19, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో ( 120 ) – భండారు శ్రీనివాసరావు

 ‘మీరు ఈ సారి వేసవి సెలవుల్లో ఎక్కడికి వెడదామని అనుకుంటున్నారు?’ అని ఒక రోజు గీర్మన్ అడిగాడు.

అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందంటారు. నాకు చాలా సార్లు తట్టింది. అయితే ఏం లాభం, జన్మతః వచ్చిన కొన్ని అలవాట్లు నన్ను చాలా అదృష్టాలకు దూరం చేశాయి. 

రేడియో మాస్కోలో పనిచేసేవారికి ఏటా ఒక నెల రోజులు సెలవులు వుంటాయి. వాటిని ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రతి మనిషికి తగినంత విశ్రాంతి వుండాలి అనే కోణంలో ఆలోచించి పెట్టిన నిబంధన అది. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో ముందుగా చెబితే, దానికి తగ్గట్టుగా ప్రయాణపు ఏర్పాట్లు, వసతి సదుపాయాలు అన్నీ ఆఫీసు  వాళ్ళే చేస్తారు.

విదేశీయులతో సహా చాలామంది నల్ల సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుకోవడానికి ఇష్టపడతారు. బోటు షికార్లు, సముద్రంలో ఈతలు వీటితో కాలక్షేపం చేస్తారు. సముద్ర తీరంలో దాచా (గెస్ట్ హౌస్ ) ల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. మనం చేయాల్సింది అల్లా వాళ్లకు ముందస్తుగా తేదీలు ఇవ్వడమే. మిగిలినవన్నీ వాళ్ళే చూసుకుంటారు.  మా పిల్లలు కూడా మొగ్గు చూపారు. కానీ  నా భోజన అలవాట్లు తెలిసిన మా ఆవిడ, అన్ని రోజులు మీరు అక్కడ వుండలేరు అనడంతో మా సెలవు రోజుల్ని హైదరాబాదులో గడపడానికి నిశ్చయించాము. 

ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే ఒకళ్ళు ఇద్దరు అపరిచితులు కలిసి,  మీ దగ్గర రష్యన్ బ్రీడ్  పెట్స్  వున్నాయా, బ్లూ కలర్   టీ సెట్స్ వున్నాయా, చెక్ కట్ గ్లాసులు వున్నాయా  అని వాకబు చేయడం చూసి,  మాస్కోలో ఒక స్టూడెంట్ చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. మాస్కోలో కుక్కపిల్లలు  అమ్మే సంతలు జరుగుతాయి. కుక్క కూనల తల్లి, తండ్రి వివరాలు, వాటి  గోళ్ళు, మచ్చలు   ఇలా అనేక వివరాలతో కూడిన ఒక చిన్న పుస్తకం లాంటిది వాటితో పాటే  ఇస్తారు. వాటిని బట్టి ఢిల్లీలో రేట్లు వుంటాయి. ఒక జత కుక్క పిల్లలని అక్కడ ఓ పాతిక ముప్పయి రూబుళ్ళకు కొనుక్కుని ఢిల్లీ తీసుకువస్తే ( ఏరో ఫ్లోట్ లో వాటికి చార్జి కూడా వుండదు) ఒక్కొక్కటి పదివేలకు కొనుక్కు పోతారట.  

అలాగే రష్యాలో తయారైన నీలం రంగు  పింగాణీ టీ సెట్లకు కూడా బయట దేశాల్లో చాలా గిరాకీ. 

మాస్కో పొలిమేరల్లో పింగాణీ  సామాగ్రి తయారు చేసే ఫాక్టరీకి ఒకరోజు రేడియో వాళ్ళే బస్సులు పెట్టి కుటుంబాలతో సహా తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడూ విదేశీ ఉద్యోగులని ఇలా తిప్పుతుంటారు. అక్కడ రకరకాల పింగాణీ వస్తువులు తయారు చేస్తున్నారు. మాతో  వచ్చిన వాళ్ళందరూ డజన్ల లెక్కలో కొన్నారు. రష్యన్లు వాళ్ళ ఆకారానికి తగ్గట్టు పెద్ద పెద్ద కప్పుల్లో టీ తాగుతారు. మా ఇంట్లో ఎవరికీ అంత పెద్ద కప్పుల్లో తాగడం అలవాటు లేదు. అందుకని పది రూబుళ్ళు పెట్టి  ఒక సెట్టు కొనుక్కుని తెచ్చుకున్నాము. తరువాత మా ఇంటికి వచ్చిన ఒక పెద్దమనిషి అవి చూసి, ఇవెక్కడ దొరికాయి, ఒక్కొక్క  సెట్టు ధర వేలల్లో వుంటుంది అని చెప్పేవరకు మాకు వాటి ధర తెలియదు. అయినా డ్రాయింగు రూము షో కేసులో వుండేవాటి  ధర ఎంతయితే ఏమిటి? అది మారుబేరాల వాళ్ళ పని.    

ఢిల్లీలో రాయపాటి సాంబశివరావు గారు పంపిన కారులో వారి   బంగళాకి వెళ్ళాము. ఆయన లేరు. కానీ ఆయన  పియ్యే  సజ్జీ మమ్మల్ని బాగా కనుక్కున్నారు. చిన్ని చిన్ని ఉల్లిగడ్డలు వేసిన చక్కటి వేడి వేడి సాంబారుతో  భోజనం.  సరే, దానికి ముందు షరా మామూలుగా అతిధులకి చేసే మర్యాదలు.  కారులో మా పిల్లలని   ఢిల్లీ నగర వీధుల్లో అటూ ఇటూ తిప్పి,  మమ్మల్ని  మళ్ళీ మర్నాడు హైదరాబాదు ఫ్లయిట్ ఎక్కించాడు. 

అప్పుడు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు ఇద్దరూ హైదరాబాదు లోనే వున్నారు. ఆ నెల రోజుల్లో చాలా తిరిగాము. బరంపురం ( మా ఆవిడ పుట్టిల్లు కాదు కానీ, వాళ్ళ అమ్మగారి అక్కయ్య కూతురు అక్కడ వుండేది. మా ప్రేమ పురాణం నడిచే రోజుల్లో,  కొన్ని నెలలు నా నుంచి దూరంగా వుంచడానికి మా ఆవిడను బరంపురం పంపించారు)  వెళ్లి,  అక్కడ రెండు రోజులు వుండి విశాఖపట్నం వెళ్ళాము. స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడి అటో వాళ్ళు ఎక్కడికి, ఎంత అని అడగకుండా వుండడం చూసి,  ముచ్చటేసింది. అక్కడి పోలీసు సూపర్నెంట్ రామస్వామి ఐ పి ఎస్. (అప్పటికి కమిషనర్ల వ్యవస్థ లేదు) ఆయనకి ఈ విషయం చెప్పి అభినందిద్దాము,  అని అదే ఆటోలో ఆయన ఆఫీసుకు వెళ్ళాము. ఎప్పుడో హైదరాబాదులో పరిచయం. కానీ ఆయన నన్ను గుర్తుపట్టారు. ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగారు. మళ్ళీ ఎప్పుడు ప్రయాణం అని అడిగి, ఈలోగా అరకు వెళ్లి రండి అంటూ  అప్పటికప్పుడు ఒక వాహనం ఏర్పాటు చేసి మమ్మల్ని అరకు పంపించారు. అనుకోకుండా అరకు, బొర్రా గుహలు చూసే అవకాశం దొరకడంతో పిల్లలు కూడా సంతోష పడ్డారు. అరకు నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని రైలు ఎక్కించి, టన్నెల్స్ ద్వారా ప్రయాణానుభూతి కలిగించి, మమ్మల్ని తీసుకువెళ్ళిన వాహనం రైలు వెంట వచ్చే ఏర్పాటు చేశారు. తరువాత రామస్వామి గారు హైదరాబాదు కమిషనర్ గా కూడా పనిచేశారు. 

(మాస్కో ఎసైన్ మెంటు పూర్తిచేసుకుని, అయిదేళ్ళ తరువాత  హైదరాబాదు ఆలిండియా రేడియోలో తిరిగి చేరిన తరువాత, రామస్వామి గారు (అప్పటికి రిటైర్ అయ్యారు) రాజ్ భవన్ లో కనపడ్డారు. ఆ రోజు ఆనాటి గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టిన రోజు. అధికారులు, అనధికారులు అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి రాజ భవన్ కు వచ్చారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో ఐ పి ఎస్ అధికారిగా పనిచేసిన కారణమో  ఏమిటో తెలియదు కానీ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేక మంది అధికారులు వచ్చారు. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. నిబంధనల ప్రకారం ఆయన తన సెల్ ఫోన్ ను కారులోనే వుంచేసి లోపలకు రావడం గమనించి,  అదే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే, పోలీసు శాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే ఎట్లా అన్నట్టు చిరునవ్వే సమాధానం.)

హైదరాబాదు వచ్చిన తర్వాత గుంటూరు నుంచి రాయపాటి సాంబశివరావు గారు ఫోన్ చేశారు. రేపు పొద్దున్నే మీ అన్నయ్య గారి ఇంటికి కారు వస్తుంది, అది ఎక్కి గుంటూరు రండి, మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత  హైదరాబాదు వెళ్ళండి’ అన్నారు.

అప్పటికి ఏసీ కార్లు ఇంత విస్తృతంగా లేవు. చెప్పిన ప్రకారం కారు వచ్చింది. చల్లగా ప్రయాణం చేస్తూ గుంటూరు చేరాము. భార్య లీలాకుమారి గారికి  మా ఆవిడను పరిచయం చేస్తూ, మాస్కోలో నాకు ఈవిడ అన్నదాత అనడంతో నా కళ్ళు చమర్చాయి. ఒకరికి భోజనం పెట్టడంలో ఇంత ఆనందం వుంటుందా అనిపించింది. వెండిపళ్ళెంలో పట్టు చీరె, జాకెట్టు గుడ్డ  వుంచి మా ఆవిడకి బొట్టు పెట్టి ఇచ్చారు.  ఆ సాయంత్రం కూడా అక్కడే గడిచింది. మమ్మల్ని వుంచిన గెస్ట్ హౌస్ కి    వచ్చిన సాంబశివరావు గారు, ఇంత దూరం వచ్చి తిరుపతి వెళ్ళకపోతే ఎలా అని అదే కార్లో మమ్మల్ని తిరుపతి పంపించి మంచి దర్శనం చేయించారు. తిరుపతి నుంచి అదే కార్లో తిరిగి హైదరాబాదు చేరాము. క్షేమంగా తిప్పి తీసుకువచ్చిన డ్రైవర్ కు థాంక్స్ చెబితే, మీరు  రెండు మూడు రోజుల్లో  మాస్కో తిరిగి వెడతారు కదా, అప్పటిదాకా నన్ను మీతోనే వుండమన్నారు మా సారు’ అన్నాడు ఆ డ్రైవర్. ఈ ఊళ్ళో మాకు కారు అవసరం లేదు అని గట్టిగా చెప్పి తిప్పి పంపించాను. 

మాస్కో సంపాదనలో ఓ పది వేలు బ్యాంకులో వుంటే,  అవి మా ఆవిడకి ఇచ్చి ఏమైనా కొనుక్కో అంటే రెండు జతల గాజులు కొనుక్కుంది. ఆ రోజుల్లో బంగారం ధరలు అలాగే వుండేవి.  కొన్న మూడో రోజునే వాటిని బ్యాంకులో  తాకట్టు పెట్టి ఎనిమిది వేలు అప్పు చేయాల్సి వస్తుందని అప్పుడు ఊహించలేదు. 

మర్నాడు సాయంత్రం బేగంపేట నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి మాస్కో ప్రయాణం.

ఈ లోగా అనుకోని అవాంతరం. ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తే, మా  ఆవిడని మా పెద్దక్కయ్య కొడుకు డాక్టర్ రంగారావు చూసి, ప్రయాణం వాయిదా వేసుకో అని సలహా చెప్పాడు.  

ట్రంక్ కాల్ బుక్ చేసి మాస్కో రేడియోకి ఫోన్ చేసి గీర్మన్ తో చెప్పా.

‘ముందు అనుకున్నట్టు మేము మాస్కో రావడం లేదు. రెండు రోజుల్లో మా ఆవిడకి  ఓపెన్ హార్ట్ సర్జరీ’   

కింది ఫోటో: 

రష్యన్ బ్లూ కలర్ టీ సెట్టు 



(ఇంకావుంది)

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

Oh My God!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అయ్యో అలాగా.
గుండె జబ్బు, కాన్సర్లు అంతే అనుకుంటాను - చెప్పా పెట్టకుండా బయట పడతాయి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లున్న రాయపాటి వారి ఆతిధ్యం మీరు వారికి మాస్కోలో ఓ పూట తెలుగు భోజనం పెట్టినందుకే ? గొప్ప వ్యక్తిత్వం 🙏.

Zilebi చెప్పారు...

అదిన్నూ ఉత్త మజ్జిగన్నానికేనండీ