6, అక్టోబర్ 2013, ఆదివారం

నా గురించి నలుగురూ - 5 (ఆఖరి భాగం)

నా గురించి డి.వెంకట్రామయ్య గారు - 5
“నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు (ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ వద్ద ప్రెస్ సెక్రెటరీగా వున్న మల్లాది కృష్ణానంద్ అన్నగారు) నన్ను పిలిచి ‘ మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య  రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’  నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. అవేళలో అంత  త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పండుకున్నాను.
“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని  వచ్చారు. నేను చెప్పేది  వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’  అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.
మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో – ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని  ఏదో  చెప్పబోతుంటే ఆయన తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.
నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.
ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”
(అయిపోయింది)


(శ్రీ డి.వెంకట్రామయ్య వీడ్కోలు సభ)


(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

కామెంట్‌లు లేవు: