25, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (126) – భండారు శ్రీనివాసరావు

 1991లో ఒక రోజు

మాస్కోలో ఆ సాయంత్రం తెలిసిన తెలుగు కుటుంబాలనన్నింటినీ భోజనానికి ఆహ్వానించాను. పిలిచిన వాళ్లందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. డిన్నరుకు సర్వం సంసిద్ధం. అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో ఫోను మోగింది. అవతల పీ.టీ.ఐ. మాస్కో విలేకరి.

ఆయన చెప్పింది చెవులో పడగానే రిసీవర్ చేతిలోనుంచి జారి పోయింది. ‘రాజీవ్ గాంధి ఈజ్ నో మోర్’

ఎక్కడో తమిళనాడులో చెన్నైకి దగ్గర్లో, సరిగ్గా  నోరు తిరగని పేరు కలిగిన ఒక వూళ్ళో బాంబు బ్లాస్ట్ జరిగింది. రాజీవ్ గాంధి అక్కడికక్కడే చనిపోయాడు.

వార్త తెలిసి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అన్నం ముడితే వొట్టు.

నేను హైదరాబాదు ఫోను చేసాను. రాజభవన్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు జ్వాలాకి. విషయం చెప్పకుండా అడిగాను ఏదయినా జరగరానిది జరిగిందా అని. ఏం లేదు అంతా బాగానే వుంది అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పాను. కాసేపటి తరువాత విన్న విషయం నిజమే అని నిర్ధారణ అయింది.

ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు ఇండియన్లా) అని అడిగింది. ఔనని చెప్పగానే మా ఆవిడను, పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రష్యన్ లో ఏమిటో అంటోంది. ఆ భాష కొద్దిగా తెలిసిన మా పిల్లలు చెప్పింది ఏమిటంటే, రాజీవ్ గాంధి చనిపోయాడని తెలిసి ఆమె తన దుఃఖాన్ని మాతో పంచుకుంటోంది. పరాయి దేశంలో వనిత, మన దేశంలో జరిగిన ఘోరానికి బాధ పడుతోంది. ఆవిడను చూసి మాకే సిగ్గనిపించింది.

మాస్కోలోనే కాదు, రష్యాలో చాలామందికి  తెలిసిన పేరు రాజ్ కపూర్. తర్వాత నటుడు జితేంద్ర.  వీరు నటించిన సినిమాలకు చాలా ఆదరణ వుండేది. మేము  మాస్కోలో వున్నప్పుడే భారతీయ ఉత్సవాలు జరిగాయి. వీటిల్లో మా భూమి నర్సింగరావు గారు తీసిన  రంగుల కల చిత్రం కాబోలు  ప్రదర్శించారు. అలాగే ప్రముఖ నాట్యకారిణి శోభానాయుడు గారి బృందం నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వారందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే కాదనకుండా వచ్చారు. నరసింగరావు గారి సోదరుడు కూడా వచ్చారు. సరే చాలామంది ఇండియన్ ఎంబసీ తెలుగు కుటుంబాల వాళ్ళు, కొంతమంది తెలుగు విద్యార్ధులు వచ్చారు. ముగ్గురు రాష్ట్రపతుల దగ్గర ప్రెస్ సెక్రెటరీ గా  సుదీర్ఘ కాలం పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు ఏదో పనిమీద మాస్కో వచ్చి ఆ రోజున మా ఇంటికి వచ్చారు. ఇలా పరిచయం అయిన వారెవ్వరూ తర్వాత కాలంలో  మమ్మల్ని మరచిపోలేదు.

ఇక సోవియట్ యూనియన్ మొత్తంలో మిహాయిల్ గోర్భచేవ్ తర్వాత, అంతంత సేపు రష్యన్ నేషనల్ టీవీ ఛానల్ పైన వారం వారం కనిపించే భారతీయుడు ఒకరున్నారు. ఆయన పేరు లక్ష్మణ్ కుమార్. అచ్చ తెలుగు పేరులా ధ్వనించే పేరున్న ఈ పెద్దమనిషి నిజానికి కన్నడిగుడు. మాస్కోలోని  భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. తొంభయ్యవ దశకం నాటికే భారతీయ యోగాకి రష్యాలో విశేషమైన ఆదరణ, గౌరవం ఉండేవి అంటే ఈ తరం వాళ్ళు నమ్మడం కష్టం. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ నలభయ్ ఏళ్ళ క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం  టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు ఈ లక్ష్మణ రావు గారు.  బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.

మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.

సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం. ఆయన కుటుంబం బెంగుళూరుకి, మేము హైదరాబాదుకి.  

మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన  లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ ఈ మధ్య కలిశాము మళ్ళీ హైదరాబాదులోనే. కాకపోతే మా ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.

ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది.  నాకు అప్పటికి  78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా  వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము.

తోకటపా

హైదరాబాదు డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు. 

కింది ఫోటోల్లో :

లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గ్రూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి  నాన్నగారు భారత సైన్యంలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో దౌత్యాధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా,  సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని  ప్రేమించుకుని మరీ  పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.








(ఇంకా వుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

రష్యా లో వున్న కాలం లో మీరేమన్నా అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసారాండీ ?