ఇటు ఆలిండియా రేడియోలో కాకుండా, అటు రేడియో మాస్కోలో కాకుండా హైదరాబాదులోనే త్రిశంకు స్వర్గంలో పనీ పాట లేకుండా మూడు నెలలు రికామీగా గడిపే అవకాశం దొరికింది మా ఆవిడ ఆపరేషన్ కారణంగా.
నెల రోజుల తర్వాత చెకప్ కి వెళ్లాం. డాక్టర్ గారు పరీక్షలు చేసి సంతృప్తిగా చెప్పారు, తాను అనుకున్నదానికంటే తొందరగా, బాగానే కోలుకున్నదని, ఇలాగే వుంటే మరో నెల రోజుల తర్వాత మాస్కో ప్రయాణం
పెట్టుకోవచ్చని. ఇంకో మాట అన్నారు, ఇటువంటి చికిత్సల్లో డాక్టర్లు చేసేది కొంతయితే, పేషెంట్ల సహకారం, వాళ్ళ మనోధైర్యం కూడా పనిచేస్తాయని. ఆపరేషన్ జరిగిన
రోజునే, మా ఆవిడ దాన్ని గురించి మరిచిపోయిందని ఆయనకు తెలియదు.
పోస్ట్ ఆపరేషన్ టైం లో
మా ఆవిడ ప్రధాన స్నేహితురాళ్లు వనం గీత, వనం విజయలక్ష్మి, (జ్వాలా భార్య), శేషు, అరుణ రోజూ ఏదో ఒక సమయంలో వచ్చి, ముచ్చట్లు చెబుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. సరే! హైదరాబాదు
ప్రెస్ క్లబ్ (అప్పుడు బషీర్ బాగ్), స్నేహితులు ఇలా నా కాలక్షేపం. అప్పుడప్పుడూ
మాస్కో జీవితం గుర్తుకు వచ్చేది. అక్కడ కష్టాలు మరో రకం. అవి డబ్బుతో తీరేవి కావు.
మాస్కోలో వున్నప్పుడు
ఎవరైనా కూరగాయలు ఇస్తే ఎంతో సంతోషం అనిపించేది. రెడ్డి గారని ఎంబసీలో పనిచేసేవారు.
ఎంబసీ వాళ్లకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా
విమానంలో వారం వారం కూరగాయలు వచ్చేవి. రెడ్డి గారి కుటుంబం ఉద్యోగరీత్యా చాలా కాలం ఉత్తర భారత దేశంలో
వున్నారు. అంచేత, వారికి వచ్చిన కూరగాయల బాస్కెట్ లో పచ్చి మిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొన్ని ఆకు కూరలు మాకు ఇచ్చేవారు. వాటికోసం నేను రెండు మెట్రోలు
మారి, మా ఇంటికి చాలా దూరంగా వున్న వారి
ఇంటికి వెళ్లి తెచ్చుకునేవాడిని. (దిల్ సుఖ్ నగర్ నుంచి బీ హెచ్ ఇ ఎల్
రామచంద్రాపురం వెళ్ళినంత దూరం కంటే ఎక్కువేనేమో. కూరగాయల సంచీని ట్రాలీలో
పెట్టుకుని మెట్రో వరకు ఈడ్చుకుంటూ, ఎస్కలేటర్లు
ఎక్కుతూ దిగుతూ, మెట్రోలు మారుతూ
ఊలిచ్చవావిలోవా లోని మా ఇంటికి చేరే వాడిని. ఈ కష్టాలు పగవాడికి కూడా వద్దురా
అనిపించేది. అలా అని కూరగాయలు లేకపోతే
మాకు గడవదు. అంచేత అవి తెచ్చుకోవడానికి అంత
కష్టపడేవాడిని. రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నప్పుడు నా కళ్ళల్లో సంతోషాన్ని ఆయన
చూశాడో లేదో తెలియదు. పర్వాలేదండీ అనే వాడు మర్యాదగా. అవసరంలో వున్నప్పుడు ఒకరికి
ఇవ్వడంలో వున్న ఆనందం అలాంటిది. అది అలా మనసులో ముద్ర పడిపోయింది. అలా అవసరంలో
ఉన్నవారికి సాయం చేసే అవకాశం నాకు కూడా వస్తే బాగుండు అనుకునేవాడిని.
చెప్పాను కదా!
చిన్నప్పటి నుంచి నాకు కొంత తిక్క వుండేదని. బషీర్ బాగ్ నుంచి అశోక్ నగర్ స్టాప్
వరకు ఆటోలో వచ్చేవాడిని. లోపలకు రావడానికి ఆటో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు.
(మాస్కో వెళ్ళిన తరువాత
నాకు పెరిగింది ఏమీ లేదు కానీ తగ్గింది మాత్రం కోపం. మా బామ్మ వుంటే ఈ సంగతి తెలిసి ఎంత సంతోషపడేదో. ఒళ్ళు తెలియని కోపం
వచ్చినప్పుడు ఒకటీ రెండూ మూడూ అని ఒంట్లు లెక్కపెట్టమనేది. పిచ్చి బామ్మ. కోపం రావాలే కానీ
ఎక్కాలు చెప్పుకుంటే తగ్గుతుందా)
దాంతో రిక్షానే శరణ్యం. ఒక రోజు అలా రిక్షా ఎక్కి
వస్తుంటే అశోక నగర్ చమన్ దగ్గర తెరిచి వున్న ఒక కిరాణా దుకాణం కనిపించింది. దిగి
షాపులోకి వెళ్లాను. పాతిక కేజీల బియ్యం మూట, పెద్ద పెద్ద సైజుల్లో ఖరీదైన కేడ్
బరీస్ చాకొలెట్లు, రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు, ఇంట్లోకి
కావాల్సిన ఇతర కిరాణా సామాను కొని రిక్షాలో పెట్టించాను. ఇంటి దగ్గర దిగి
అతడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాను. అతడు సామాను దింపబోతుంటే వద్దు, ‘అవన్నీ మీ
ఇంటి కోసమే, మీ పిల్లల కోసమే’ అని చెప్పి వచ్చేశాను. చీకటిగా వుంది. నా మొహంలో ఆనందం
అతడికి కనిపించిందో లేదో తెలియదు. ఎవరీ పిచ్చోడు అనుకున్నాడేమో, అతడి మొహంలో ఆ
భావం నాకూ కనిపించలేదు.
తర్వాత మా ఆవిడతో చెబితే,
‘మంచి పనిచేశారు. ఎంతో మంది, ఎంతో సాయం చేయబట్టే మనమిప్పుడు ఇలా
ఉన్నాము. కాకపోతే, ఈ విషయం ఎవరికీ
చెప్పకండి. మొహం మీద నవ్వినా నవ్వుతారు’
అంది.
కొన్ని విషయాల్లో ఆవిడే
కరక్టు. అంచేత అప్పుడు ఆ మాట విన్నాను. ఇప్పుడు లేదు కదా! అంచేత ఆ సంగతి
బయటపెడుతున్నాను.
కింది ఫోటో:
మాస్కోలో మాకు కూరగాయల
దాత రెడ్డి గారు పిల్లలతో మా ఇంటికి వచ్చినప్పుడు తీసింది. పక్కన ఆర్వీయార్, నేను.
(ఇంకా వుంది)
3 కామెంట్‌లు:
వినరో భాగ్యము జరిగెను
ఆరో ఆధ్యాత్మిక సాధనా శిబిరం
రారో విబుధ జనుల్
కనరో ఆధ్యాత్మిక విప్లవం
ఎవరో అ (ఆ) భాగ్యవంతుల్
తినరో తిట్లు పక్షుల్
అద్భుతః!
కామెంట్‌ను పోస్ట్ చేయండి