15, జూన్ 2019, శనివారం

చంద్రబాబుకు ఊరట కలిగించే జగన్ నిర్ణయం

(Published in SURYA daily on 16-06-2019, SUNDAY)

‘ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అని అనుకుంటున్నారు?’
మొన్నీమధ్య ఓ టీవీ చర్చలో యాంకర్ సంధించిన ప్రశ్న.
‘కోరుకునేది చెప్పమంటారా! జరిగేది  చెప్పమంటారా!’
‘రెండూ చెప్పండి’
‘సభ సజావుగా జరగాలన్నది నా ఒక్కడిదే కాదు, ప్రజలందరి ఆకాంక్ష. కానీ ఇప్పటి రాజకీయాల తీరుతెన్నులు చూస్తుంటే కోరుకునేవి జరిగే అవకాశాలు తక్కువ.  ఇంతకాలం ఎలా జరుగుతూ వచ్చాయో అలాగే జరుగుతాయి. ఇది నా అంచనా మాత్రమే. మొదటిది జరిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ రెండోదే జరిగి తీరుతుంది. రాజకీయాలదే పైచేయి అనే కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి’
తధాస్తు దేవతలు వుంటారంటారు. అలాగే జరిగింది.
ఆరోజు ఏదో మాటవరసకు చెప్పినా అలాగే మొదలయింది అసెంబ్లీ.
రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగిననాడు ఇది స్పుటంగా కానవచ్చింది, మొదటి ముద్దలోనే ఈగ పడింది అనే సామెతను గుర్తు చేస్తూ.
రెండే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నచోట రాజకీయాలు మరోలామరోలా  సాగవు. సంఖ్యాపరంగా బలహీన స్తితిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూడా గత ఎన్నికల్లో సగటున సుమారు నలభయ్ శాతం వోట్లు వచ్చాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అయినా రెండు పార్టీల నడుమా పదకొండు శాతం ఓట్ల తేడా వుంది. ఇక సీట్ల సంఖ్యతో పోలిస్తే వైసీపీ స్థానం శిఖరాయమానంగా వుంది. మొత్తం 175 సీట్లలో వారివే 151. టీడీపీకి వచ్చినవి కేవలం 23 సీట్లు మాత్రమే. మరో ప్రాంతీయ పార్టీ జనసేన ఒకే ఒక స్థానం గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టగలిగింది. ఆ మాత్రం అవకాశం కూడా జాతీయ పార్టీలు కాంగ్రెస్ , బీజేపీలకు, ఇతర వామపక్షాలకు ఏపీ ఓటర్లు ఇవ్వలేదు.
గత అసెంబ్లీలో పాలక పక్షం చేతిలో పడిన అగచాట్లో, పొందిన అవమానాలో కారణం ఏదైనా టీడీపీ మీద ఇన్నేళ్ళుగా పెంచుకున్న ఆగ్రహానికి  బదులు తీర్చుకోవడానికి సంఖ్యాబలం రూపంలో  వైసీపీకి చక్కని అవకాశం దొరికింది. అందుకే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం ఆ పార్టీ వారికి ఇష్టం లేనట్టుంది. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ  కాగానే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం. కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాంని అభినందిస్తూ చేసిన ప్రసంగంలో, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబుకు చురుక్కుమనిపించేలా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“గత శాసన సభలో ఒక సభానాయకుడు, ఒక స్పీకర్ ఎలా ఉండకూడదో చూశాం.  ఎలా ఉండాలో ఇప్పుడు  చూపిస్తాం’ అన్నారు జగన్. సంతోషించదగ్గ మాట. ఇలాంటి మార్పు నిజంగా ఆచరణలో చూపిస్తే ముందుగా  సంతోషించేవాళ్ళు ప్రజాస్వామ్య ప్రియులే.  
వివాదాస్పద అంశాలు ప్రస్తావించకూడని సందర్భం అయినా  జగన్ మోహన రెడ్డి కొన్ని గతకాలపు విషయాలను పేర్కొన్నారు. ఒక రకంగా ఈ అంశాలు స్పీకర్ కు సంబంధించినవే కావడం వల్ల ఆయన తెలివిగా వీటి ప్రస్తావనకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది.
‘మా పార్టీ గుర్తుపై ఎన్నికయిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను, సంతలో పశువుల మాదిరిగా నాటి పాలక పక్షం టీడీపీ కొనుగోలు చేసింది. పిర్యాదు చేసినా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు. చర్యలు తీసుకోలేదు. పైగా వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా  కట్టబెట్టారు. అలాంటి అప్రజాస్వామిక వ్యవహారాలు మా హయాంలో చూడబోరు. టీడీపీ నుంచి గెలిచిన  వాళ్ళలో కొంతమందిని తీసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదని మావాళ్ళు నాతో అన్నారు. అలా చేస్తే  నాకూ, బాబుకూ తేడా లేకుండా పోతుందని జవాబు చెప్పా. పార్టీ మారేవారు ఎవరైనా సరే, ముందు రాజీనామా చేసి తీరాలి. లేకపోతే స్పీకర్ వారిపై అనర్హత వేటు వెయ్యాలి’ అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు.
సందర్భోచిత పలుకులైనా సభలో ఉన్న ప్రతిపక్షనేతకు ఇవి ములుకుల మాదిరిగా తగిలి వుంటాయి. అందుకే కాబోలు సభానాయకుడి ప్రసంగం తరవాత మైకు తీసుకున్న చంద్రబాబు కూడా అదే రీతిలో జవాబు చెప్పే ప్రయత్నం చేసారు. మైకు సరిగా  పనిచేయక పోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. గొంతు పెగలడం లేదంటూ ఓ పక్క  పాలక పక్షం సభ్యుల నుంచి వెలువడిన వ్యాఖ్యలకు ఆయన దాన్ని ఉపయోగించుకున్నారు. ‘మా హయాంలో పనిచేసిన మైకులు ఇప్పుడు పనిచేయడం లేదు. నా స్వరం తగ్గదు, నా పోరాటం ఆగదు’ అంటూ ధీటుగానే జవాబు ఇచ్చారు. కానీ నిజానికి కొత్త  శాసన సభ భవన నిర్మాణం, అందులో  మైకుల అమరిక ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగినవే.
స్పీకర్ గా తమ్మినేని ఎంపిక సరైనదే అని చెబుతూనే, ఈ విషయంలో తమను సంప్రదించలేదని, సంఖ్యాబలాన్ని చూసుకుని వైసీపీ సంప్రదాయాలను పక్కన పెడుతోందనే వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఈ ఆరోపణతో  సహజంగానే సంభాషణలు పక్కదోవ పట్టాయి. ఇరుపక్షాలు గతాలను నెమరు వేసుకుంటూ ఎదుటి పక్షం వాదనను పూర్వపక్షం చేసే పనిలో పడ్డాయి.  ఆ విధంగా సభ జరిగే తీరు రక్తి కడుతోందని ఆ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నవాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేలోగా, రామాయణంలో పెడకల వేట మాదిరిగా వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి నుంచి వెలువడిన  ‘బంట్రోతు’  ప్రస్తావన మొత్తం వ్యవహారాన్ని  పూర్తి మలుపు తిప్పింది. మళ్ళీ  గతంలో అసెంబ్లీ సాగిన తీరే పునరావృతం అవుతున్నదేమో అనే  భావనను  కలిగించాయి.
కొత్తగా ఎన్నికయిన స్పీకర్ ను సభానాయకుడు (ముఖ్యమంత్రి), ప్రతిపక్షనాయకుడు, సభలోని ఇతర పార్టీల నాయకులు వెంటబెట్టుకుని వెళ్లి ఆయనను స్పీకర్ స్థానంలో అసీనుడిని చేయడం సాంప్రదాయం. ఇందుకు అనుగుణంగా ప్రోటెం స్పీకర్ అయిన నాయుడు ఒక సూచన చేసారు. ‘సభానాయకుడు, ఇతర పార్టీల నాయకులు నూతన స్పీకర్ తమ్మినేని సీతారాం ను సభాధ్యక్ష స్థానం వద్దకు తీసుకువెళ్లాల్సిందని కోరారు. దరిమిలా ముఖ్యమంత్రి, సభానాయకుడు అయిన జగన్ మోహన రెడ్డి, జన సేన ఏకైక సభ్యుడు వరప్రసాద్ స్పీకర్ వెంట నడిచారు. తన పేరు పెట్టి పిలవకుండా క్లుప్తంగా ఇతర పార్టీల నాయకులు అని అన్నందుకు నొచ్చుకున్నారేమో తెలవదు, టీడీపీ తరపున చంద్రబాబు ఆ పనికి మరో సీనియర్ సభ్యుడు అచ్చెంనాయుడిని నియోగించారు. నిజానికి ప్రోటెం స్పీకర్ చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి ఆహ్వానించినా, లేదా చంద్రబాబే హుందాగా  సాంప్రదాయానికి అనుగుణంగా కొత్త స్పీకర్ వెంట నడిచి వెళ్ళినా ఈ అంశం అంతటితో ముగిసిపోయి వుండేది. కానీ అలా జరగలేదు.
అచ్చెంనాయుడిని ఉద్దేశించి చెవిరెడ్డి భాస్కర రెడ్డి బంట్రోతు అనడం సభలో ప్రకంపనలు సృష్టించింది. చెవిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు. రికార్డులు చూసి అభ్యంతర వ్యాఖ్య చేసినట్టు అనిపిస్తే ఆ పదాన్ని తొలగిస్తానని స్పీకర్ తమ్మినేని ప్రకటించడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది.
స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందిస్తూ చేసిన ప్రసంగాలలో వైసీపీ సభ్యులు చాలామంది, ముఖ్యంగా గత శాసన సభలో టీడీపీ పక్షం నుంచి తీవ్రమైన అవహేళనలు, అవమానాలు ఎదుర్కున్న రోజా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని  గతాన్ని నెమరు వేసుకుంటూ అలనాడు టీడీపీ అప్రజాస్వామికంగా ఎలా  వ్యవహరించిందీ సోదాహరణంగా వివరించారు. సహజంగా ఇవన్నీ ప్రతిపక్ష టీడీపీకి మింగుడు పడని విషయాలే.
స్పీకర్ తమ్మినేని సీతారాం జావాబు ఇస్తూ సభానిర్వహణ సజావుగా నిర్వహించడానికి పాలక, ప్రతిపక్షాలు తనకు సహకరించాలని కోరారు. ఎందరో మహానుభావులు అలంకరించిన స్పీకర్ స్థానం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, వారు నెలకొల్పిన సత్సంప్రదాయాల మార్గంలోనే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. మంచి వక్తగా పేరున్న సీతారాం ఒక చక్కటి ప్రసంగం చేసి అందరి మన్ననలను చూరగొన్నారు. అయితే బంట్రోతు వంటి ఆక్షేపనీయ పదాన్ని ఒక సభ్యుడు వాడినప్పుడు, రికార్డుల పరిశీలనతో  నిమిత్తం లేకుండా అక్కడిక్కక్కడే ఆ పదాన్ని  తొలగిస్తున్నట్టు ప్రకటించి ఉన్నట్టయితే నిష్పాక్షికంగా వ్యవహరిస్తానని  సభకు ఇచ్చిన  మాటను నిలబెట్టుకున్నట్టు అయ్యేది.
ఏదిఏమైనా, ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి చేసిన ప్రకటన, సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్న  ప్రతిపక్ష నాయకుడికి కొంత ఊరట కలిగించి వుండాలి. పార్టీ ఫిరాయింపులని ఎటువంటి పరిస్తితుల్లోను ప్రోత్సహించేది లేదని ముఖ్యమంత్రి  నిక్కచ్చిగా తెగేసి  చెప్పడం చంద్రబాబుకి ఉపశమనం కలిగిస్తే, ప్రజాస్వామ్య ప్రియులకు ఆనందం కలిగించింది అనడంలో సందేహం లేదు. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజలే  ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థకు చీడపురుగులా తయారైన పార్టీ మార్పిళ్ల దురాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలబడి, ఒకే గొంతుతో తిరస్కరిస్తే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పటిష్టం అవుతుంది.

కామెంట్‌లు లేవు: