10, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (108) – భండారు శ్రీనివాసరావు

 రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి, నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ ఫోటో గుర్తింపు  కార్డు తీసి, ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మనమే మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మనం మన కార్డు తీసి ఇచ్చి నేను పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.

జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన వారికి.

పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం. ఇంకొంచెం డబ్బు ముదిరితే పాస్ పోర్టు, వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.

పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.

హైదరాబాదులో రేడియో విలేకరి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. బియ్యం, గోధుమలకోసం కాదు. గుర్తింపు కోసం. పాస్ పోర్టుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నా, ఆ రోజుల్లో రేషన్ కార్డు అడిగేవాళ్ళు. అందరిలాగే దానికోసం  ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.

తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.

అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న ఉద్యోగం చలవే.  

బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతే  బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.

ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో మాది అంటే మేమే నమ్మే పరిస్థితి లేకుండా, కింద పేరు రాస్తే కాని పలానా అని గుర్తు పట్టడానికి వీలు లేకుండా, ఆ పేరు కూడా ఇంగ్లీష్ లో ఒక రకంగా, తెలుగులో మరో రకంగా,  గొప్ప అసహ్యంగా వచ్చింది. కొన్నేళ్ళు ఆ ఆధార్ ఆధారంగానే రోజులు నెట్టుకువచ్చి, సాంకేతికంగా పరిస్థితులు కాస్త బాగుపడ్డ తర్వాత ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.

విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.

ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత యాభయ్ ఏళ్ళుగా. దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో బస్సుల్లో తిరిగే మరో కార్డు.  స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను. 

వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. ఆఫీసు వాళ్ళు మూడు సింహాల బొమ్మతో ఇచ్చే విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.

పొతే, సగం ధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.

నేను సుదీర్ఘ కాలం పనిచేసిన హైదరాబాదు రేడియో, దూరదర్శన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.

రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.

మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.

జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు కూడా తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు. బహుశా ఈయన పర్సులో కార్డులు తప్ప పనికొచ్చే సరుకు ఏమీ ఉండదని వాళ్లకు తెలుసేమో!

ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. వుండేది మామూలు కాలనీ కాబట్టి ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.

ఒక్క బతుక్కి, ఒక్క మనిషికి ఇన్ని కార్డులు అవసరమా!

ఈ కార్డుల పురాణం దేనికంటే, మాస్కోలో గుర్తింపు కార్డు లేకుండా రోజు గడవదు అని చెప్పడానికి.

నేను మాస్కో రేడియోలో చేరిన మొదటి రోజునే ఆఫీసువాళ్ళు మా కుటుంబంలో ఉన్న నలుగురికీ ప్రొపుస్కాలు (ఫోటో గుర్తింపు కార్డులు) తయారు చేసి ఇచ్చారు. వాటిని హమేషా దగ్గర ఉంచుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడతారనే హెచ్చరిక కూడా చేసారు. నేను నా పద్దతిలో ఆ హెచ్చరికను చాలా మామూలుగా తీసుకున్నాను.

ఇప్పుడు పరిస్తితులు ఎలావున్నాయో తెలియదు కానీ, నలభయ్ ఏళ్ళ క్రితం మేమున్న రోజుల్లో,  సోవియట్ యూనియన్ లో నిబంధనల అమలు చాలా ఖచ్చితంగా వుండేది. సంక్రాంతికి వచ్చే  గంగిరెద్దుల మీద కప్పే బట్టల మాదిరిగా చలి దుస్తులు ఒకదాని మీదొకటి వేసుకుని వెళ్ళే హడావిడిలో,  ఆ ప్రోపుస్కాను కోటులో ఏ జేబులో పెట్టుకున్నానో మరచిపోయేవాడిని. ఒక రోజు ఆఫీసు ప్రధాన ద్వారం దగ్గరే నన్ను నిలిపేశారు, ప్రొపుస్కా లేదని. అక్కడ వుండే గార్డులు నన్ను రోజూ చూస్తుండేవాళ్ళే. గుర్తు పట్టేంత పరిచయం వుండేది. అయినా లోపలకు పంపడానికి వాళ్ళు సుతరామూ ఒప్పుకోలేదు. వార్తలకు టైం అవుతోంది, నన్ను వెళ్ళనివ్వకపోతే ఇబ్బంది అవుతుందని సైగలతో చెప్పి చూసినా లాభం లేకపోవడంతో రిసెప్షన్ నుంచే కొంచెం కొంచెం తెలుగు తెలిసిన మా రష్యన్ సహోద్యోగి గీర్మన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతడు వెంటనే కిందికి వచ్చాడు. అతడి చేతిలో నేను తర్జూమా చేయాల్సిన వార్తలు, కొన్ని తెల్ల కాగితాలు బాల్ పాయింటు పెన్ను వున్నాయి. రిసెప్షన్ గదిలో ఓ కుర్చీలో కూర్చోబెట్టి పని చేసుకోమని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి ప్రొపుస్కా తెప్పించుకోమని సలహా ఇచ్చాడు. వార్తలకు సమయం ఆట్టే లేదని అంటే పర్వాలేదు, అవసరం అయితే నిన్నటి వార్తల రికార్డు వుంది, అంటాడు కాని నన్ను లోపలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి చెప్పి చూడమంటే, గీర్మన్ అటువైపు చూడమని సైగ చేశాడు. ద్వారం దగ్గర ఓ పొడవాటి పెద్దమనిషి నిలబడి తన ప్రోపుస్కా చూపించి లోపలకు వెడుతున్నాడు. అతడ్ని చూపుతూ గీర్మన్, ‘ఆయన ఎవరో తెలుసా! మన రేడియో మంత్రి. ఎవరైనా సరే రూలు రూలే’ అన్నాడు. నాకు పరిస్తితి అర్ధం అయింది. ఈ నిబంధనల పాటింపు చూస్తుంటే మెదడు మోకాల్లో వుంది అనే సామెత గుర్తుకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేటు దగ్గర వారికి గుర్తింపు కార్డు చూపాలి. రెండు మెట్లు దిగి ఏదైనా మరచిపోయి మళ్ళీ లోపలకు  వెళ్ళాలన్నా చూపించాలి. ఇప్పుడే కదా బయటకు వచ్చింది అంటే కుదరదు.

ఇక చేసేది లేక ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. మా ఆవిడే టాక్సీ వేసుకుని ఆఫీసు కు వచ్చి ప్రోపుస్కా నా చేతిలో పెట్టి అదే టాక్సీలో ఇంటికి పోయింది. ఇదంతా అయ్యేసరికి వార్తల సమయం ముంచుకు వచ్చింది. పైకి వెళ్లి స్టూడియోలో వార్తలు ఆ పూటకు మమ అనిపించేసరికి తలప్రాణం తోకకు వచ్చింది.

 

తోకటపా: ఒకరోజు  ఇంట్లో కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాను. కార్మికుల కార్యక్రమం మాదిరిగా ఆడామగా ఇద్దరు కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే ప్రోగ్రాములను మాస్కో రేడియో ప్రసారం చేసేది. ఆడ పాత్ర సంభాషణలు నాతో కలిసి లిదా స్పిర్నోవా చదివేది. దాని అనువాదం పని అన్నమాట నా హోం వర్క్.

పిల్లలు స్కూలుకు పోయారు. మా ఆవిడ కన్నడ రామకృష్ణ గారి భార్య సరోజ గారితో కలిసి ఏవో కొనడానికి బయటకు పోయింది. నేను ఆఫీసుకు వెళ్ళడానికి ఇంకా సమయం వుంది. ఆ సమయంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే,  ద్వారం ఎత్తు వున్న భారీ  మిలీషియా (పోలీసు), పక్కన మా రెండో పిల్లవాడు సంతోష్. అతడు ఏదో చెబుతున్నాడు. అర్ధం కావడం లేదు. ఈ లోగా మా ఆవిడా, సరోజ గారు తిరిగి వచ్చారు. చాలా రోజులుగా వుంటున్నారు కనుక ఆవిడకు కొంచెం రష్యన్ బోధపడుతుంది. పోలీసు చెప్పేదాన్ని విని మాకు ఇంగ్లీష్ లో తిరిగి చెప్పింది.

మా వాడు మెట్రో ఒకటి ఎక్కబోయి మరోటి ఎక్కాడట. దిగిన తర్వాత ఎటు పోవాలో తెలియక దిక్కులు చూస్తూ ఈ పోలీసు కంట పడ్డాడుట, జేబులో ప్రొపుస్కా ని బట్టి మా చిరునామా తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చి ఒప్పచెప్పాడు. ఇదీ కధ.

విడ్డూరంగా అనిపించే ఇలాంటి సంఘటనలు అక్కడ జరుగుతుంటాయి. అందుకే ప్రతి పనికి, అవసరానికి  ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు స్టేషన్ల గుమ్మం తొక్కాల్సిన అవసరం వుండదు.

ఎక్కడయితే, ప్రభుత్వ ప్రమేయం లేకుండా సామాన్యుడు తన నిత్య జీవితాన్ని గడపగలుగుతాడో అది ఉత్తమ ప్రభుత్వం, ఉత్తమ పరిపాలన  అనే భావన నాలో ప్రబలడానికి ఇదే కారణం.      

కింది ఫోటో :

రేడియో మాస్కో ప్రొపుస్కా (గుర్తింపు కార్డు)  కోసం తీయించుకున్న ఫోటో:



 

(ఇంకా వుంది)

           

కామెంట్‌లు లేవు: