“మళ్ళీ తప్పాట్ట”
ఏటా పరీక్ష ఫలితాలు రాగానే మా చుట్టపక్కాలు అందరూ
నా గురించి చెప్పుకునే మాట ఇదొక్కటే. పదో తరగతి నుంచి మొదలుపెట్టి డిగ్రీ వరకూ ఏ
పరీక్ష కూడా ఎం ఎస్ ఎం (మార్చ్- సెప్టెంబర్-మార్చ్) బండి ఎక్కకుండా, ఒకే తడవ పాసయింది లేదు.
అదీ నా ట్రాక్ రికార్డ్.
బీ కాం ఫైనల్స్ లో మర్కంటైల్ లా అనే ఒక సబ్జెక్ట్
మిగిలిపోయింది. అది గట్టెక్కడానికి రెండేళ్లు పట్టింది. ఒకసారి పరీక్షకు వెళ్ళే
సమయంలోనే అలంకార్ ధియేటర్ లో ఏదో కొత్త పిక్చర్ ప్రీ వ్యూ. పరీక్ష పక్కనబెట్టి
సినిమాకు వెళ్లాను. మరోసారి పరీక్ష రాయడానికి కాలేజీకి వెడితే అక్కడ ప్రిన్సిపాల్ గారికి,
నేను జ్యోతి విలేకరిగా పరిచయం కనుక ఏమిటి ఇలా వచ్చారు అని తన రూముకు తీసుకు
వెళ్ళారు. ఆయన తెప్పించిన కాఫీ తాగి ఏవో ముచ్చట్లు, చెప్పీ, వినీ
పరీక్ష హాల్లోకి పోకుండానే ఇంటికి వెళ్లాను. నా నిర్వాకం తెలిసిన మనిషే కనుక మా
ఆవిడ నిర్వేదంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.
మరోసారి పరీక్ష సమయానికి నా మేనల్లుళ్లు తుర్లపాటి
సాంబశివరావు,
కొలిపాక రాజేంద్ర ప్రసాద్ బెజవాడ వచ్చారు. వాళ్ళు పట్టుబట్టి నన్ను వెంట బెట్టుకుని సిటీ బస్సులో
కాలేజీకి తీసుకు వెళ్ళారు. అందులోనే భగవద్గీత చెప్పారు. 35 మార్కులు
తెచ్చుకుంటే చాలు. రెండు మూడు ప్రశ్నలకు సరిగా జవాబు రాస్తే
పాసవుతావు, అంటూ కొన్ని గెస్ ప్రశ్నలకు నాచేత జవాబులు చెప్పించారు. ఇవే ప్రశ్నలు
వస్తే రాయి, లేకపోతే
మరో మారు చూద్దాం అన్నారు. అదృష్టం! అవే వచ్చాయి. ఇంట్లో కాకుండా బస్సులో
చెప్పబట్టి జవాబులు మెదడులో పచ్చిగానే వున్నాయి కనుక చకచకా రాసేశాను. నేను బయటకు
వచ్చేదాకా వాళ్ళు బయటే వున్నారు. పేరయ్య హోటల్లో గడ్డ పెరుగుతో భోజనం చేసి, విజయా
టాకీసులో సినిమా చూశాము.
చిత్రం! 35 అంటే 35
మార్కులతో పాసయి, డిగ్రీ
అర్హత సాధించాను.
ఈ నేపధ్యంలో మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు పత్రికలో పడిన చిన్న ప్రకటన కాపీ నా చేతికి
ఇచ్చారు. ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగం. డిగ్రీతోపాటు ఏదైనా పత్రికలో అనుభవం. తెలుగు భాషపై పట్టు. తెల్ల
కాగితం మీద ధరకాస్తు నెలాఖరులోగా పంపాలి.
అంటే ఇంకా వారం రోజులే వ్యవధి.
మళ్ళీ అంతర్మధనం. బెజవాడతో పోలిస్తే హైదరాబాదులో
జీవన వ్యయం ఎక్కువ. పెరిగే జీతానికి దానికి సరిపోతుంది. ధరకాస్తు రాశాకాని
పోస్టులో వేయలేదు. ఇంకా రెండు రోజులే గడువు.
మా అన్నయ్య అడిగాడు. పంపాను అని బొంకాను. దాన్ని
నిజం చేయడానికి గవర్నర్ పేట పోస్ట్ ఆఫీసుకు వెళ్లి జేబులోనే వున్నఅప్లికేషన్ ను ఓ
కవరు కొని పోస్ట్ చేశాను. ఒక రోజులో అది చేరుతుంది అనే నమ్మకం నాకు లేదు.
కొన్ని నెలల తర్వాత ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది.
వెళ్లాను.
విశ్వనాధ రామాయణ కల్పవృక్షం గురించి,
రంగనాయకమ్మ విషవృక్షం గురించీ అడిగారు. తెలుగులో జవాబు చెప్పమన్నారు. నేను
రెచ్చిపోయి ఇరవై నిమిషాలు నాకు నోటికి వచ్చింది, అప్పటికి తోచింది గడగడా చెప్పేశాను.
సరి, ఇక
వెళ్ళు అన్నారు మరో ప్రశ్న అడగకుండా. ఇదేమి ఇంటర్వ్యూ అనుకుంటూ బస్సెక్కి బెజవాడ
వచ్చి మళ్ళీ ఆంధ్రజ్యోతిలో నా విధుల్లో పడిపోయాను. నెలలు గడుస్తున్నా రేడియో నుంచి
ఏ కబురూ లేదు. కనుక్కుని చెప్పే మనుషులు లేరు.
కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘నిన్ను సెలక్ట్
చేసుకున్నాం, వచ్చి
చేరు’ అనే వర్తమానం వచ్చింది.
ఎప్పుడు వెళ్ళాలి అనేది అందులోనే వుంది. ఎలా
వెళ్ళాలి అనే ప్రశ్నకే జవాబు లేదు. కానీ మా ఆవిడ వద్ద రెడీగా వుంది, బంగారు గాజుల
రూపంలో. అవి బయటకు వెళ్ళిపోయాయి. మేము హైదరాబాదు చేరుకున్నాము.
కింది ఫోటో:
హైదరాబాదు వచ్చిన కొత్తలో ఇందిరాపార్కులో
(Photo Courtesy Shri G.S. Radhakrishna, Then Hyderabad
Correspondent for WEEK Magazine)
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి