27, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (128) – భండారు శ్రీనివాసరావు

 

“కామ్రేడ్! భండారు!  మీకు మాస్కో రేడియో తరపున కృతజ్ఞతలు”

నా ఎదురుగా కుర్చీలో కూర్చుని ఈ మాటలు చెబుతున్న మనిషిని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్ని  ఆఫీసు క్యాంటీన్ క్యూలో చాలాసార్లు చూశాను. లావుగా ఎత్తుగా తెల్లటి శరీర ఛాయతో బలిష్టంగా ఫుల్ సూటులో  వున్న ఆ వ్యక్తి,  రేడియో మాస్కో విదేశీ విభాగానికి అత్యున్నత అధికారి అని ఆ రోజే తెలిసింది.

రోజూ వెళ్ళినట్టే ఆ రోజూ ఆఫీసుకు వెళ్లాను. సగం బోసిపోయినట్టు అనిపించింది. గీర్మన్ వచ్చి మన డైరెక్టర్ మిమ్మల్ని చూద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు వస్తే మీకు  పరవాలేదా అని మన్ననగా అడిగాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు మనమే వెడదాం అన్నాను గీర్మన్ తో. అయితే పదండి అని తీసుకు వెళ్ళాడు. మేము పనిచేసే అంతస్తులోనే వుంది ఆయన గది. గది ముందు  బంట్రోతులు కానీ  పియ్యేలు కానీ ఎవరూ లేరు. లోపల చిన్న గదిలో ఆయన కూర్చుని వున్నారు. మాకు ఎలాంటి కుర్చీలు, బల్లలు వుండేవో ఆయనకు అలాంటివే వుండడం చూసి ఆశ్చర్యపడ్డాను. తేడా ఏమీ లేదు. బెల్లు కొడితే వచ్చే ప్యూను లేడు. వ్యక్తిగత సిబ్బందీ లేరు. మేము వెళ్ళగానే ఆయన లేచి నిలబడి చాలా మర్యాదగా కరచాలనం చేశారు.

ఆయన రష్యన్ లో మాట్లాడుతుంటే గీర్మన్ దాన్ని తెలుగులోకి, నేను చెప్పే  మాటలను రష్యన్ లోకి అనువాదం చేస్తూ పోయాడు.

‘చాలా ఏళ్ళుగా మా రేడియోలో పనిచేస్తూ వచ్చారు. అదీ మాకు సంతృప్తికరంగా. మీరు ఇన్ని రోజులు ఇక్కడ సుఖంగా వున్నారని నేను అనుకుంటున్నాను

‘అవునండి, ధన్యవాదాలు

‘కొన్ని కారణాల వల్ల తెలుగు విభాగాన్ని ఈ రోజుతో మూసి వేస్తున్నాము. నిజానికి చివర్లో మూసి వేస్తున్నది మీ విభాగాన్నే. తెలుసు అనుకుంటాను. రేపటి నుంచి మీరు రానక్కరలేదు. మీ అపార్ట్ మెంటు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నాళ్ళు వుండాలన్నా ఉండవచ్చు.   మీరు మీ కుటుంబంతో తిరిగి ఇండియా వెళ్ళడానికి మా వాళ్ళు మీకు అన్నివిధాలుగా సాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్!’

అన్నాడు మళ్ళీ చేతులు కలుపుతూ.

ఈ రోజుతో మీ ఉద్యోగం సరి అని చెప్పడం ఇంత సింపుల్ గా వుంటుందని నేనెప్పుడూ ఊహించలేదు.

ఆ రోజు ఆఖరి బులెటిన్ చదివి వెళ్ళాలి. నేను వెళ్ళే సరికి అనువాదం చేయాల్సిన వార్తలతో పాటు నా పేరు రాసి వున్న ఒక కవర్ పెట్టి వుంది. నాకు రావాల్సిన జీతం, ఇతర అలవెన్సులు, మూడు నెలల అడ్వాన్స్ తో పాటు, అన్నీ కోపెక్కులతో సహా లెక్క కట్టి ఇచ్చారు.

రేడియోలో చేరిన కొత్తల్లో ఒక జీతాల రోజున  నేను వెళ్ళలేదు. మరునాడు సెలవు. ఆ మరునాడు మధ్యాన్నం ఆఫీసుకు వెళ్లాను. నా జీతం కవరులో పెట్టి బల్ల మీద కనిపించింది. అదేమిటి అని అడిగితే, విక్టర్ చెప్పాడు, మరో పదిహేను రోజులు ఆగి వచ్చినా ఆ కవరు అలాగే అక్కడే  వుంటుంది అని.

మధ్యాన్నం బులెటిన్ రికార్డు చేసిన తరువాత విక్టర్, గీర్మన్, లిదా స్పిర్నోవా, నటాషా లను తీసుకుని రేడియో భవనం దగ్గరలో వున్న ఒక రెస్టారెంట్ కి వెళ్లి, అక్కడ బీర్లు తాగి, ఐస్  క్రీమ్స్ తిని ఆఫీసుకు వచ్చాము. మొదట్లో ఈ బీరు ఆఫీసులోనే దొరికేది. తర్వాత తర్వాత సంస్కరణల ప్రభావమో ఏమిటో తెలియదు, ఆఫీసుల్లో బీర్ల అమ్మకాలు నిలిపి వేశారు. అయితే బస్ స్టాపుల్లో అయిదు కోపెక్కులు వేస్తే గ్యాలన్ బీరు కొనుక్కునే కియోస్క్లులు ఉండేవి. చాలామంది అంత చలిలో కూడా మన దగ్గర మంచి నీళ్ళ వాటర్ క్యాన్ల వంటి క్యాన్లు నింపుకుని, రోడ్డు మీదే నిలబడి  బీరు తాగడం చాలా సార్లు చూశాను. వీరిలో మహిళలే ఎక్కువ. సిగరెట్లు తాగడంలో కూడా వారిదే పై చేయి. నా దగ్గర ఎప్పుడూ వుండే ఇండియా కింగ్స్ పెద్ద ప్యాకెట్లు రెండు  నటాషాకు ఇస్తే చాలా సంతోషపడింది.

ప్రతి రోజూ సాయంత్రం వార్తలు ముగించేటప్పుడు, ఈరోజు తెలుగులో వార్తలు ఇంతటితో సమాప్తం అనడం మామూలు.  ఆ రోజు కాస్త స్వేచ్ఛ తీసుకుని, మాస్కో రేడియో నుంచి తెలుగులో వార్తలు ఈ రోజుతో పూర్తిగా సమాప్తం అని చదివాను. బయటకి వచ్చిన తరువాత గీర్మన్,  విన్నాను సుమా అన్నట్టు కన్ను గీటి చిన్నగా నవ్వాడు.  

మాస్కో జీవితం ముగింపుకు రాబోతోందని ముందరి నుంచే తెలుసు కాబట్టి ఇంట్లో ఎవరం కూడా పెద్దగా ఆందోళన పడలేదు.  

అప్పటికే ఇండియన్ ఎంబసీ పనిచేస్తున్న తెలుగు దౌత్యాధికారుల్లో ఒకరైన కేవీ రమణ గారు కుటుంబంతో సహా ఇండియా  వెళ్ళిపోయారు. అలాగే నేవీ దౌత్యాధికారులు పరకాల సుధీర్, దాసరి రాము, రెడ్డి గార్ల పదవీ కాలం కూడా పూర్తయింది.  ఆ సమయంలో మరో తెలుగు యువ ఐ ఎఫ్ ఎస్ అధికారి రమేశ్ చంద్ర మాస్కో ఎంబసీలో పనిచేయడానికి వచ్చారు. అప్పటికి వారికి వివాహం కూడా కాలేదు. అంచేత తరచుగా మా ఇంటికి వస్తుండేవారు. రమేశ్ చంద్ర విషయానికి వస్తే, తరువాత అనేక దేశాల్లో భారత రాయబారిగా పనిచేసి, చివరకు నిరుడు నవంబరులో అనుకుంటా, భారత విదేశాంగ శాఖలో అదనపు  కార్యదర్శిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం భార్య శ్రీమతి కాత్యాయని, ఇద్దరు ఆడపిల్లలతో బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారి అన్నగారు ఆకెళ్ళ పేరి శివకుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఫేస్ బుక్ మితృలు కూడా. (రమేశ్ చంద్ర గారి గురించి మరికొంత వివరంగా తరువాత రాస్తాను. ఎందుకంటే  తెలుగు కుటుంబాలు అన్నీ స్వదేశం తరలిపోయిన తర్వాత మాస్కోలో మిగిలింది మేమిద్దరమే) అలాగే మరో ఐ.ఎఫ్.ఎస్. అధికారి గీతేష్ శర్మ కొత్తగా మాస్కో వచ్చారు.  ఇండో టిబెట్ సరిహద్దు దళాల డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన రామకృష్ణారావు (వీరు చాలా కాలం హైదరాబాదులో కూడా పనిచేశారు, అప్పుడు పరిచయం) గారి అల్లుడు. మాస్కో  తరువాత గీతేష్,  జర్మనీ వంటి అనేక దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. నాలుగేళ్లు  స్టేట్ బ్యాంక్ మాస్కో అధికారిగా పనిచేసిన  వై.రాదాకృష్ణ (వై.ఆర్.కె.)  ఆయన భార్య తత్వమసి  స్వదేశానికి వెళ్ళిపోయారు. తర్వాత రోజుల్లో ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. 

 

కింది ఫోటో:

ఉద్యోగాలకోసం మాస్కో వెళ్లి అనుకోకుండా కలిసి, మిత్రులుగా కలిసి మెలిసి తిరిగి, తిరిగి ఇండియా వచ్చిన తర్వాత కూడా మాలో కొందరం అప్పుడప్పుడు, హైదరాబాదులో  కలుస్తూనే వున్నాం. అలా

ఆరేళ్ళ కిందట, 32 ఏళ్ళ తర్వాత మాస్కో బ్యాచ్ లో కొందరం మళ్ళీ కలిశాము.

ఫోటోలో  ఎడమవైపు నుంచి:

శ్రీ గీతేష్ శర్మ, ఆస్ట్రేలియాలో భారత రాయబారి, శ్రీ కే.వీ.రమణ, మాస్కో ఇండియన్ ఎంబసీలో ఫస్ట్ సెక్రటరీ (స్టీల్), రత్నా గీతేష్ శర్మ, , కమొడోర్ సుధీర్ పరకాల, కమాండర్ దాసరి, (మాస్కో ఇండియన్ ఎంబసీ), భండారు శ్రీనివాస రావు అనే నేను  (రేడియో మాస్కో), సురేష్ బాబు (ఆర్మీనియా, జార్జియా, మంగోలియాలో భారత రాయబారి) శ్రీమతి క్షేమ సురేష్ బాబు)



సందర్భం, సన్నివేశం:

2019 లో గీతేష్, రత్నల కుమార్తె మానస, అర్జున్ గర్గ్ ల పెళ్ళి రిసెప్షన్ హైదరాబాద్ లో.

 

(ఇంకా వుంది )

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

స్టేట్ బ్యాంక్ వై.ఆర్.కె గారు తమిళులు. మీరు రాధాకృష్ణ అని వ్రాసారు. వారి పేరు రాధాకృష్ణ/న్/. వారి భార్య తెలుగువారే.

ITBF కమాండర్ రామకృష్ణారావు గారితో (DVLN రామకృష్ణారావు అని జ్ఞాపకం) నాకు /స్వల్ప పరిచయం/ ఉండేది 1970 ల్లో. అప్పట్లో వారిది హైదరాబాద్ లో పోస్టింగ్. ISCUS (Indo-Soviet Cultural Society) వారు రష్యన్ భాష కోర్సు సాయంత్రం క్లాసులు హిమయత్ నగర్ లో నిర్వహించేవారు. దానిలో జేరాను (సగంలో మానేసాను. జీవితంలో చాలా పనులు అలాగే అసంపూర్తి గానే వదిలేసాను లెండి 😒). ఆ కోర్సులో రామకృష్ణారావు గారు మా క్లాస్ మేట్ 🙂. ఆ పరిచయం అక్కడితోనే ఆగిపోయింది లెండి. మీలాగా పరిచయాల్ని చాలా కాలం కొనసాగించడం / టచ్ లో ఉండడం నాకు అవలేదు 😒.

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ ప్రశ్న "న్" రాలేదనా ? :)