24, జులై 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (201) : భండారు శ్రీనివాసరావు

 మారిన మనిషి

ఆ తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో, ఇంటి  లిఫ్ట్ ముందు వున్న కాసింత జాగాలో చోటుచేసుకున్న సీను ఎలా వుందంటే,  కస్టమ్స్ వాళ్ళు పట్టుకుని సోదాచేసిన తీరుగా రెండు చిన్నపాటి సూటుకేసులు తెరిచిపెట్టి  వున్నాయి. వాటిల్లో వున్న దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి వున్నాయి.  ఇంటి తాళం చేతుల అన్వేషణలో సాగిన క్రతు ఫలితం అన్నమాట.

వాచ్ మన్ సమ్మయ్యకు ఏమి జరిగింది, ఏమి  జరుగుతోంది  అన్నది ఒక పట్టాన అర్ధం కాలేదు. కాసేపటికి అడిగాడు, ఈ వెతుకులాట దేనికోసం అని. జవాబు విని, వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ, ‘మీరే కదా అమెరికా నుంచి ఫోన్ చేసి సుభాష్  బాబు గారికి (మా అన్నయ్య కుమారుడు) చెప్పారు, ఆయన దగ్గర వున్న స్పేర్ కీ నాకు ఇచ్చి ఇల్లు శుభ్రం చేయమని. ఇక పదండి పైకి పోదాం’ అన్నాడు, సామాన్లు సూటు కేసుల్లో సదురుతూ. నిజమే, అమెరికా వెళ్ళేటప్పుడు రెండు స్పేర్ కీస్ ఒకటి సుభాష్ దగ్గరా, రెండోది  మా కోడలు నిషా బంధువు ఆశీష్ దగ్గరా పెట్టి వెళ్లాము. మరో విషయం ఏమిటంటే మా కోడలు నిషా, జీవికను వాళ్ళ అమ్మగారి ఇంట్లో కటక్ లో వుంచి, నేను వెళ్ళిన కొద్ది రోజులకే ఆఫీసు పని మీద అమెరికా వచ్చింది,  అయిదు వర్కింగ్ డేస్ మీటింగుల కోసం. నేను వుండే సియాటిల్ కు ఆమె వెళ్ళిన డెలావర్ చాలా దూరం. కాబట్టి మేము అమెరికాలో కలిసే వీలు లేదు, ఆమెకు అందుకు తగిన వ్యవధానం లేదు.  నాకంటే ముందే వచ్చినా, జీవిక కోసం కటక్ వెళ్ళిపోయింది. దాంతో  చాలా రోజులుగా ఇల్లు తాళం వేసి వుంది. కాబట్టి ఇల్లు బాగుచేయడానికి తాళం చెవి వాచ్ మన్ కు ఇమ్మని ముందుగానే ఫోన్ చేసి చెప్పాను. నేను చెప్పినట్టుగానే సుభాష్ తన దగ్గర వున్న తాళం చెవి సమ్మయ్యకు ఇచ్చి వెళ్ళాడు. తాళం చెవులు మరచిపోయినట్టుగానే ఈ సంగతి కూడా మరచిపోయాను. మొత్తం మీద శుభం కార్డు కొద్దిగా ఆలస్యంగా పడి, నేను పాత ఇంట్లోకి కుడికాలు కొత్తగా  పెట్టగలిగాను.

నా మానసిక ఆందోళన సమసిపోయేలా చేసిన సమ్మయ్యకు ఉచిత రీతిన కృతజ్ఞతలు చెప్పాను. అతడు కూడా మరో శుభ వార్త చెవిలో వేసి వెళ్ళాడు. నేను ఊర్లో లేని సమయంలో అపార్ట్ మెంట్ లో నీళ్ళ కరువు వచ్చి ఉదయం రెండు గంటలు, సాయంత్రం ఓ గంట మాత్రమే నీళ్ళు వదులుతారని, దూర ప్రయాణం చేసివచ్చారు కాబట్టి,  మరో రెండు గంటలు ఇలాగే  మేలుకుని ఆరింటికి స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని ఉచిత సలహా ఇచ్చి అతడు సెలవు తీసుకున్నాడు. ‘ఇలా ఎలా, ఒకపక్క ఫ్లై ఓవర్లు మునిగిపోయేలా వర్షాలు ముంచెత్తి వేస్తున్నాయని వార్తలు వస్తుంటే ఈ నీళ్ళ కరువు ఏమిట’ని చర్రున కోపం వచ్చింది. కానీ బలవంతాన అణచుకున్నాను.

కారణం పెద్ద కోడలు భావన చెప్పిన భగవద్గీత.

అమెరికా నుంచి తిరుగు ప్రయాణానికి ముందు రోజు రాత్రి నా కొడుకు, కోడలు నాకు చిన్నపాటి నీతి బోధ చేశారు. ముఖ్యంగా నా కోడలు భావన. కొంత నా సొంత  కపిత్వం కలిపితే ఆ బోధ ఇలా సాగింది.

‘భగవంతుడు మనని పుట్టించినప్పుడే కంటిపాపలకు భూతద్దాలు పెట్టాడు. అంచేత మనుషులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి ప్రతి చిన్న సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. ఒకరోజు వంట మనిషి రాదు. మరో రోజు పనిమనిషి రాదు. ఒక రోజు నీళ్ళు రావు.  కొంపలు మునిగిపోవు. మీకు స్టవ్ అంటించడం కూడా  రాదు అని మీ జీరో సీరియల్ లో రాసినట్టు సందీప్ చెప్పాడు. కుక్ రాకపోతే అ పూట టిఫిన్ చేయకుండా వుండిపోతారని కూడా నాకు తెలిసింది.  ఈ వయసులో అది మంచిది కాదు. ఒకప్పుడు ఇలా బాధలు పడ్డమాట నిజమే. ఆ నేపధ్యంలోనే మీరు ఆలోచిస్తున్నారు. ఎదురయింది సమస్య కాదు, ఇబ్బంది, కాస్త అసౌకర్యం అనుకోండి. ఆ సమస్య మంచులా విడిపోతుంది. వంటమనిషి రాని రోజున  స్విగ్గీలు, జొమాటాలు ద్వారా  ఏదైనా మంచి హోటల్ నుంచి మంచి టిఫిన్ తెప్పించుకుని తినండి. అంతేగాని పస్తు పడుకోవద్దు. డబ్బు గురించి ఆలోచించవద్దు. ఇక్కడ మేమున్నాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య ఆ సమయంలో చాలా పెద్దదిగా, అలవికానిదిగా అనిపిస్తుంది. అది సహజం. అయితే పరిష్కారం పక్కనే వుంటుంది. సమస్య వల్ల కలిగిన అసహనం కారణంగా అది కళ్ళకు కనబడదు. అసహనం వల్ల ఎదుటి మనిషిని  కడిగి గాలించాలనే లేనిపోని ఆగ్రహం. ఇవన్నీ దీర్ఘ కాలంలో ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ప్రతిదీ తేలిగ్గా తీసుకోండి. ‘అరె  ఇంత చిన్న విషయం కోసమా అంత పెద్ద మాట అన్నాను’ అని మీకే తర్వాత  అనిపిస్తుంది. అంచేత మా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు కొద్దిగా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే, అన్ని అవే పరిష్కారం అవుతాయి. మరి కొంతకాలం వుండమన్నా వుండకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అమెరికా వచ్చేసరికి మీలో మాకు ఆ మార్పు కనిపించాలి. అప్పుడే ఇక్కడ మేము సంతోషంగా వుండగలుగుతాము”

ఇదంతా సినిమా రీలులా వలయాలు వలయాలుగా కళ్ళముందు తిరగడంతో, తోసుకువచ్చిన కోపం కాస్తా,  సముద్రపు అల మాదిరిగా  మళ్ళీ లోపలకు వెళ్ళిపోయింది.

ఆరు గంటలకు నీళ్ళు వదిలారు. గీజర్ వేసుకుని స్నానం చేశాను. పాలవాడు పాల ప్యాకెట్లు వేసి వెళ్ళాడు. ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్లి స్టవ్ వెలిగించాను. పాలగిన్నె స్టవ్ పై పెట్టి  అధరాపురపు వారి పాలపొంగు పోస్టులు గుర్తుకువచ్చి అక్కడే నిలబడ్డాను. ఎన్స్యూర్ పొడి కలుపుకుని తాగి బయట పడ్డాను. ఓస్ ఇంత తేలికా అనిపించింది.

యథావిధిగా వంట మనిషి, పనిమనిషి అందరు ఎవరి డ్యూటీలు వాళ్ళు మొదలుపెట్టారు. మర్నాడు మా రెండో అన్నయ్యను చూడడానికి కాల్ డ్రైవర్ ని పిలిపించుకుని ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న వాళ్ళ మూడో కుమారుడి లాల్ బహదూర్ ఇంటికి వెళ్లాను. హాయిగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే ఫోన్ మోగింది. అటు వైపు మా వలలి. రాత్రి వంట చేయడానికి వచ్చింది. అందుకని ఇంటి తాళం చెవి వాచ్ మన్ కి ఇచ్చి వచ్చాను. ‘అది ఇంటి తాళం కాదు, వేరే తాళం చెవి’ అంటూ ఒక భీకరమైన వార్త నా చెవిలో వేసింది. అసలు తాళం చెవి ఇంట్లో వుండిపోయింది. అది ఆటోమేటిక్ లాక్. రాత్రి ఎనిమిది గంటల సమయంలో మెకానిక్ దొరకడం అసాధ్యం. నా బుర్ర పని చేయలేదు. కానీ మా అన్నయ్య కోడలు, మా మేనకోడలు దీప బుర్ర చురుగ్గా పనిచేసింది. ఒక స్పేర్ కీ  నిషా మరొకరికి ఇచ్చి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చి, కటక్ ఫోన్ చేసి నిషాతో మాట్లాడి విషయం చెప్పింది. తొమ్మిదిన్నరకల్లా ఆ తాళం చెవి మళ్ళీ వాచ్ మన్ చేతికి అందేటట్టు ఏర్పాటు జరిగింది. ఈ కొత్త సమస్యకు పరిష్కారం ఎలా అనుకుంటున్న సమయంలో  సమస్య కాస్తా,  చిన్న పాటి ఇబ్బందిగా మారింది.

నిజానికి భావన చెప్పినట్టు ఇది సమస్య కాదు, ఇబ్బంది మాత్రమే!

కింది ఫోటో:

దీప, లాల్ ఇంట్లో నిలువెత్తు బాలాజీ విగ్రహం వద్ద  మా అన్నయ్య రామచంద్రరావు గారు, మేనల్లుడు రామచంద్రంతో నేను.




(ఇంకావుంది)

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ పెద్దకోడలు చేసిన గీతాబోధ - ‘నిర్వికార యోగం’ అందామా ? - బాగుందండీ. అలవాటు చేసుకోదగిన తత్వం.