నా జీవితం మొదటి నుంచి వడ్డించిన విస్తరి కాదు, కానీ భగవంతుడి దయ వల్ల అన్నీ సమకూరేవి. ఒకరకంగా ఇదొక అదృష్టం. మరో రకంగా దురదృష్టం. నా ప్రమేయం లేకుండా జరిగిపోతూ వుండడంతో, నాలో బద్ధకం, బాధ్యతారాహిత్యం పెరిగిపోతూ వచ్చాయి. బిగ్ జీరో అవడానికి ఇవి ప్రధాన కారణాలు.
మాస్కో వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు వెళ్ళాల్సిన
మా ఆవిడను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. మాస్కోలో రూబుళ్ళ సంపాదనతో రారాజుగా
వెలిగిన నేను, రూపాయలు చేతలేకుండా నా భార్యకు, ఆ రోజుల్లో అంతవరకూ కనీవినీ ఎరుగని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాను అంటే అది నా సొంత
ప్రయోజకత్వం ఎంత మాత్రం కాదు.
అపోలో ఆసుపత్రి ప్రారంభించిన రోజులు. అక్కడ
అప్పటికి ఒకే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. చేసి రెండు వారాలు కూడా కాలేదు. ఆ
శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ సీతారామరెడ్డి గారు మా పెద్దక్కయ్య పెద్ద కుమారుడు
డాక్టర్ ఏపీ రంగారావు (తదనంతర కాలంలో 108, 104 పధకాల సృష్టికర్త) కు స్నేహితులు, సన్నిహితులు. అది హైదరాబాదులో కార్పొరేట్ తరహాలో
ఏర్పాటు చేసిన మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి. డాక్టర్
రంగారావుకు కార్పొరేట్ ఆసుపత్రుల పట్ల వైముఖ్యం. వైద్యం అనేది ప్రైవేటు వ్యక్తులు, వ్యవస్థల చేతుల్లో వుండకూడదు అని ఆయన సిద్ధాంతం. అంచేత
మా ఆవిడను ముందు గాంధీలో చేర్చాలని అనుకున్నాడు. కానీ సీతారామ రెడ్డి గారు బాగా
తెలిసిన వాడు కావడంతో ఆయన్ని సంప్రదిస్తే, తాను అంతకు కొద్ది రోజుల ముందు ఇదే
ఆపరేషన్ చేసిన ఒక రోగి ఇంటికి తీసుకు వెళ్ళారు. అప్పుడే ఇరవై ఏళ్ల యువతి మేడ మీద
నుంచి మెట్లు దిగుతూ, డాక్టర్ గారిని చూసి
నమస్కారం పెట్టింది. ఈ అమ్మాయికే నేను ఆపరేషన్ చేసింది అని పరిచయం చేశారు. అంటే తన
మీద నమ్మకం కుదరడానికి అది ఆయన ఎంచుకున్న పద్దతి అనిపించింది. అంతవరకూ ఆ డాక్టరు
గారు విదేశాలలో పనిచేసి వచ్చారు.
నేను ప్రస్తుతం
విదేశాల్లో పనిచేస్తున్నా కనుక, సీ జీ
హెచ్ ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వైద్య పధకం) నాకు వర్తించదు. మాస్కోలో ఇంతకంటే
పెద్ద ఆపరేషన్లు ఉచితమే కానీ, ఆపరేషన్ అక్కడ జరగలేదు. సొంత డబ్బులతో చేయించాలి. ఎలా? నాకు వెంటనే తట్టిన సమాధానం ఈ మధ్యనే మా ఆవిడ కొన్న గాజులను
బ్యాంకులో తాకట్టు పెట్టడం. ఆ పనిచేసి ఎనిమిదివేలు తెచ్చాను. అయితే అది ఏ మూలకు?
అయితే ‘ఈ ఎలా?’ అనే ప్రశ్న వేసుకున్నది, సమాధానం రాబట్టింది నా మిత్రుడు జ్వాలా నరసింహారావు. ఆయనా డబ్బు విషయాల్లో నాలాంటి కుచేలుడే. అయినా
అవసరానికి డబ్బు పుట్టించగలడు. సర్కిల్ పెద్దది. ఆపరేషన్ కు మొత్తం ఎంత అయిందో, దాన్ని ఎవరు కట్టారో నాకిప్పటికీ పూర్తి వివరాలు తెలియవు. తరువాత
కాలంలో కొంత తీర్చినట్టు గుర్తు. పూర్తిగా తీర్చానో లేదో గుర్తు లేదు. పెద్దలు
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారి మాట సాయంతో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది
కంటికి రెప్పలా కనిపెట్టి చూసుకున్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి బావమరిది వెంకటరెడ్డి
గారితో ఖమ్మంలో పరిచయం. అదికూడా
ఉపయోగపడింది. మాకందరికీ ఆసుపత్రి పక్కనే వున్న గెస్టు హౌస్ ఇచ్చారు. కాఫీ టిఫిన్లు, భోజనాలు కేంటీన్ లో.
ఆ రోజుల్లో జూబిలీ
హిల్స్ అపోలో ఆసుపత్రి ఊరికి దూరంగా విసిరేసినట్టు వుండేది. చెక్ పోస్ట్ అవతల ఏమీ
లేదు. ఎటు చూసినా పంట పొలాలు. సరైన రహదారి వుండేది కాదు. నందమూరి బాలకృష్ణ గారి
ఇంటి తరువాత ఇళ్ళ నిర్మాణాలే లేవు. ఆటో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా హైరాణా
ప్రయాణం. హైదర్ గూడాలోని అపోలో నుంచి
గంటకో రెండు గంటలకో ఆసుపత్రి వారే ఉచిత షటిల్ బస్సు సర్వీసు నడిపేవారు రోగుల బంధువుల కోసం. అందులో
పడి వెళ్ళేవాళ్ళం.
ఆపరేషన్ రోజున
ఖమ్మంనుంచి, బెజవాడ నుంచీ బంధువులు
అనేకమంది వచ్చారు. ఇక హైదరాబాదులో వున్న వారి సంగతి చెప్పనక్కర లేదు. వారితో
ఆసుపత్రి కిటకిటలాడింది. ఎవరైనా ఉచితంగా రక్తం ఇస్తారా అని అడిగితే, ఆ రోజు మా
వాళ్ళు అందరూ క్యూలో నిలబడి రక్తదానం
చేశారు. వందకు మించి రక్తం ఇచ్చారని ఆసుపత్రి వాళ్ళు చెప్పారు.
మా ఆవిడకి ఆసుపత్రి
దుస్తులు వేసి ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకువెడుతుంటే, గుండెతో పని అని భయపడుతుందేమో అని నేను భయపడ్డాను. కానీ ఆమెలో
ఎలాంటి ఆందోళనా కానరాలేదు. కాకపోతే, వెడుతూ వెడుతూ, మళ్ళీ చూస్తానో లేదో అన్నట్టు నా వైపు తేరిపార చూసింది. గాజులు లేని చేతితో నా చేయి మెల్లగా
నొక్కి వదిలేసింది.
ఒకటి కాదు, రెండు కాదు కొన్ని గంటల పాటు జరిగింది ఓపెన్ హార్ట్
సర్జరీ. ఇప్పుడంటే ఇలాంటి ఆపరేషన్లు త్వరత్వరగా
చేసేస్తున్నారు.
ఆపరేషన్ పూర్తయిన తర్వాత
డాక్టర్ సీతా రామారెడ్డి గారు చెప్పారు, బాగా జరిగిందని. అందరం ఊపిరి పీల్చుకున్నాం. మూడు రోజుల
తర్వాత అపోలో హాస్పిటల్ పైన ఖాళీ జాగాలో నడిపించారు. (ఇప్పుడు ఆ ఖాళీ జాగా లేకుండా
నిర్మాణాలు చేశారు)
పద్దెనిమిది రోజుల
తర్వాత అనుకుంటా డిస్ చార్జ్ చేశారు. కానీ వెంటనే విమాన ప్రయాణం మంచిది కాదని
చెప్పారు. దాంతో నెల అనుకుని వచ్చిన ప్రయాణం మూడు నెలలు వాయిదా పడింది. మా పిల్లలు
స్కూలు పోతోందని అనుకున్నారు కానీ, తప్పని సరి పరిస్థితి.
కింది ఫోటో:
ముప్పయ్ అయిదేళ్లకు
పూర్వమే మా ఆవిడ నిర్మలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ బి.
సీతారామారెడ్డి గారు
ఆపరేషన్ విజయవంతం అయి
మేము మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత మాస్కోలో ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ లో
డాక్టర్లు ఆవిడను పరీక్షించి ఇంత గొప్పగా మాదగ్గర కూడా చేయలేమో అని అనడం చాలా
ఆనందం అనిపించింది. మాస్కో నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత, దంపతులం ఇద్దరం అపోలో
ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ గారిని కలిశాము.
మాస్కో వైద్య నిపుణులు ఆయన గురించి చేసిన
ప్రశంసను ఆయన చెవిన వేశాను. ఎంత
సంతోషించారు అంటే మా ఆవిడను వెంటబెట్టుకుని తోటి డాక్టర్లకు చూపించి, చూశారా ఈవిడకే నేను
పాతికేళ్ళ నాడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాను, ఎంత ఆరోగ్యంగా వుందో చూస్తున్నారు కదా! అని చెప్పుకుని
మురిసిపోయారు. తాము చికిత్స చేసిన రోగులు బాగా వున్నారు అని తెలుసుకున్నప్పుడు
డాక్టర్లలో కలిగే ఆనందాన్ని ఆనాడు డాక్టర్ సీతారామారెడ్డి కళ్ళలో నేను చూడగలిగాను.
(ఇంకావుంది)
1 కామెంట్:
// “ అంతవరకూ ఆ డాక్టరు గారు విదేశాలలో పనిచేసి వచ్చారు.” //
అద్గదీ సంగతి. అందుకేనేమో డాక్టర్ గారి పద్ధతి విభిన్నంగా ఉండింది 👏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి