ఎత్తైన భవనం నుంచి ఒక రాయిని కిందికి పడేసినప్పుడు, అది భూమిని చేరే కొద్దీ మరింత వేగాన్ని పుంజుకుంటుందని అంటారు.
అలాగే సోవియట్ యూనియన్
లో దశాబ్దాల తరబడి స్తబ్దుగావున్న పరిస్థితుల్లో మార్పు మెల్లగా మొదలై, రోజులు గడుస్తున్న కొద్దీ విస్తారమై, సాధారణ జనజీవితంలో
పెను మార్పుగా పరిణమించింది. మేము వెళ్ళిన కొత్తల్లో మొదటి రెండేళ్లు క్యూలు వున్నా కూడా దుకాణాల్లో సరుకులు కానవచ్చేవి. ఉదాహరణకు మా
ఇంటికి దగ్గరలో, రోడ్డు దాటగానే ఎదురుగా వున్న ప్రోదుక్తి (పాల ఉత్పత్తుల దుకాణం) లో పాలు, పెరుగు (కీఫీర్), వెన్న, ఐస్ క్రీమ్స్, జున్ను మొదలైనవి ఎప్పుడు వెళ్ళినా పుష్కలంగా దొరికేవి. పోయిన కొత్తల్లో ఎప్పుడు
అవసరమైనవి అప్పుడే కొనుక్కుండేవాళ్ళం. కాలు బయట పెట్టిన ప్రతిసారీ ఎలుగుబంటి
దుస్తులు ధరించలేక వెళ్ళినప్పుడే అవసరానికి మించిన పాలూ, వెన్నా కొనేవాళ్ళం. ధర తక్కువ కావడం ఇందుకు ఒక కారణం. కొంతకాలం
తర్వాత క్యూలు మొదలయ్యాయి. దుకాణంలో వున్న సరుకంతా ఎవరు ముందు
వస్తే వారికి, ఎంత అడిగితే అంతా అమ్మేవాళ్లు. దాంతో క్యూలో వెనుక వున్నవాళ్ళు, ఒక్కోసారి
ఖాళీ చేతులతో వెనక్కి మళ్ళాల్సివచ్చేది.
అలాకాకుండా, దుకాణంలో వున్న సరుకుని, కొనడానికి వచ్చిన వాళ్ళను బేరీజు వేసుకుని మనిషికి
ఇన్ని అని అమ్మితే అందరికీ సరిపోయేవి. ధర
తక్కువ కావడంతో అవసరం వున్నా లేకపోయినా ఎక్కువ కొనేవారు. అవన్నీ చివరికి వృధాగా
డస్ట్ బిన్ పాలయ్యేవి. ఇలాగే ప్రతి
నిత్యావసర వస్తువుకు కృత్రిమ కొరత ఎదురయ్యేది.
దీనికి తోడు గోర్భచేవ్, పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్
నోస్త్ ( ఓపెన్ నెస్, బహిరంగత్వం, దాపరికం
లేకపోవడం) అనే సిద్ధాంతాలు క్రమంగా జనంలోకి చొచ్చుకుపోయాయి. ఏదైనా గట్టిగా
అడగొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చు అనే ధీమా సామాన్య ప్రజల్లో కూడా పెరిగింది.
ఎంతవరకు అంటే మాస్కో రేడియో సహోద్యోగి
విక్టర్ చెప్పినట్టు, ‘ప్రధాని గారూ, మీరు మొన్న ఒక కార్యక్రమంలో బూట్లు సాక్స్ తో కనబడ్డారు, వాటిని ఎక్కడ కొన్నారో చెబుతారా?’ అంటూ పత్రికలకు లెటర్స్ టు ది ఎడిటర్ కాలమ్ కు బహిరంగ ఉత్తరాలు రాసేటంతగా అంటే ఇక అర్ధం
చేసుకోవచ్చు, అధికారానికి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే గోర్భచేవ్, నోరు విప్పి మాట్లాడడానికి భయపడే రష్యన్ ప్రజానీకానికి తన చేతల ద్వారా, మాటలద్వారా ఏ స్థాయిలో స్వాతంత్రం ఇచ్చాడో. కనీవినీ ఎరుగని
మార్పుల్లో ఇది ప్రధానమైనది. ఈ రెండు పదాలు నిజానికి ఎప్పటి నుంచో వాడుకలో వున్న
పదాలే. కాకపోతే, గోర్భచేవ్ తన ప్రసంగాలతో వీటికి ప్రపంచవ్యాప్త
ప్రాచుర్యం కల్పించిన మాట వాస్తవం.
నేను వెళ్ళిన మొదటి
రెండేళ్లలో మెట్రోలో మౌనంగా కూర్చుని, పుస్తకాలు, పేపర్లు చదువుతూ ప్రయాణించే రష్యన్లు, క్రమక్రమంగా
నోళ్ళు విప్పి పక్క వారితో గుసగుసలు మొదలుపెట్టడం ఆరంభం అయింది. దశాబ్దాలుగా
గూడుకట్టుకుని వున్న భయాలు వారిలో తొలగిపోతున్నాయి అనడానికి ఇది సంకేతం. చోటు
చేసుకుంటున్న పరిణామాలు జీర్ణం చేసుకోలేని విక్టర్ వంటి వాళ్ళు బహిరంగంగానే తమలోని
అసంతృప్తిని వెళ్ళగక్కేవారు. గోర్భచేవ్ సంస్కరణలతో విబేధించి మాట్లాడే
తెలుగువారిలో ఆర్వీయార్ ప్రధములు. అంతవరకూ
ఇనుపతెరల వెనుక దేశంగా (రావూరి భరద్వాజ
గారు రష్యా సందర్శించిన అనంతరం రాసిన తన అనుభవాల గ్రంధానికి ఈ పేరు పెట్టారు)
వున్న సోవియట్ యూనియన్, గోర్భచేవ్ హయాములో
తలుపులు, కిటికీలు
బార్లా తెరిచిన సౌధంగా మారిపోయింది. రష్యన్లకు బయటి ప్రపంచాన్ని కళ్ళారా చూసే
అవకాశం లభించింది. తమ దేశంలో తమ రోజువారీ జీవనం హాయిగా గడవడానికి అన్ని వసతులు
వున్నప్పటికీ, బయటి ప్రపంచంలో తమకు లేనిది ఏమిటో కనిపించి దానికి ఆకర్షితులు
అయ్యారు. మానవ ప్రవృత్తి అలాంటిది. లేనిదాని కోసం తాపత్రయ పడడం మనిషి స్వభావంలోనే
వుంది.
డబ్బుకు ఎవరికీ ఇబ్బంది
లేదు. వున్నదల్లా, దానితో కొనుక్కోగల
వస్తువుల కొరత. నిజానికి ఆ కొరతలకు కారణం తామే అన్న గ్రహింపు లేకపోవడమే విషాదం.
పలానా చోట పలానా వస్తువు దొరుకుతోందని అక్కడ
కొన్న వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ముఖ్యంగా భారతీయ
కుటుంబాల్లో ఈ పద్దతి గమనించాను. ఫోను మాట్లాడుతూ మాట్లాడుతూ, మా ఆవిడ వున్నట్టుండి
ఫోను పెట్టేసి బయటకు వెళ్ళే కోట్లు, బూట్లు తగిలించుకుని సంచీ చేతబట్టుకుని బయలుదేరేది.
అక్కడెక్కడో షాపులో ఇండియన్ బియ్యం
దొరుకుతున్నాయని త్రిలోచనగారో మరొకరో తెలిసిన వాళ్ళు చెప్పేవారు. అంతే! కన్నడ సరోజ
గారిని వెంటతీసుకుని, మెట్రోలోనో, టాక్సీలోనో అక్కడకు నేరుగా వెళ్ళిపోయేది. అదృష్టం వుంటే
బియ్యం దొరికేవి. లేకపోతే దారిలో దొరికిన క్యూబా అరటి పండ్లో, మరొకటో కొనుక్కుని ఇంటికి చేరేది.
క్యూబా రష్యాకు మిత్రదేశం.
అంచేత, క్యూబాకు ఓడలలో
పెట్రోలు సరఫరాచేసి బదులుగా అరటి పండ్లు దిగుమతి చేసుకునేవారు. దేశం ఆర్ధిక
సంక్షోభంలో కూరుకుపోవడానికి, అలవికి మించి
మిత్ర దేశాలకు చేసే ఇలాంటి సాయాలు కూడా ఒక కారణం అనే అభిప్రాయం వుండేది.
ఇండియన్ బియ్యం గురించి
ఒక జోకు చెప్పుకునేవారు.
ఇండియన్ ఎంబసీకి కొత్తగా
వచ్చిన ఓ అధికారి, ఉదయం పది గంటలకు తన సిబ్బందితో మీటింగు పెట్టుకున్నారు.
ఆయన దగ్గర పనిచేసే ఒక చిన్న అధికారి మీటింగుకు ఆలస్యంగా వచ్చారు. పెద్ద అధికారికి
కోపం వచ్చింది. ఆలస్యానికి కారణం ఏమిటి అని పెద్దఅధికారి చిన్నఅధికారిని పెద్దగానే
గద్దించి అడిగారు. చిన్న అధికారి నోరు పెగుల్చుకుని చిన్నగా చెప్పాడు. ఆఫీసుకు వస్తుంటే దారిలో... అని
నసిగాడు.
‘దారిలో ఏమైంది?’ పెద్ద అధికారి గాండ్రింపు లాంటి ఝాడింపు.
‘దారిలో వస్తుంటే....ఒక షాపులో బియ్యం అమ్మడం కనిపించింది. వెంటనే వెళ్లి
కొనుక్కున్నాను’
చిన్న అధికారి వాక్యం
పూర్తికాకముందే, మీటింగుకు సకాలంలో వచ్చిన వాళ్లందరూ పొలోమని ఆ షాపుకు జంపు.
ఇది జోక్ కావచ్చు కానీ,
ముందు ముందు ముంచుకు రాబోతున్న మార్పులకు అద్దం పట్టేదిగా నాకు అనిపించింది.
ఉన్నట్టుండి ఒక రోజు
మెట్రో టిక్కెట్టు ధరను అయిదు కోపెక్కుల నుంచి పది కోపెక్కులకు అధికారికంగా
పెంచారు. దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా వుంటున్న ధరవరలు ముందు ముందు పెరగబోతున్నాయి
అనడానికి ఇది ఒక సూచిక.
కింది ఫోటో:
మాస్కోలో మహాత్మా గాంధి విగ్రహం వద్ద ఇండియన్ స్కూల్ విద్యార్ధులు, నల్లకోటులో వున్నది మా పెద్దవాడు సందీప్, వారిపక్కన ఇండియన్ ఎంబసీలో పనిచేసే దౌత్యాధికారి కేవీ రమణ గారి భార్య శ్రీమతి త్రిలోచన
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి