శంకరాభరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శంకరాభరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మే 2017, ఆదివారం

సినిమాహాలు కాదది, దేవాలయం

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు (07-05-2017) ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం  అంటే ఇదే కాబోలు”

చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు. 


(శ్రీ విశ్వనాద్ తో)
  

      

26, ఏప్రిల్ 2017, బుధవారం

మరుగున పడిన ‘మణిరత్నం’


కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. జర్నలిష్టు మిత్రుడు దివాకర్  కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...
ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో  శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాద్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్  కెమెరామన్  గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్  లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు. కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా శుభోదయం అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్  గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు.  తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.  
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.

అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.        

18, సెప్టెంబర్ 2010, శనివారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

ఏనుగు శీర్షాసనం వేయడం ఎప్పుడయినా చూసారా!

ఆయనతో పరిచయం ఎలాజరిగిందో గుర్తురావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా , స్తూల కాయానికి ఎక్కువగా వుండేవారు. పేరుమాత్రం కురచగా ప్రసాద్. వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువే. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ విషయాలు ఆయనకు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ సూత్రాలు ఆయనకు కరతలామలకం. భారత, భాగవత, రామాయణ గ్రంధాలన్నీ ఆపోసన పట్టిన వ్యక్తి. అష్టాదశపురాణాల్లో ఏ అంశంపైన అయినా తడుముకోకుండా తర్కించగలిగిన సామర్ధ్యం ఆయన సొంతం. సూర్యోదయం కాకముందే నిద్రలేచి, నిష్టగా అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని, ఇంటినుంచి బయటపడడం తరువాయి, ఆయన జీవన శైలి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.

ఎమర్జెన్సీ తరవాత జనతా సర్కారు ఇందిరాగాంధీపై పెట్టిన కేసుల్లో ఆమె తరపున వాదించిన లాయర్లలో తానొకడినని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. జ్వాలానరసింహారావుతో కలసి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అందుకు దాఖలా అన్నట్టుగా అనేకమంది పెద్దలను పరిచయం చేసారు. పలువురితో అంతంత పరిచయాలు వున్న ఈ వ్యక్తి హైదరాబాదులో మాత్రం స్కూటరుపై తిరిగేవాడు. మాకు స్కూటరు కూడా లేకపోవడంవల్ల అప్పుడు మాకది సందేహించాల్సిన అంశంగా అనిపించేది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరుపై మా ఇంటికి వస్తుంటే, మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.

ఎక్కడ తిరుగుతున్నా త్రికాల సంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఒకరోజు న్యూఢిల్లీ లో కుతుబ్ మినార్ చూసివస్తూ, సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి, దారిపక్కన నీటి చెలమ వున్నచోట కారు ఆపించి, సంధ్యావందనం చేసివస్తుంటే, మాతో పాటు టాక్సీ డ్రయివర్ కూడా ఆశ్చర్యపోయాడు. జనాలని ఆకర్షించడం కోసం ఆయన అలా చేస్తున్నారేమోనన్న అనుమానం కలగకపోలేదు. కానీ పైకి వ్యక్తం చేసేంత చనువు లేక మిన్నకుండి పోయేవాళ్ళం.

అల్లా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని బుక్ స్టాల్లో పుస్తకాలు చూస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ నియమం వుండేది. ఎంతమందిలోవున్నా సరే -  తెలుగులోనే మాట్లాడుకోవాలని.

అది కలసి వచ్చింది. ఒకాయన మా వైపు తిరిగి తెలుగువాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి “మీరు శ్రీనివాసరావు కదూ!” అన్నారు. ఆయన ఎవరో కాదు విజయవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాం చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్. అప్పటికే బాగా పేరుతెచ్చుకున్న సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల. చదువుకునే రోజుల్లో పేరు జె వి డి ఎస్ శాస్త్రి.

అందరం కలసి ఆ హోటల్లోనే వున్న జంధ్యాల రూముకి వెళ్ళాము. వెళ్లీవెళ్ళగానే, మాతోవచ్చిన లాయరు గారు ఏమాత్రం మొహమాటపడకుండా, కొత్త చోటని సందేహించకుండా “ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా “ అని అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే, అక్కడవున్న తివాసీపై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్తమాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగినంత పనయింది. చిన్న తలతో, పెద్ద బొజ్జతో అంత లావు శరీరంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెరపోయినట్టు కనిపించారు. తర్వాత వారిద్దరిమధ్య చాలా సేపు కవి పండిత చర్చ సాగింది. అప్పటికే శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల - విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ వారిద్దరి నడుమ సాగిన సంభాషణ నిజానికి ఇద్దరు  పండిత శ్రేష్టులమధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకరినిమించి మరొకరు అక్షరలక్షలుచేసే విద్యను అమోఘంగా ప్రదర్శించారు.ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిల్లో కొన్నింటిని సప్తపదిలో జంధ్యాల పొందుపరిచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరుచూస్తున్న నాకు - చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒక్కరేనా అన్న అనుమానం కలిగింది. ఆ రోజుల్లో - మొత్తం కాలేజీకి ఆయనొక్కడే ‘కారున్న’ కుర్రకారు. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలోవస్తుంటే, జంధ్యాల మాత్రం కారులో కాలేజీకి వచ్చేవాడు. ’సంధ్యారాగంలో శంఖారావం’ వంటి నాటకాలు రాస్తూ, వేస్తూ సరదాగా వుండేవాడు. అలాటి జంధ్యాలలోని మరో రూపాన్ని ఆరోజు చూడగలిగాను. అల్లాగే మావెంట వచ్చిన లాయరుగారు. ఆయనకువున్న విషయ పరిజ్ఞానాన్నికళ్ళారా చూసి, చెవులారా విన్నతరవాత, ఆయనపై నాకున్న దురభిప్రాయం దూదిపింజలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పిన అన్న సూక్తి బోధపడింది. మనం చెప్పిందే ఇతరులు వినాలనే ఆత్రంలో యెంత నష్టపోతున్నామో అర్ధం కావాలంటే యిలాటి సజ్జన సాంగత్యం ఎంతో అవసరం.

ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. (18-09-2010)