2, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (188) : భండారు శ్రీనివాసరావు

 నదీనాం సాగరో గతి

జులై నాలుగు.
అమెరికా స్వాతంత్ర దినోత్సవం. అతి పెద్ద పండుగ. ప్రధానమైన వేడుక జరిగేది దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ లో అయినా, దేశంలోని అన్ని రిపబ్లిక్ లలో కన్నుల పండుగగా ఈ సంబరం జరుపుకుంటారు.
తీరిక సమయాల్లో మీరేం చేస్తారు అని ఏ అమెరికన్ ని అయినా వచ్చే జవాబు ఒకటే అని నాకనిపిస్తుంది. తీరిక సమయంలో కాదు, తీరిక చేసుకుని మరీ తిరుగుతుంటామనేది వారి సమాధానం. శుక్రవారం సాయంత్రం నుంచి కార్లలో బయలుదేరి ఏదో ఒక పర్యాటక ప్రాంతంలో కాలక్షేపం చేసి మళ్ళీ సోమవారం పని వేళలకు ఇళ్లకు చేరుకుంటారు కాబోలు అనిపించేలా దేశంలోని ప్రధాన రహదారులన్నీ కార్లతో బారులు తీరతాయి. సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాలు అయితే, చిన్నదో పెద్దదో ఒక మోటారు బోటును తమ కారుకు తగిలించుకుని వారాంతాలు సముద్రయానాల్లోనో, ఫారెస్ట్ క్యాంపుల్లోనో గడుపుతారు. ఆ సమయంలో వాళ్లకు వయసు గుర్తుకు రాదు.
నాలుగో తేదీ అమెరికన్ ఇండిపెండెన్స్ డే కారణంగా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నాలుగు రోజులు పోర్ట్ లాండ్ లో గడపాలని సందీప్ తలపెట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చాలా రోజులు ముందుగానే చేశాడు. ఒక స్నేహితుడి కుటుంబం కూడా జాయిన్ అవుతుంది కాబట్టి అన్ని వసతులు వున్నఒక పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ బస అయిదు పగళ్ళు, నాలుగు రాత్రులు. రేపు మూడో తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి పోర్ట్ లాండ్ ప్రయాణం.
గతంలో ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు ఆ ఏడాది మా పెళ్లి రోజును పురస్కరించుకుని పసిఫిక్ సముద్రపు ఒడ్డున డిపో బే అనే టూరిస్టు పట్టణంలో ఇలాగే మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు గడిపేలా చేసిన ఏర్పాట్లు గుర్తుకు వచ్చాయి. ఆ ప్రయాణంలోనే మేము అనేక వింతలు చూశాము.
పసిఫిక్ సముద్ర తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారి వెంట కారులో వెడుతుంటే ఎత్తైన చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు దోవపొడుగునా కానవస్తూనే వుంటుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ నుంచి ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు చేరడానికి ఆరేడు గంటలు పట్టింది.
మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టు కింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము. డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల, కార్లో వున్న జీ పీ ఎస్ సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము.(అప్పటికి ఈ టెక్నాలజీ కొత్త) మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని ఇంటి ముందువున్న ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.
మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది. పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్, అతి పెద్ద ప్లాస్మా టీవీ, ఫైర్ ప్లేస్, సోఫాలు వున్నాయి. పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి.
స్నానపానాదులు ముగించుకుని, డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ, అతి దగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.
పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హఠాత్తుగా విరుచుకు పడే ప్రమాదం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.
ప్రతిచోట ఏదో ఒక ప్రత్యేక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలా వుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్ ఆక్వేరియం చూసాము.
షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.
జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు.
అతి చిన్న నది
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తే అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు కేవలం 440 అడుగులు. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే, ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కలుస్తున్న చోట కాలు పెడితే, గడ్డ కట్టేంత చల్లగా వుంటాయి.
సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ, సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు. మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.
అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది ఆ వింతను చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో ఇసుకతో పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్ రోడ్డు ఎక్కాము.
కింది ఫోటోలు: (పదిహేను ఏళ్ల నాటివి)
పసిఫిక్ సముద్ర తీరంలో విహార యాత్ర.














(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: