5, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (189) : భండారు శ్రీనివాసరావు

 

2025 జులై మూడో తేదీ మధ్యాన్నం భోజనాలు చేసి రోడ్డు ఎక్కాము. సియాటిల్ నుంచి పోర్ట్ లాండ్ 280 కిలోమీటర్లు. అక్కడ కొన్ని రోజుల బస. మళ్ళీ అవే విశాలమైన రోడ్లు. రోడ్లకు ఇరువైపులా అవే పొడవాటి చెట్లు. ఎన్ని మైళ్ళు వెళ్ళినా గోధుమరంగు తివాచీలు పరచినట్టుగా అవే మైదానాలు. ఒక మిత్రుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. సరదాకే అనుకోండి. ఒకాయన అమెరికా వచ్చి నెల తిరక్కముందే ఇంటిదారి పట్టాడట. కారణం అడిగితే, ఏముంది ఇక్కడ! మనిషి మొహమే కనపడదు, ఎటు చూసినా చెట్లూ మైదానాలు అన్నాడట.
జులై నాలుగు అమెరికన్ ఇండిపెండెన్స్ డే. దేశం మొత్తం సెలవు. శని ఆది వారాలు లాంగ్ వీకెండ్. పొలోమని జనం టూరిస్టు రిసార్టులకు బయలుదేరారు. రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. మూడు గంటలు అనుకున్న ప్రయాణం సాగిసాగి ఆరుగంటలు అయింది.
సువిశాల దేశం. కావాల్సినంత భూమి వుంది. మాంధాతల కాలం నాడే దేశమంతా విశాలమైన రోడ్లు పరిచేశారు. నాలుగు దిక్కులకు, ఎనిమిది మూలలకు. అడ్డంగా, నిలువుగా. ఐ మూలగా. శరీరంలో నాడీ మండలంలాగా దేశాన్ని ఏకం చేస్తూ, ఎక్కడినుంచయినా, ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రోడ్లు వేసుకున్నారు. అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జీలు, అవీ మూడు నాలుగు వరసలు. ఉత్తరం నుంచి తూర్పు వైపు. పడమర నుంచి దక్షిణం వైపు ఎటు వెళ్ళాలి అంటే అటు వైపు వెళ్ళేలా పద్మవ్యూహం లాంటి రోడ్లు. ఎలా వేసారన్నది కాదు, ఎలా వాటిని మెయిన్ టైన్ చేస్తున్నారన్నది పాయింటు. ఎక్కడా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్టు కనబడదు. అప్పుడే వేసిన వాటి మాదిరిగా కొత్తగా కనిపిస్తాయి. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మొదటిసారి అమెరికా వెళ్లి వచ్చినప్పుడు అక్కడి రోడ్లు ఒక సినిమాతార బుగ్గల మాదిరి నున్నగా వున్నాయని చెప్పిన సంగతి గుర్తుంది కదా!
వెళ్ళే దారిలో కొలంబియా నది తగులుతుంది. అది దాటితే అవతల ఒడ్డున అరెగాన్ రాష్ట్రం లోని పోర్ట్ లాండ్ పట్టణం. నది ఇవతల ఒడ్డున వాషింగ్టన్ రాష్ట్రంలోని వాంకూవర్ పట్టణం. కెనడాలోని వాంకూవర్ కాదు, ఇది వేరే. ముందే చెప్పాకదా ప్రపంచంలోని నగరాలన్నీ అమెరికాలో వున్నాయి. అవే పేర్లతో.
వాంకూవర్ లో కాసేపు ఆగి కొలంబియా నది తీరంలో సాయంత్రపు నడక పూర్తిచేయాలని మా వాళ్ళు అనుకున్నారు. నడవడం సంగతి ఎలా వున్నా కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తితో నేను కూడా వారితో జత కలిసాను. రెండు రాష్ట్రాలను విడదీస్తూ ఆ నదీ జలాలు సాయంత్రపు సూర్య కాంతిలో అత్యంత మనోహరంగా ఉరకలు పెడుతూ పారుతున్నాయి. నదిలో నీళ్ళు అంత స్వచ్చంగా, కాలుష్యరహితంగా ఎలా వున్నాయో అర్ధం కాని విషయం. నదీ తీరాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దారు.
కొలంబియా వంతెన దాటగానే పోర్ట్ లాండ్. జీపీఎస్ చెప్పినట్టు వెడితే మేము నాలుగు రోజులు వుండబోయే బస (AIR BNB) దొరికింది. దాని యజమానులు నెట్లో పంపిన పాస్ వర్డ్ సాయంతో తాళం తీసుకుని లోపలకు వెళ్ళాము. కింద మొత్తం డ్రాయింగు రూము, టీవీ, కిచెన్, డైనింగ్ హాలు. వంట సామాగ్రి, వెనుక విశాలమైన పెరడు. షటిల్ ఆడుకునే ప్రదేశం. ఆరేడు మంది కలసి జలకాలు ఆడుకునే హాట్ టబ్, క్యాంప్ ఫైర్, బార్బీక్యూ, పైన మొదటి అంతస్తులో పడక గదులు. బాత్ టబ్స్ తో స్నానాల గదులు. స్టార్ హోటళ్ళలో మాదిరిగా అన్నీ అమర్చి పెట్టి వున్నాయి. భోజనాల బల్ల మీద రాసి ఉంచిన FAMILY IS EVERYTHING అనే సూక్తి బాగా నచ్చింది.
ఆ సాయంత్రం బాత్ టబ్ లో వేడినీటి జలకాలాతలు, క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ సాయంకాలక్షేపం, తర్వాత వేడివేడి భోజనం కబుర్లు.
పోర్ట్ లాండ్ గులాబీ తోటలకు, ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ బ్రూవరీస్ వున్నాయి. వాటిల్లో ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్ సందర్శనకు వెళ్ళాము. ముందుగా రిజర్వ్ చేసుకుని వెళ్ళాలి. దట్టమైన అడవుల నడుమ బ్రహ్మాండంగా వేసిన నున్నటి రోడ్లమీడుగా ఓ గంట ప్రయాణం. అక్కడక్కడా విసిరేసినట్టు ఇళ్లు. స్కూలు బస్ స్టాప్ అనే బోర్డు కనిపించింది. ఎక్కడ ఏ ఆవాస ప్రాంతంలో అయినా నిర్దిష్ట జనాభా వుంటే అక్కడ స్కూలు, ఆసుపత్రి వుండి తీరాలి అనే నిబంధన వుందని చెప్పారు. ఇలా ప్రాధమిక వసతులు అన్ని చోట్లా వున్నండువల్లె పట్టాణాలు, నగరాల మీద భారం పడకుండా జనాలు పల్లె పట్టుల్లో జీవిస్తున్నారేమో అనిపించింది.
కొండల మీద, కొండ సానువుల్లో వందల ఎకరాల్లో విస్తరించి వుంది ఈ ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్. కొండ శిఖరం మీద వుంది మేము బుక్ చేసుకున్న వైన్ టేస్టింగ్ (రకరకాల వైన్స్ ని రుచి చూపించే రెస్టారెంటు) సెంటర్. నడికారు వయసు వున్న అమెరికన్ మహిళ ఒకరు ఆరు రకాల వైన్స్ ను రుచి చూపించారు. ప్రతి ఒక్క రకం వైన్ విశిష్టతను, అది తయారు చేసిన విధానాన్ని, పండించిన భూమి తరహాను బట్టి రుచుల్లో వచ్చే తేడాలను సమగ్రంగా వివరిస్తూ వైన్ సర్వ్ చేశారు. ఇదంతా ఉచితమే కానీ, వెళ్ళిన వాళ్ళు తమకు నచ్చిన వైన్ బాటిల్స్ కొనుక్కుని వెడతారు. బహుశా ఇదంతా కార్పొరేట్ మార్కెటింగ్ మెలకువల్లో భాగం కావచ్చు.
ఇక్కడి వైన్ యార్డులు, ద్రాక్ష తోటల వైభవం చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్రభావానికి బలైపోయిన, ఒకనాటి హైదరాబాదు శివార్లలో వందల ఎకరాల్లో విస్తరించి నగరానికి చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టిన అనాబ్ షాహీ ద్రాక్ష తోటల ప్రాభవం గుర్తుకువచ్చి మనస్సు చివుక్కుమంది.
కింది ఫోటోలు:
కొలంబియా నదీ తీర దృశ్యాలు, పోర్ట్ ల్యాండ్ లో మేము బస చేసిన హోటల్ లాంటి ఇల్లు, ఎల్క్ కొవ్ వైన్ యార్డు.




































(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: