టైముకు
ఆఫీసుకు రావాలా! టైముకు పని జరగాలా!
నాకు
రెండోదే కరక్టు అనిపిస్తుంది. మాస్కో రేడియో వాళ్ళు కూడా నా పద్దతికే అలవాటు పడ్డారు. ఎంత లేటుగా వచ్చినా, అంత త్వరగా అనువాదం పూర్తి చేసి
కరక్టు సమయానికి వార్తల ప్రసారం జరిగేలా చూస్తాడు అనే నమ్మకం
నా మీద కుదరడానికి
వాళ్లకి ఎక్కువ కాలం పట్టలేదు. డెబ్బయ్యవ దశకంలో బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్
గా చేసిన అనువాదాల అనుభవం, హైదరాబాదు ఆకాశవాణిలో వార్తాపఠనం, వార్తావాహిని, జీవన స్రవంతి కార్యక్రమాల నిర్వహణానుభవం
మాస్కోలో అక్కరకు వచ్చింది. అంచేత నా రాకపోకల సమయాలను గురించి వాళ్లకు మొదట్లో వున్న భయసందేహాలు
తొలగిపోయాయి.
వార్తల
సమయానికి గంట ముందు వెళ్ళడం, గంటలో
అనువాదం పూర్తి చేసి అరగంటలో వార్తలు చదివేయడం, మళ్ళీ భోజనం సమయానికి ఇంటికి చేరడం
ఇదీ నా దినచర్య.
క్రమంగా
అందరితో కలిసి వెళ్ళడం తగ్గించి ఒంటరిగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. దీనికి
కారణం నా భోజనపు అలవాట్లు. ఆఫీసు కేంటీన్ చాలా చౌక అని ఒకసారి మళయాళం న్యూస్ రీడర్ దాసన్ తీసుకువెళ్లాడు. వంద మందికి
పైగా ఒకేసారి కూర్చుని భోజనాలు చేసే ఏర్పాట్లు వున్నాయి. దాదాపు పాతిక రకాల
పదార్ధాలు. దానికి తగ్గట్టుగా పెద్ద పెద్ద పళ్ళాలు. చికెన్, మటన్, బీఫ్ ఇలా అనేక రకాల మాంసాహార వంటకాలు. వెజిటేరియన్లకు
పలురకాల బ్రెడ్స్, పండ్లు. ఐస్ క్రీములు, టీలు. (సమావర్ అని పెద్ద సైజు నీళ్ళ
బాయిలర్ల వంటివి. వాటిల్లో తేయాకు వేసిన నీళ్ళు ఎప్పుడూ కాగుతుంటాయి. ఇవి కేంటీన్ల
లోనే కాదు, ప్రతి
అంతస్తులో వుంటాయి. టీ తాగాలని అనుకున్న వాళ్ళు వెళ్లి తాగవచ్చు. పైగా వీటిని అనేక
రకాల సైజుల్లో, అనేక
రకాల లోహాలతో,
పింగాణీతో తయారుచేసి సూవెనీర్లుగా అమ్ముతారు. రష్యన్ సంస్కృతిలో ఈ సమావర్లు ఒక
భాగం) ఈ కేంటీన్ లో ఎన్నితిన్నా, ఎన్నిసార్లు తిన్నా యాభయ్ కోపెక్కులు కంటే
ఎక్కువ ఖర్చు కాదు. చాలామంది ఇళ్ళల్లో వంటకు బద్దకించేవారు ఇళ్లకు పట్టుకుపోయేవారు.
అక్కడ ఎన్నివున్నా నేను తినగలిగినది నాకు ఒక్కటీ కనిపించలేదు. యాపిల్ పళ్ళు వంటివి
కనిపించినా తినాలని అనిపించేది కాదు. దాంతో అక్కడికి వెళ్ళడం మానుకున్నాను.
కొన్నాళ్ళు
మెట్రో. కొన్నాళ్ళు ట్రాము. మెట్రో అయితే సరిగ్గా
పద్నాలుగు నిమిషాలు అంటే పద్నాలుగు నిమిషాలు. ఒక నిమిషం ఎక్కువాకాడు, ఒక నిమిషం తక్కువాకాదు. నేనున్న అయిదేళ్లు
ఇదే వరస. అంత ఖచ్చితంగా నడిచేవి మెట్రో రైళ్లు.
పొతే, ట్రాములో
ప్రయాణం దాదాపు నలభయ్ నిమిషాలు పట్టేది.
ఎందుకంటే, అది
కరెంటుతో నడిచినా రోడ్డు మీద ప్రయాణం. ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళాలి.
పైగా అదే రోడ్డు మీద మిగిలిన వాహనాలు కూడా వెడుతుంటాయి. మెట్రో భూగర్భం మార్గం కనుక మధ్యలో స్టేషన్లు
మినహా ఏదీ కనపడదు. అదే ట్రాము అయితే ఎంచక్కా ఊరు చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇంటికి
కాస్త దగ్గర్లో ట్రాము ఎక్కితే అది నేరుగా మాస్కో రేడియో స్టేషన్ దగ్గర దింపేది.
అదీ కాక ఇండియన్ ఎంబసీ నుంచి వార్తా పత్రికలు తెచ్చుకోవడానికి, మధ్యలో
చదువుకోవడానికి ట్రాము ప్రయాణం అనుకూలం. పైగా రెంటికీ పాసు ఒక్కటే.
అన్ని
రోజులు ఒకలాగా వుండవు కదా! ఒకరోజు ట్రాము ఎక్కి
దర్జాగా కూర్చున్నాను, కోటు బొత్తాములు సదురుకుంటూ. ఒక గంట ప్రయాణం తర్వాత ఆగింది.
ఎప్పుడూ లేనిది ఇదేమిటి ఇంత ఆలస్యం అనుకుంటూ దిగాను. చూస్తే ఎక్కడ ఎక్కానో అక్కడే
వున్నాను. ఇదేమిట్రా బాబూ అనుకుంటూ మరో ట్రాము ఎక్కాను. మళ్ళీ గుండ్రంగా తిరిగి
ఎక్కిన చోటుకే వచ్చి ఆగింది. ఆ రోజు కారణం తెలియదు కానీ అది బయలుదేరిన చోటు నుంచి
కొంత దూరం పోయి మళ్ళీ బయలుదేరిన చోటుకే వస్తున్నాయి. ఈ సంగతి నాకు తెలియదు.
అడగడానికి నాకు,
చెప్పడానికి ఎవరికీ భాష తెలియదు. ఇక ఇది
పని కాదనుకుని పబ్లిక్ ఫోను నుంచి ఒక రెండు పైసల (కోపెక్కుల ) నాణెం వేసి మా ఆవిడకు విషయం చెప్పాను. ‘మీరున్న చోటుకు
దగ్గర్లో శ్రీధర్ కుమార్ (ఇండియన్ ఎంబసీలో
పనిచేసే తెలుగు ఉద్యోగి) ఇల్లు వుంది, ముందు అక్కడికి వెళ్ళండి’ అని సలహా ఇచ్చింది. టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళే
ముందు నెంబరు డయల్ చేయడానికి చేతికి ఉన్న
ఉన్ని గ్లౌసులు తీసి వేసుకోవడం మరిచి
పోయినట్టు వున్నాను, బయటకి రాగానే
క్షణాల్లో వేళ్ళు కొంకర్లు పోయాయి. రాతి వేళ్ళలా మారిపోయిన చేతులకు మళ్ళీ గ్లౌస్ వేసుకోవడం కుదరలేదు. క్రమంగా చలి,
గడ్డ కట్టిన చేతుల నుంచి వెన్నెముకకు
పాకుతున్న ఫీలింగు. ఎంతో ఆందోళనతో ఒక్క పెట్టున వురుక్కుంటూ వెళ్లి శ్రీధర్ కుమార్
ఇంటి తలుపు తట్టాను. అప్పటికే మా ఆవిడ ఫోను చేసి చెప్పినట్టు వుంది, శ్రీధర్
కుమార్ భార్య శ్రీమతి విశాల గారు రెడీగా తయారుచేసి ఉంచిన వేడి వేడి కాఫీ తాగిన
తర్వాత కానీ కుదుట పడలేకపోయాను. కాసేపు అక్కడే కూర్చుని తేరుకున్న తర్వాత, వాళ్ళింటికి
దగ్గరలో వున్న మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లాను. వెళ్లి నా రష్యన్
సహచర ఉద్యోగి గీర్మన్ తో పడ్డ కష్టాలు
చెప్పుకుంటే (అతడికి కొద్ది మాత్రం తెలుగు తెలుసు) ‘అయ్యో! ఎందుకు అంత ఇబ్బంది పడి
వచ్చారు, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోకపోయారా’ అన్నాడు. మరి ఆఫీసు పని, రేడియో
వార్తలు వాటి సంగతేమిటని అడిగితే గీర్మన్ ఇచ్చిన సమాధానం నన్ను మాస్కో చలికన్నా మరింత నిశ్చేష్టుడిని చేసింది.
‘భలే
వాళ్ళే! నిన్నటి వార్తలు రికార్డు చేశాము కదా! వాటినే రిప్లే చేసేవాళ్ళం’.
ఇక
రెండో సంఘటన ఏకంగా మా ఇంట్లోనే జరిగింది.
ముందు
గొయ్యి వెనుక నుయ్యి అనే సామెత ఒక రోజు మాకు అనుభవంలోకి వచ్చింది. ఆ రాత్రి మేము
భోజనం చేసి టీవీలో మహాభారతం కేసెట్ వేసుకుని చూస్తుంటే, పై అంతస్తులో వున్న జస్వంత్ సింగు గారి భార్య
ఫోను చేసి ఓ కబురు చెవిలో వేసింది. వినగానే ఎగిరి గంతు వేయాల్సిన విషయం కాదు కానీ
నిజంగానే ఇంటినుంచి
గంతు వేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆవిడ అందించిన సమాచారం ఏమిటంటే, రేడియో మాస్కో భవనం అంటే మేముంటున్న అపార్ట్
మెంటులో అగ్నిప్రమాదం జరిగిందట. మంటలను ఆర్పేందుకు సిబ్బంది వచ్చారట. పైకి
నిచ్చెనల మీదుగా వచ్చి కిటికీ తలుపు మీద కొట్టినప్పుడు వాటిని తీస్తే, మమ్మల్నిజాగ్రత్తగా కిందకు దింపుతారట. ఇదెక్కడి గోలరా
అనుకుంటూ ఆదరాబాదరాగా పిల్లల్ని లేపుతుంటే మళ్ళీ ఫోను. ‘కంగారులో వున్నపలాన కిందికి
దిగేయకండి. బయట
గడ్డకట్టే చలి. వీధిలోకి పోయేటప్పుడు యెలా వెడతామో ఆ మాదిరిగా అన్ని ఉన్ని దుస్తులు
వేసుకుని, కోట్లూ టోపీలు ధరించి
సిద్ధంగా
వుండండని’ మరో
హెచ్చరిక.
ఒకవైపు
నిప్పంటుకున్నదని భయపడాలా! లేక పెళ్ళికి వెడుతున్నట్టు తయారు కావాలా!
ఏదయితేనేం
భయపడ్దంత ఏమీ జరగలేదు. ఆ భవనంలో ఎక్కడో ఏదో చిన్నపాటి అగ్గి రాజుకుని పొగ రావడం, దాన్ని పసికట్టిన అలారం దగ్గర్లో
వున్న ఫైర్
స్టేషన్లో మోగడం, వాళ్లు
హడావిడిగా రావడం
జరిగింది. బహుశా అప్పుడప్పుడలా వూహించని దుర్ఘటనలు సంభవిస్తే, యెలా
సంసిద్ధంగా వుండాలో పౌరులకు నేర్పే ప్రక్రియలో భాగంగా అలా చేసారో ఏమిటో తెలియదు.
ఆ రోజు ఏమీ
జరక్కపోయినా మాస్కో జీవితంలో మరో కోణం మాకు దృగ్గోచరమయింది. పౌరుల ప్రాణాల పట్ల తీసుకుంటున్న
శ్రద్ధ ఈ సంఘటన రూపంలో మరోమారు ఆవిష్కృతమైంది. ఆవిష్కృతమయింది.
(ఇంకావుంది)
8 కామెంట్‌లు:
సమోవర్ (samovar) అంటే ఇదా? పెద్ద సైజు సాలంకృత tea pot లా ఉందే 🤔 ?
నేనింతకాలం సమోవర్ అంటే చిన్న సైజు స్టవ్ అనుకున్నాను 🙂.
// “…….. తేరుకున్న తర్వాత, వాళ్ళింటికి దగ్గరలో వున్న మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లాను.” //
మరి గ్లౌస్ (gloves) లేకుండానే 😀 ? ఫోన్ బూత్ లో మర్చిపోయానన్నారు కదా 🙂 ?
did I hear anyone saying, My Dear Watson :)
Did you ?
Anyway what was so “elementary” about it ?
మొదట్లోనే చెప్పా భండారు వారికి
వినరా వార్ని పెట్టుకుని వ్రాయమని సో దట్ ఈలాంటి విషయాలు వెంఠనే కనిబెట్టేసి వాటికి నగిషీలనద్దించి వుండవచ్చు :)
ప్చ్ విన్నారు కాదు :)
విన్నకోట నరసింహారావు గారికి: Gloves టెలిఫోన్ బూత్ లో మరచిపోలేదు, డయల్ చేయడానికి తీసి మళ్ళీ వేసుకోవడం మరచిపోయాను అని రాశాను. నేను ఇండియా వచ్చేటప్పుడు రెండు మూడు రకాల సైజుల్లో స్టెయిన్ లెస్ స్టీల్ సమావర్లు (కరెంటుతో పనిచేసేవి) జ్ఞాపికలు కింద తెచ్చాను. తర్వాత ఈ ముప్పయ్యేళ్ళ కాలంలో అనేక ఇల్లు మారడంలో ఈ పింగాణీ సమావర్ ఒక్కటి మిగిలింది.
mea culpa 🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి