ఆ మధ్య దేవినేని మధుసూదన రావు గారు ఫోన్ చేశారు. ఆయనా, వారి భార్య జయశ్రీ గారు ఇద్దరూ అమెరికాలోనే వున్నారు. ఎక్కడా అని అడగడం మానేశాను.
పెద్ద దేశం. ఒకచోట సూర్యోదయం అవుతుంటే అదే సమయంలో మరో చోట చంద్రోదయం. నేను ఈ దేశానికి అనేక సార్లు వచ్చాను. వచ్చినప్పుడల్లా నెలల తరబడి వున్నాను. ఇప్పటికీ ఈ టైం జోన్స్ సంగతి వంటబట్టలేదు.
మనం ఉదయం అనుకుని ఫోన్ చేయబోతే అవతల వాళ్ళు గాఢ నిద్రలో వున్నప్పుడు ఫోన్ మోగుతుంది. మీకంటే మేము మూడు గంటలు ముందు, నాలుగు గంటలు వెనుక అని చెబుతుంటారు. కానీ ప్రతిసారీ లెక్కలు వేసుకుని ఫోన్ చేయాలి అంటే ఇబ్బంది. మరీ ముఖ్యంగా నాలాంటి మతిమరపు వాళ్లకి.
‘మీదంతా కన్వీనియంట్ మతిమరపు. పిల్లల పుట్టిన రోజు గుర్తుండదు కాదు నిన్న పొద్దున్న ఎప్పుడో మీ ఫ్రెండ్ ఈ సాయంత్రం ప్రెస్ క్లబ్ లో కలుద్దామన్న సంగతి మాత్రం బాగా గుర్తుంటుంది’ అని ఎద్దేవా చేసేది. మతిమరపు వేరు, గుర్తుకు తెచ్చుకోవడం వేరు అని చెప్పాలని అనుకుని ఎందుకులే అని మానేసేవాడిని.
'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. నాకు తెలిసి, ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు.
హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారని విన్నా.
చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
ఎప్పుడో నేను బ్లాగులో రాసిన మాస్కో విశేషాలు చదివి, నన్ను, మా ఆవిడను చూడడానికి ఎల్లారెడ్డి గూడాలో మేము ఉంటున్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.
కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొందరు మొక్కల్ని ప్రేమిస్తారు. నాకు తెలిసి పుస్తకాల్ని ప్రేమించే వ్యక్తి ఈ దేవినేని మధుసూదన రావు గారు. పుస్తకాలను అందరూ చదువుతారు. మంచి పుస్తకాలను కొందరే ఎంపిక చేసుకుని చదువుతారు. పుస్తక ప్రేమికుడయిన ఈ వ్యక్తి తను పుస్తకాన్ని ‘కొని’ చదవడమే కాదు పుస్తకాల్ని ప్రేమించే గుణం వున్న మరికొందరికి, ఆ పుస్తకాల్ని కొని, పోస్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపి చదివిస్తారు. ఏదయినా పుస్తకం బాగా నచ్చితే వందల సంఖ్యలో వాటిని కొని బంధుమిత్రుల ప్రత్యేక వేడుకలకు హాజరయ్యే అతిధులకు పెళ్లి కానుకగా పంచుతారు.
ఈ పుస్తక దాన కర్ణుడు భార్యను వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చిన రోజు, నేనూ, మా ఆవిడా ఎంతో సంతోష పడ్డాము. అలాగే ఇప్పుడు అమెరికాలో వున్నప్పుడు వారి నుంచి ఫోన్ రావడం ఆనందం కలిగించింది. మేము మళ్ళీ కలిసిన దాఖాలా గుర్తురావడం లేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు.
పుస్తకాలు అంటుంటే అమెరికాలోనే వుంటున్న సీనియర్ పాత్రికేయ మిత్రుడు నరిసెట్టి ఇన్నయ్య గారు రాసిన మిసిమి వ్యాసాల సంకలనం గుర్తుకువచ్చింది.
కొన్నేళ్ళ క్రితం, 2012 లో అనుకుంటా, హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఈ వ్యాసాల సంకలన గ్రంధాన్ని అప్పటి హెచ్.ఎం.టీ.వీ. సీ.యీ.వో., కే. రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఒక చక్కటి ఆశయంతో, ‘మిసిమి’ పత్రికను ప్రారంభించినప్పటి నుంచి ఇన్నయ్య తనదయిన శైలిలో ఈ వ్యాసాలను రాస్తూ వచ్చారు. ఎన్నుకున్న అంశాల పరిధి అతి విస్తృతం. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయితల రచనలతో పాటు, వారి వ్యక్తిత్వాలను పరిచయంచేసే సరికొత్త ప్రక్రియను నెత్తికెత్తుకోవడం ఒక్క మిసిమి వంటి పత్రికకే సాధ్యం.
ఇన్నయ్య కేవలం రచయిత మాత్రమే అయితే ఈ రచనల తరహా మరో రకంగా సాగివుండేది. ఆయన గొప్ప మానవతావాది. పైగా కరుడుగట్టిన హేతువాది. తను నమ్మిన సిద్ధాంతాలను తాను మొండిగా నమ్మడమే కాదు ఇతరులను కూడా నమ్మించాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తుండడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం. ఈ స్వభావం ఆయనకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దానితో పాటు అభిమానులను అదే సంఖ్యలో విమర్శకులను సంపాదించిపెట్టింది.
ఇన్నయ్య దేవుడిని నమ్మరు. నమ్మని వాళ్లు చాలామంది వుంటారు. కానీ ఇన్నయ్య అంతటితో దేవుడిని వదలరు. వెంటబడి మరీ దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. అది అంత అవసరమా అని అడిగే మిత్రులం కొంతమందిమి, ఆ దేవుడి దయవల్ల ఇప్పటివరకూ ఆయనతో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాము. (‘నీవు దేముడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు’ అనే థామస్ సాజ్ ధర్మసూక్ష్మాన్ని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.)
చక్కటి రచనలు అతి చక్కగా అచ్చు వేసిన ఖ్యాతి ప్రచురణకర్తలది. కాకపొతే, అక్కడక్కడా ముద్రారాక్షసాలు పంటికింద రాయిలా పుస్తక పఠనానికి అడ్డుతగులుతుంటాయి. (పేజీ 33 – ఒకయాన –ఒకాయన) ఇలాగే మరికొన్ని. కాకపొతే ఇంతటి బృహత్తర ప్రయత్నం ముందు అవి ఎన్నదగ్గవి కాదు.
ఈరోజు జులై 17.
నిన్న16, రేపు 18. అయితే ఏమిటి అనకండి. నాకు ఇది సెంటిమెంటు రోజు.
మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్).
అలా నేనూ మా ఆవిడా, విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో ఒకనాటి తన కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది మాత్రం విడిగా వుండాలని కోరుకున్నది తను . 1975 నుంచి అనేక అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో ప్రత్యేకంగా పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం అని తేలిపోయింది.
అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి రాజా ఫర్నిచర్ షో రూమ్ లో గోడకు అమర్చేచిన్న పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది. అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది.
ఈరోజు జులై 17.
అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టిలేపింది.
కొన్నేళ్ళ క్రితం అంటే 2019 జులైలో ఇదే రోజు పొద్దున్నే, ఏదో ఓ ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలోని దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే, శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో దేవుళ్ళు, దేవతలు అందరూ అలాగే వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా! వాళ్ళపై జోకులు కూడదు.
కింది ఫోటోలు:
మా ఇంటి ఇలవేల్పుల నివాస ప్రాంగణం
మిసిమి వ్యాస సంకలనం ఆవిష్కరణ
వేదిక మీద ఇన్నయ్య గారు లేరేమిటి అని అడగకండి. ఆయన అమెరికాలో వుండి హైదరాబాద్ లో కధ నడిపించగల సమర్థులు.
(17-07-2025)
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి