29, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (203) : భండారు శ్రీనివాసరావు

 దేవుడు పూర్తిచేసిన పజిల్

మా ఆవిడతో కలిసి అమెరికా వెళ్ళిన ప్రతిసారీ ఆరు నెలలు కానీ, ఇప్పుడు ఒక్కడ్నీ వెడితే మాత్రం  నెలన్నర, మహా అయితే రెండు నెలలు. అంతే! నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు పేపరు బాయ్ కి, కేబుల్ వాడికి చెప్పడం మరచిపోయాను.  వారం పది రోజులు వేసిన పేపర్లన్నీ  మా గుమ్మం దగ్గర అలాగే పడివుండడం చూసిన తర్వాత అతడే వేయడం మానేశాడు. నెల తిరగగానే ఫోన్ పే ద్వారా పనిమనిషికి, వంటమనిషికి, పేపరు, కేబుల్ వాళ్లకు, ఎవరికీ ఎంత ఇవ్వాలో తెలుసు కాబట్టి పంపించేశాను. అలాగే కరెంటు బిల్లు, అపార్ట్మెంటుమెంటు మెయింటెనెన్సు, కారు తుడిచినందుకు వాచ్ మన్ కు ఇచ్చే డబ్బులు అన్నీ ఇలాగే అక్కడినుంచే  చెల్లింపులు చేశాను.

ఈ సారి అమెరికా నుంచి వచ్చి వారం దాటింది. అయినా పేపరు బాయ్ పేపర్లు వేయడం లేదు. ఫోన్ చేసి కనుక్కుందాం అనుకుంటూ వుండగానే మధ్యలో ఆదివారం వచ్చింది. ఆదివారం స్పెషల్ ఏమిటంటే ఆ రోజు తల్లి పత్రికతో పాటు పిల్ల పత్రికలు కూడా వస్తాయి. వాటిల్లో వచ్చే గళ్ళనుడి కట్టు శీర్షిక నాకు బాగా ఇష్టం.

గతంలో ఎప్పుడో జ్యోతి పత్రికలో శ్రీ శ్రీ పదబంధ ప్రహేళిక మెదడుకు పదును పెట్టే రీతిలో వుండేది. అది  పుస్తక రూపంలో కూడా వచ్చింది. మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎంగా వున్నప్పుడు ఆయనకు కేటాయించిన బ్యాంక్ భవనం లైబ్రరీలో ఆ పుస్తకాన్ని చూశాను. ఇప్పుడంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చాయి కానీ, లెటర్ ప్రెస్ రోజుల్లో అలాంటి పుస్తకాలను బ్లాక్ అండ్ వైట్ గళ్ళతో ముద్రించాలి అంటే ప్రతి పేజీని  బ్లాక్ మేకింగ్  చేయించాల్సి వచ్చేది.  వ్యయప్రయాసలతో కూడిన పని.

శ్రీశ్రీ ప్రహేళిక పూరించడం మామూలు వ్యవహారం కాదు. బుర్రకు ఎంత పని చెప్పినా, కొన్ని గడులు ఖాళీగా వుండిపోయేవి. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కరీంనగర్ జిల్లాకు చెందిన ‘ఎలనాగ’ (అసలు పేరు  డాక్టర్ నాగరాజు సురేంద్ర) గారు వాకిలి సాహిత్య పత్రికలో శ్రీశ్రీ పదబంధ ప్రహేళికలో సొగసులను గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాసారు.

కొన్ని ఉదాహరణలు, ఎలనాగ గారి సౌజన్యంతో:

ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)
దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.

కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)
కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.


కనుదెరచి చూడరా శిష్యా! కనబడుతుంది చక్రం (2)
ఇక్కడ చక్రం అంటే రాశిచక్రంలోని రాశి అన్న మాట. కనుక, అదే జవాబు. చూడరా శిష్యా మధ్య రాశి ఉన్నది కదా.

ఇంటికి వింటికి కావాలి (2)
వింటికి (విల్లుకు లేక ధనుస్సుకు) అల్లెతాడు ఉంటుంది కదా. దాన్ని నారి అంటారు. ఇక నారి అంటే ఇల్లాలు (స్త్రీ) అనే అర్థం కూడా వుంది. ఇల్లుకు కూడా నారి కావాలి కనుక, ఇక్కడ నారి జవాబు.

వంటింట్లోనూ వాటికన్ లోనూ (2)
పోప్ జాన్ పాల్ (Pope John Paul) గారు వాటికన్ లో ఉంటారు. వారిని తెలుగులో పోపు అనవచ్చు మనం. ఇక పోపు (తాలింపు) వంటింట్లో కూడా అవసరమే.

విశ్వనాథ సత్యనారాయణలో ఉన్న రెండింటిలో ఒకటి మదీయం (1)
విశ్వనాథ లోని మూడవ అక్షరం నా. సత్యనారాయణ లోని మూడవ అక్షరం కూడా నా. మదీయం అంటే నా(యొక్క) కనుక, నా అనేది జవాబు.

14.
లంక కొస నుండి లంక మొదటి దాకా; మధ్యని మధ్యకు ప్రారంభం. ఇదో పువ్వని వేరే చెప్పాలా? (3)
లంక కొస = క. లంక మొదలు = లం. మధ్యకు ప్రారంభం = మ. కలం మధ్యన మ చేరితే వచ్చే కమలం సమాధానం.

16.
కడుగడు; కడు విడు; మిగిలేది తల లేని అద్దె (2)
కడుగడు మైనస్ కడు = గడు. దాన్ని రివర్స్ చేస్తే డుగ వస్తుంది. అదే జవాబు. అద్దె = బాడుగ. తల (మొదటి అక్షరం) లేకుంటే డుగ వస్తుంది.

ఇట్లా, వుండేవి శ్రీశ్రీ గారి పజిల్స్.
(ఎలనాగ, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో) 

 

ఎలనాగ గారు రచన శాయి పత్రిక  రచన కోసం చాలాకాలం పజిలింగ్ పజిల్ శీర్షికను నిర్వహించారు.   

రచన మాస పత్రికలో వచ్చే ఈ  పజిలింగ్ పజిల్ పూర్తి చేయడం అంటే నాకు తగని ఆసక్తి.

ఆ పత్రికతో సమస్య ఏమిటంటే అది విడిగా పేపరు స్టాల్స్ లో దొరకదు. దానికోసం ప్రతి నెలా సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు  వెళ్లి, ఒకటో నెంబరు ప్లాటుఫారంలో వుండే  హిగ్గిం బాదమ్స్  బుక్ స్టాల్ లో కొనేవాడిని. ఆ పత్రిక మీద నా ఆసక్తిని, బహుశా కామన్ ఫ్రెండ్ రేడియో న్యూస్ రీడర్  డి. వెంకట్రామయ్య గారి ద్వారా తెలుసుకున్నారో ఏమిటో కానీ, రచన శాయి గారు ఆ పత్రికను  ప్రతినెలా పోస్టులో మా ఇంటికే పంపడం మొదలు పెట్టారు. దురదృష్టం కోవిడ్ రావడంతో అనేక పత్రికల మాదిరిగానే రచన ప్రచురణ కూడా ఆగిపోయింది. హిగ్గిం బాదమ్స్ ఇంకా  వుందో లేదో తెలియదు. శాయి గారి రచనలో రచనలు కూడా గొప్ప స్థాయిలో ఉండేవి. కాశీనాధుని నాగేశ్వరరావు గారి భారతి మాసపత్రికతో పోల్చిన పెద్దలు వున్నారు.

ఇక విషయానికి వస్తే,

ఆదివారం వచ్చింది. పేపర్లు లేవు. తల్లి పత్రికలు లేవు, పిల్ల పత్రికలు లేవు. మరి కాలక్షేపం ఎలా? కాలం గడవడం ఎలా!

చేసేది లేక కాళ్ళకు పనిచెప్పాను. మా ఇంటికి దగ్గరలో పేపర్లు అమ్మే దుకాణం ఎక్కడ అని వెతుక్కుంటూ. పెద్ద దూరం వెళ్ళకముందే ఒకచోట ఇద్దరు నిలబడి పేపర్లు చదువుతున్నారు. వెళ్లి చూస్తే అదో చిన్న దుకాణం. అప్పుడే మోటారు సైకిల్ మీద తెచ్చిన వివిధ దినపత్రికలను ఒకతను,  పది, పదిహేను, పాతిక, ముప్పయి చొప్పున లెక్కించి దుకాణదారుకు ఇస్తున్నాడు. ఆ పని పూర్తయ్యేదాకా నేను ఓపికగా నిలబడ్డాను. ఎందుకంటే పిల్ల పత్రికలు వున్న తెలుగు పత్రికలను అన్నింటినీ కొనుక్కుని పోవాలనే ఆలోచనతో వచ్చాను కాబట్టి. ఈలోగా కొందరు వచ్చి పలానా పత్రిక కావాలంటూ అడిగి కొనుక్కుని వెడుతున్నారు. ఎవరు ఏ పత్రిక అడిగి మరీ కొంటున్నారు అనేది అక్కడే నిలబడి చూస్తున్న నాకు బోధపడుతూనే వుంది. పత్రికల సర్క్యులేషన్ తెలుసుకోవాలంటే ఇలాంటి దుకాణాల దగ్గర కాసేపు నిలబడితే చాలు.

రద్దీ తగ్గిన తర్వాత అడిగాను, ఇలా ముప్పయి నలభయ్ వేయించుకుంటున్నారు, అమ్ముడు పోతాయా అని.

‘అబ్బే వీటిల్లో సగం పోయినా గొప్పే. ఈ రోజు ఆదివారం కాబట్టి పత్రికతో పాటు ఇచ్చే ఆ చిన్న పుస్తకం కోసం ఈ మాత్రం అయినా అమ్ముడుపోతున్నాయి.  కాకపోతే, అమ్ముడు పోని వాటిని మళ్ళీ ఆ పత్రిక ఏజెంటే వచ్చి పట్టుకుపోతాడు’ అని దేవరహస్యం చెప్పాడు. ‘ఒక విషయం చెప్పమన్నారా, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తరవాత పత్రికలు చదివే వాళ్ళు తగ్గిపోయారు, ఇది నా అనుభవం’ అన్నాడు.   

 

ఉపశ్రుతి:

గళ్ళనుడికట్టు పూర్తిచేయడం అంటే నాకంటే కూడా మా ఆవిడకు పెద్ద ఆసక్తి.

ఆదివారం వచ్చిందంటే తనకి నాలుగాటలు సినిమా చూసిన సంబరం. పదబంధాలు, గళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోయేది,  ఆ రోజు  డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.

సరిగ్గా ఆరేళ్ల క్రితం, 2019 జులై ఇరవై తొమ్మిదో తేదీన తీసిన ఫోటో ఇది. పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను,  ఎందుకో లేచివచ్చి ఈ ఫోటో తీశాను.

అదే ఆమె ఆఖరి ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదు, నాకూ తెలియదు.

ఆ కుర్చీ ఆ టేబుల్ అలాగే వున్నాయి, ఆమె లేదు.

మూడు వారాల్లో మనుషులు ఇలా మాయం అయిపోతారా!

కింది ఫోటో:

పిల్లపత్రికల్లో గళ్ళనుడికట్లు పూర్తి చేస్తూ మా ఆవిడ నిర్మల



 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: