9, ఏప్రిల్ 2017, ఆదివారం

దుర్బలస్య బలం రాజ....

సాధారణంగా టీవీ చర్చల్లో వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవడం నాకు అలవాటు. ఈరోజు టీవీ- 5, చర్చలో చాణక్యుడు, కృష్ణ దేవరాయల ప్రసక్తి వస్తే, అచ్చం ఇలాగే కాదు కాని మొత్తం మీద నేను చెప్పిన మాటలు ఇవి. పొద్దుటి కార్యక్రమం గురించి ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయనగరం జిల్లానుంచి ఫోను చేసి బాగుందని అన్నప్పుడు ఆ విషయాలు నలుగురితో పంచుకోవాలని ఈ పోస్టు. అంతే!
‘దుర్బలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని కొన్ని పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే, ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!
‘ఎవరి పాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా అంటే సందేహమే.
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా ఆయన సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

>>ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు


ఆ పేరుతో పూజారులు బాగానే కోట్లకు పడగలెత్తారులెండి

అజ్ఞాత చెప్పారు...

ఉత్తరాది వారు చాలా తెలివిగా హత్యలు చేస్తారు సుమా.. ఉగ్రవాది అల్లా పేరుతో. వాళ్ళు ఆవు పేరుతో. రిఫరెన్సు కావలంటే పురాణాలు తీసుకో. మన పక్కనే ఉన్న ఒక్క సుగ్రీవుడు, విభీషణుడు చాలు. ఒక జాతి మొత్తం అంతరించిపోవడానికి. రాముడికి రాజ్యం ఒచ్చింది. ఇక వాళ్ళు చరిత్రలోనే లేకుండా పొయారు