బస్సులో బంధువులు
ఆ రోజు
మాస్కోలో మా ఇంటికి అనుకోకుండా బస్సులో వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం
ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.
నిజానికి అది
మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న
పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు
ముక్క వచ్చింది.
నిజానికి
రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా
ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే
హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి తరవాత కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి
డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన
ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్
బాగ్ లో' వారానికోసారి
మాస్కోకు విమానంలో పంపుతారు.
మన ఎంబసికి
చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి
తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే
ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే
నవ్వొస్తుంది. మేము
జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు
రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్ ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు
తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు
మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు
ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి.
వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.
.మన రాష్ట్రం
సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్
గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.
తరువాతి
రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్రజ్యోతి ఎడిటర్, ఐ. వెంకట్రావు గారు తెలుగు పత్రిక కోసం అక్కడి
తెలుగువాళ్ళు పడుతున్న ఆరాటాన్ని
గమనించి, హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే
ఎంబసీ ద్వారా ఆంధ్రజ్యోతి దినపత్రికను నా పేరు మీద పంపడం ప్రారంభించారు.
మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం
చేసింది కూడా.
ఇక ఆ పోస్టు కార్డు విషయానికి వస్తే,
బందరులో
నరసింహమూర్తి గారనే ఒక
పెద్దమనిషి గారున్నారు. ఇస్కస్ (ఇండో సోవియట్ సాంస్కృతిక సంస్థ)ద్వారా సోవియట్ యూనియన్ పర్యటనకు రావాలనుకుంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రతినిదివర్గంలో ఆయన వున్నారు. శాకాహారి అయిన ఆయన రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందే వాకబు చేసుకుని, నా అడ్రసు తెలుసుకుని ఆ కార్డు రాసారు. ఫలానా రోజున మాస్కోలో ఫలానా హోటల్ లో ఉంటాననీ, వచ్చికలుసుకోవాల్సిందనీ అందులో కోరారు.
దాని ప్రకారమే ఆ ఫలానా రోజున ఆ ఫలానా హోటల్ కు వెళ్లి ఆయన్ని కలుసుకున్నాను. మాస్కో రావడానికి ముందే రష్యాలోని మరో రెండు మూడు నగరాలు వారిని తిప్పి తీసుకువచ్చారు. బడలికతో
నీరసించివున్న ఆయన
నన్ను పక్కకు తీసుకువెళ్లి, 'ఈ రోజు
మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఏమయినా అభ్యంతరమా' అని అడగలేక అడిగారు. పరిస్తితిని అర్ధంచేసుకుని వెంటనే ఆ
పెద్దమనిషిని మా
ఇంటికి బయలుదేరదీసాను. ఈ విషయం ఎలాతెలిసిందో ఏమో, ఒక్కొక్కరుగా వచ్చి అదే కోరిక కోరారు. ఇప్పట్లోలాగా ఆ రోజుల్లో సెల్ ఫోనులు లేవు. ఇంటికి ఫోను చేసి ఇంతమంది వస్తున్నారని ముందస్తుగా
కబురు చేసే వీలులేదు. ఏమయితే
అయిందని వాళ్ళతో
వున్న రష్యన్ దుబాసీతో సహా అందర్నీవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాను.
బిలబిలమంటూ ఇంటికి వచ్చిన అతిధులను చూసి మా ఆవిడ ముందు కంగారు పడినా, తరవాత తమాయించుకుని అందరికీ పచ్చళ్ళు, సాంబారు, పెరుగుతో భోజనాలు పెట్టింది. 'అన్నదాతా సుఖీభవా' అని అంతా ఆశీర్వదిస్తుంటే, ‘ఇచ్చుటలో వున్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదనీ, లేటుగ తెలుసుకున్నాను' అన్న బాపూ రమణల బుద్దిమంతుడి పాట గుర్తుకు వచ్చింది.
ఆ రోజు మా ఇంట్లో నాలుగు
మెతుకులు తిన్న వారందరూ పోతూ పోతూ ఇచ్చిన టీ పొట్లాలు, కాఫీ పొడి పాకెట్లు, వక్కపొడి మొదలయిన- 'అమూల్య కానుకలతో' ఆ తరవాత కొన్నాళ్ళు మాకు పండగే
పండగ.
దేశం
కాని దేశంలో ఇలా సంతర్పణలు ఎలా అనే అనుమానం రావచ్చు
మాస్కోలో పాలకు కొదవలేదు. ఉన్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మపదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు
చేసుకోవచ్చు. కానీ తోడుకు పెరుగేదీ?
డిల్లీనుంచి
ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతిచేసుకున్న పెరుగుతో ప్రారంభించిన 'తోడు' ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమయి, సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలిగాము.దాంతో ఇక మాస్కోలోని తెలుగులోగిళ్ళలో పెరుగు వడలు, పెరుగు పచ్చళ్ళు , ఆవకాయకారంతో పెరుగన్నాలు, మజ్జిగ పులుసులు స్వైరవిహారం చేయడం మొదలెట్టాయి.
పెరుగు సమస్య తీరిపోవడంతో బియ్యంపై దృష్టి పెట్టాము. అక్కడ దొరికే బియ్యం చాలా చాలా కారు చవక. అయితే పేరుకు బియ్యమే కానీ వండితే వచ్చేది అన్నం కాదు. తినడానికే కాదు
చూడడానికి కూడా పసందుగా లేని రష్యన్ బియ్యం బదులు మామూలు బియ్యం సంపాదించడం ఎల్లా
అన్నది మా
దినసరి సమస్యగా మారింది.
ఆ
సమయంలో మాస్కో
వచ్చిన రాజ్య
సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు ఒక రోజు సాయంత్రం నగరంలోని డిల్లీ రెస్టారెంట్ లో తెలుగు వాళ్ళందరికీ విందు ఇచ్చారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆ హోటల్ లో బాస్మతి బియ్యంతో చేసిన ఫ్రయిడ్ రైస్ వడ్డించారు.
వెంటనే ఆ రెస్టారెంట్ మేనేజర్ ను కదిలించి చూసాను.
వాళ్లకు డిల్లీ నుంచి వారానికి ఒకసారి బియ్యం బస్తాలలో వస్తుంటాయట. బియ్యంకోసం మేము పడుతున్నపాట్లు విన్నవాడయి, మనసు కరిగిన వాడయి నెలకిన్ని కిలోలని బియ్యం (ఖరీదుకు) ఇవ్వడానికి
ఒప్పుకున్నాడు. అలాగే
ఐ టీ డీ సీ నడిపే
బాంబే రెస్టారెంట్
నుంచి మరికొంత నెలసరి బియ్యం కోటా సంపాదించుకునే
తెలివితేటలను 'అవసరమే'
మాకు
నేర్పింది.
మాస్కోలో
అన్నీ చవకే కాని శాకాహారులకే కొద్దిగా ఇబ్బంది. మంచు దేశం కాబట్టి కూరగాయలు
దొరకవు. దొరికినా మనవైపు అలవాటయినవి అసలే దొరకవు. ఒకటీ అరా కానవచ్చే ఆకు కూరల్లో
కొన్నింటిని మా ఆవిడ శబరి మాదిరిగా కొరికి చూసి, గోంగూర పులుపుకు కాసింత దగ్గరగా వున్న ఒక ఆకు
కూరకు ‘గోంగూర’ అని నామకరణం చేసింది. ఆ తరువాత మాస్కోలో వున్న అయిదేళ్ళూ వచ్చిన
అతిధులకు ఆ గోంగూరతోనే ఆతిధ్యం.
.కొంత ఎక్కువ ఖర్చయినప్పటికీ, భోజనానికి
సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలు తీరిపోవడంతో, మాస్కోలో చదువుకునే తెలుగు పిల్లలకు శనాదివారాల్లో మా ఇల్లు తెలుగు భోజనశాలగా మారిపోయింది. వాళ్ళంతా మా ఆవిడను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఇళ్ళకు దూరంగా, ఇంటి భోజనానికి మరీ దూరంగా నాలుక చవిచచ్చిన ఆ
పిల్లలు, మా ఆవిడ వడ్డించే 'రీనక్ గోంగూర పచ్చడి, గడ్డపెరుగు అన్నం' తినడానికి చాలా చాలా దూరాలనుంచి చచ్చీచెడీ వచ్చేవారు. వాళ్ళ ఆటా పాటలతో మా
ఇల్లు సందడే సందడి. రెండు రోజులు యిట్టే సరదాగా గడిచిపోయేవి. ఒకరికి పెట్టడంలోవున్న హాయినీ, ఆనందాన్నీ ఒక జీవితానికి సరిపడా మాస్కో జీవితం మాకు అందించింది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
కింది
ఫోటోలు:
మాస్కో యూనివర్సిటీలో చదువుకుని డాక్టర్లు అయిన సమత, రాజ్యలక్ష్మి. ఇతర విద్యార్ధులతో మా ఆవిడ నిర్మల
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి