నా బ్లాగులో రాసేవాటిని చదివే పాఠకులు చాలామంది
మీరు యెందుకు పత్రికల్లో రాయరు? అని ఈ మెయిల్స్ పంపుతుంటారు. దానికి కారణం నా
వయస్సే. ఓ పదేళ్లు పెద్దవాడిని అయినా లేదా ఓ పదేళ్లు చిన్నవాడిని అయినా నాకు ఈ
సమస్య వచ్చి వుండేది కాదేమో. ఈనాడు పత్రికలకు ఎడిటర్లుగా వుంటున్నవారు చాలామంది
నాకన్నా ‘వయస్సులో’ చిన్నవాళ్ళు. అలా అని మరీ చిన్నవాళ్ళేమీ కాదు. అంచేత రాయమని
వాళ్లు నన్ను అడగలేరు. రాస్తానని నేను వాళ్ళతో చెప్పలేను. జర్నలిష్టులనే వాళ్లకి
ఏమున్నా లేకపోయినా ఈ ‘గోరోజనానికి’ మాత్రం ఏం తక్కువ వుండదు. ప్రత్యేకించి నాలాటి
వాళ్లకు. కొన్నాళ్ళు ఓ దినపత్రిక వాళ్లు వారం వారం వెంటబడి మరీ అడిగి రాయించుకున్నారు.
రాయడం తప్ప ‘ఇచ్చిపుచ్చుకునే’ వొప్పందం ఏమీ లేదు. పైగా రాసిన దానికి ఇంత అని లెక్క
కట్టి టీసుకుంటే ఆ రచనకు విలువ అంతటితో సరి – అమరావతి లింగం మీద మేకు కొట్టినట్టే –
అని నమ్మేవాడిని నేను. కొన్నాళ్ళు బాగానే
నడిచింది. ఓసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసిన ఓ వ్యాఖ్య వారి యజమానికి నచ్చలేదు. ‘అందువల్ల
వేయడం లేదు’ అని ఫోను చేసి మరీ చెప్పారు. ‘అంచేతే
నేనూ ఇకనుంచి మీకు రాయను గాక రాయను’ అని చెప్పేశాను. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా
నా పాలసీ అదే. దాంతో వాళ్లు కూడా అడగడం మానుకున్నారు. నిజానికి మార్కెట్లో రాసేవాళ్ళ
కొరత ఏమీ లేదు కదా!
పోతే ఈ ఉపోద్ఘాతానికి కారణం లేకపోలేదు. మీ అందరి
అభిమానం వల్ల నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటికి రెండు లక్షలు దాటింది. పత్రికలమీద
ఆధారపడే పనేవుంది చెప్పండి.
నిజంగా నేనిప్పుడు అక్షరాలా ‘లక్షాధికారి’ని.’ నన్ను ఇలా ఇన్ని లక్షలకు అధిపతిని చేసిన అందరికీ మరోమారు మనః
పూర్వక కృతజ్ఞతలు.
భండారు శ్రీనివాసరావు
(28-10-2013)
