ఫోటోలో కుర్చీలో కూర్చున్నది ఎవరన్నది
తెలంగాణాలో, ఆమాటకి వస్తే హోల్ మొత్తం రెండు
తెలుగు రాష్ట్రాల్లో ఎవరయినా చెప్పేస్తారు, కే.వీ.రమణ అనో, రమణాచారి అనో.
జగమెరిగిన మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి ఆయన. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక
సలహాదారు.
అది సరే ఆయన ఎవరన్నది అందరికీ తెలుసు.
మరి అక్కడ ఆ కుర్చీలో కూర్చుని టిక్కెట్లు అమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆ సంగతి
ఏమిటి?
ఈ ఐఏఎస్ రమణ గారికి నాటకాలు అంటే
ప్రాణం. ఆ నాటక రంగాన్ని కాపాడుకోవడం ఎలా అన్నది ఆయన్ని అహరహం వేధించే సమస్య. ఐఏస్
కనుక పరిష్కారం కూడా ఆయనే కనుక్కున్నారు. టిక్కెట్టు పెట్టి నాటకం వెయ్యాలి. జనం
టిక్కెట్లు కొనుక్కుని ఆ నాటకం చూడాలి. నాటకాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఊరికే వేస్తె
చూసేవాళ్ళూ వున్నారు. కానీ టిక్కెట్లు కొనుక్కుని చూసేవాళ్ళు వున్నారా? మిలియన్
డాలర్ల ప్రశ్న.
కానీ ఈ రమణ ప్రశ్నలు చూసి బెదిరిపోయే
రకం కాదు. అంచేతే ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ప్రతినెలా ఒక నాటకం వరసగా రెండు
రోజులపాటు వేస్తారు. పది రూపాయలు టిక్కెట్టు. ఒకే ఒక టిక్కెట్టు అమ్ముడుపోయినా
సరే, నాటకం ఆడేస్తారు. హాలు ఖర్చే దాదాపు పాతిక వేలు. అయినా సరే నాటకం వేసి
తీరాల్సిందే. ఇదే ఇరవై నాలుగేళ్ళుగా ఆయన సాగిస్తున్న మహా యజ్ఞం.
అంటే ఈ యాగానికి తొందరలోనే రజతోత్సవం
అన్నమాట! నిజానికి యెంత గొప్పమాట.
జ్వాలా నరసింహారావుతో కలిసి నిన్న హైదారాబాదు,
త్యాగరాయ గానసభకు వెళ్ళినప్పుడు కనిపించిన
దృశ్యాలు ఇవి.
అంతేనా అంటే ఇంతే కాదు. ఇంకో కొసమెరుపు
వుంది.
నేను రమణాచారి గారితో మాట్లాడుతుండగానే
ఒకాయన అక్కడికి వచ్చాడు. మా సంభాషణ విన్నాడు. ఆయన పేరు తలుపుల వెంకటేశ్వరరావు వూరు
పెద్ద కళ్ళేపల్లి.
‘అయ్యా రమణగారూ, ఈ యాగంలో నెలలో ఒకరోజు
ఖర్చు నాది, కాదనకండి’
ఇలాంటి కళా పోషకులు ఉన్నంత వరకు కళకు
మరణం లేదు.
1 కామెంట్:
ఇటువంటి వాళ్ళని గురించి తెలుసుకొన్నప్పుడు, శంకరభరణంలో జంధ్యాల గారి (శంకరశాస్త్రి) వాక్యం గుర్తొస్తుంది. ఎందరో మహానుభావులు కళకోసం ఇంకా స్వార్థరహితంగా తపించటం అద్భుతమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి