుని మందు మోతాదులు మార్చుకుంటూ వుండాలి. బస్తీల్లో వున్నవాళ్ళే ఈ విషయాల్లో
అశ్రద్ధ చేస్తుంటారు. పల్లె ప్రజల సంగతి చెప్పేది ఏముంటుంది. కనుకే ఈ వాహనం
ప్రతినెలా ఒక నిర్దిష్ట దినం నాడు విధిగా ఆయా గ్రామాలకు వెడుతుంది. ఖచ్చితంగా
వస్తుందని తెలుసుకనుక రోగులు కూడా శ్రద్ధగా పరీక్షలు
చేయించుకుంటారు. మందులు వాడతారు. ఫలితంగా చిన్న చిన్న శారీరక రుగ్మతలు అలవికాని పెద్ద పెద్ద
రోగాలుగా మారవు. ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యం అవసరమే వుండదు. అప్పుడు వైద్య
ఆరోగ్య శాఖ – ఆరోగ్య వైద్య శాఖగా మారుతుంది.
ఇంత చక్కటి పధకం కార్య రూపం ధరించేసరికల్లా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు
ఒక్కమారుగా మారిపోయాయి. ప్రాధాన్యతలు మారాయి. రాజకీయ నిర్దేశకత్వం కొరవడడంతో
అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఈ మాత్రం దానికి స్వచ్చంద సంస్థల
ప్రమేయం యెందుకు మనమే చేస్తే పోలా అనుకున్నారు. కొందరు సిబ్బంది కూడా వారికి
సహకరించారు. ప్రభుత్వమే నిర్వహిస్తే తాము కూడా ప్రభుత్వ సిబ్బందిగా మారతామని ఆశ
పడ్డట్టున్నారు. సమ్మెలు చేశారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు మందగించింది.
ఏతావాతా జరిగిందేమిటంటే ప్రజలకు మేలు చేసే ఒక మంచి పధకం అటకెక్కింది.
అటకనుంచి దించామంటున్నారు సర్కారువారు. దించినా పధకం మొదలు పెట్టిన నాటి
చిత్తశుద్ధి యెంత మిగిలి వున్నదనేదే జవాబు దొరకని ప్రశ్న.
(08-10 - 2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి