నా గురించి శ్రీ డి. వెంకట్రామయ్య గారు
“కలిసి తిరగడం, కులాసా కాలక్షేపాలు చేయడంలో
మాత్రమే కాదు నాకు అన్నివిధాల ఆప్తమిత్రుడుగానే వుంటూ వచ్చారు భండారు
శ్రీనివాసరావు. ‘A friend in need …’ అన్న
ఆంగ్ల సూక్తి మాదిరిగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఆయన సర్వదా సిద్ధం.
హైదరాబాదులో న్యూస్ రీడర్ గా వున్న నన్ను ఢిల్లీ అధికారులు ఎవరికో సాయం
చేయాలనుకుని నన్ను అన్యాయంగా ఢిల్లీ బదిలీ చేశారు. ఇలా రెండు సార్లు జరిగింది.
రెండోసారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించడంలో ప్రధానపాత్ర శ్రీనివాసరావుదే.
(శ్రీ డి.వెంకట్రామయ్య)
అప్పట్లో కేంద్ర సమాచార శాఖ ఉప మంత్రిగా మన రాష్ట్రానికి
చెందిన మల్లికార్జున్ వుండేవారు. కాంగ్రెస్ ఎం ఎల్ ఏ డీ కే సమరసింహారెడ్డి మాట సాయంతో నేనూ శ్రీనివాసరావు
కలిసి ఢిల్లీ వెళ్ళి వారం రోజులు అక్కడ వున్నాం. మంత్రి మల్లికార్జున్ నీ, ఇతర అధికారులను
కలిసి శాయంగల విన్నపాలు చేసాము. నెలలు గడిచిపోయాయి కాని పని కాలేదు. అలాటి తరుణంలో
శ్రీనివాసరావు మల్లికార్జున్ గారిని కలిసి నా సమస్య మళ్ళీ చెప్పారు. చివరిసారి
వెళ్ళినప్పుడు మంత్రితో చివాట్లు కూడా తిన్నారు. ‘ఎందుకిలా మాటిమాటికీ వచ్చి
డిస్టర్బ్ చేస్తావ్.. నువ్వేమైనా అయన ఏజెంటువా ....’అన్న ధోరణిలో ఆగ్రహం వెలిబుచ్చారట.
(ఇక్కడ వో విషయం వివరించాలి. అసలు జరిగినదేమంటే మంత్రిగారికి నా మీద కోపం వచ్చిన
మాట నిజం. ఇలా విసిగించావంటే సస్పెండ్ చేస్తా అన్న మాట కూడా వాడారు. అయితే అప్పుడు
నేను చెప్పిన జవాబు ఆయన్ని కదిలించింది. నన్ను సస్పెండ్ చేస్తే చేయండి.
వెంకట్రామయ్య గారికి మాత్రం న్యాయం చేయండి అనేశాను. అంతకుముందు విలేకరిగా పరిచయం
బాగా వున్నవాడినే కావడంతో ఆయన కూడా ఏమీ అనలేకపోయారు. మొత్తం మీద కధ సుఖాంతం
అయింది. వెంకట్రామయ్య గారి బదిలీ రద్దయింది.)”
(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య,
‘రచన’ అక్టోబర్, 2013 సంచిక
నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి