14, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (194 ) : భండారు శ్రీనివాసరావు

 

అమెరికాలో నారదుడు
వాషింగ్టన్ స్టేట్ లో సియాటిల్ కు దగ్గరలో వున్న మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్లాం. నగరంలో అనేక ప్రాంతాల నుంచి ఈ అగ్నిపర్వతం కనిపిస్తూనే వుంటుంది.
మధ్య దారిలో, కొండ సానువుల్లో ‘నారద జలపాతాన్ని’ మా కుమారుడు చూపించాడు. ‘నారద ఫాల్స్’ అని రాసి వున్న ఆ ప్రాంతంలో ఒక కొండపై నుంచి ఈ జలపాతం ధారలుగా దుముకుతోంది. 180 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ వున్నాయి. వెస్ట్రన్ వాహింగ్టన్ థియోసాఫికల్ సొసైటీ వారు ఈ జలపాతానికి హిందువుల దేవగురువైన నారదుడి పేరు పెట్టారని అంటారు. నారద మహర్షి త్రిలోక సంచారి. కాబట్టి అమెరికాలో కూడా అడుగుపెట్టాడేమో తెలియదు.
నారదుడు అంటే చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంగతి గుర్తుకువచ్చింది. హైదరాబాదులోని సమాచార భారతి సంస్థవారు ఒక ఏడాది నారద జయంతిని పత్రికాదినోత్సవంగా పాటించి కొందరు పాత్రికేయులను సత్కరించాలని సంకల్పించారు.
తగవులమారి అనే పేరు పడ్డప్పటికీ నిజానికి నారదుడు శాంతి కాముకుడు. ఆ మహర్షి ఎవరి నడుమ తంపులు పెట్టినా అది లోక కళ్యాణం కోసమే అని పురాణాలు చెబుతున్నాయి. నారడుడి మాదిరిగానే
విలేకరులు కూడా నిత్య సంచారులే. కాబట్టి జర్నలిష్టులను సన్మానించాలనే ఆలోచన ఆ సంస్థ వారు చేసి ఉండవచ్చు.
ఆనాటి పురస్కార గ్రహీతల్లో ఒకనాటి నా రేడియో సహోద్యోగి సుప్రశాంతి కూడా వుండడం వల్ల నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లాను. నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు కూడా వచ్చారు. పూర్వాశ్రమంలో నా మిత్ర బృందంలోని విలేకరులు అనేకమంది అక్కడ కలిసారు. హాయిగా ఒక పూట గడిచిపోయింది.
పొతే, సుప్రశాంతి గురించి ఒక మాట.
సర్కారు ఉద్యోగం, అందులో సెంట్రల్ గవర్నమెంట్, అందులోను ఆలిండియా రేడియో రిపోర్టర్, వీటిని మించి సొంత ప్రాంతంలో పోస్టింగు, ఇన్ని కలిసివస్తే, నాలాగా కాలర్ తో పాటు తల కూడా ఎగరేస్తూ వుండాలి. అదేం చిత్రమో తలవంచుకుని పనిచేయడం తప్ప పాపం ఆ అమ్మాయికి వేరే పని తెలియదు.
బహుశా, వృత్తి పట్ల సుప్రశాంతికి వున్న ఈ అంకితభావమే ఆమెను ఉత్తమ జర్నలిష్టు అవార్డుకు ఎంపిక చేయడంలో దోహదపడి వుంటుంది. ప్రభుత్వం కూడా గుర్తించి ప్రమోషన్ తో మీద హైదరాబాదు దూరదర్సన్ కు బదిలీ చేసింది. అక్కడా సుప్రశాంతి పనితీరులో మార్పు లేదు. నేను పనిచేసే రోజుల్లో చుట్టూ హడావిడి. ఆమె పనిచేసే చోట ఆమె పేరుకు తగ్గట్టే ప్రశాంత వాతావరణం.
డిసెప్షన్ ఫాల్స్
సియాటిల్ కు తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.
కింది ఫోటోలు :
అమెరికాలో నారద జలపాతం
నేను ఒకప్పుడు పనిచేసిన హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం సహచర బృందం. ఈ గ్రూపులో కుడి నుండి మూడో ఆవిడే ఉత్తమ మహిళా జర్నలిష్టు సుప్రశాంతి. ప్రముఖ కధా రచయిత, న్యూస్ రీడర్, కీర్తిశేషులు డి.వెంకట్రామయ్య గారు కూడా నా పక్కన వున్నారు.
డిసెప్షన్ ఫాల్స్.

















(ఇంకా వుంది )

కామెంట్‌లు లేవు: