7, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (105) – భండారు శ్రీనివాసరావు

 మార్చి ఎనిమిదో తేదీ అంటే రేపు అంతర్జాతీయ మహిళాదినోత్సవం.

ఇళ్ళల్లో తల్లిని, భార్యని, అక్కచెల్లెళ్ళని, కుమార్తెలను గౌరవించి, మన్నించి, లాలించి, ఆదరించి, ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచంలోని ఆడంగులు అందరూ సంతసిస్తారు . గ్రీటింగులు తర్వాత.
‘మహిళా దినోత్సవం ఒక్క రోజన్నా ఆడవారిపై వేధింపుల వార్తలు రాకుండా వుంటే బాగుండు’ అనిపిస్తుంది.
దురాశ అని తెలిసీ ఆశ పడడం అంటే ఇదే!
మేము మాస్కోలో వున్నప్పుడు అక్కడి ప్రజలు ఆనందోత్సాహాలతో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చూశాము. పండగ వాతావరణం ప్రతి చోటా కనబడేది.
ఆ రోజున మగవాళ్లు అందరూ, ఆడవారికి చిన్నా పెద్దా కానుకలిచ్చి సంతోషపెట్టడం ఆనవాయితీ. అయితే పువ్వులు కానుకగా ఇస్తే వాళ్లు అమితంగా సంతోషించేవాళ్లు. అదేమిటో విచిత్రం అనిపించేది. పూలు పెట్టుకునే తలకట్లు కావు అక్కడి ఆడవారివి. అయినా గులాబీ పువ్వు కాడ చేతికి ఇస్తే, ముక్కూ మొఖం తెలియని మహిళలు కూడా ఆదరంగా అక్కున చేర్చుకుని (హగ్ చేసుకుని) చిరునవ్వుతో కృతజ్ఞత తెలిపే వారు. చలి (మంచు) దేశం కాబట్టి పూలు తేలిగ్గా దొరకవు. అంచేత ఆ రోజున పూలకాడలకు చాలా గిరాకీ. పైగా ఖరీదు. అన్ని వస్తువులు కారు చౌకగా లభించే ఆ దేశంలో పూల విషయంలో మాత్రం ఖరీదు అనే ఈ మాట వాడక తప్పదు. ఒక్కో పూల కాడ ఒక రూబులు. అంటే దానితో ఒక రోజంతా తిండీ తిప్పలు తెమిలిపోతాయి. దీనిబట్టి పూలు ఎంత ఖరీదైన వ్యవహారమో అర్ధం చేసుకోవచ్చు. అయినా సరే ప్రతి పౌరుడు తమ కుటుంబంలోని ఆడవారికి మాత్రమే కాకుండా కనపడిన ప్రతి అతివకు పూలు కానుకగా ఇస్తారు. ఈ పూల కాడల కానుక ఇచ్చేటప్పుడు ఓ నియమం పాటించాలి. ఆ కాడలు బేసి సంఖ్యలో వుండాలి. అంటే మూడు, అయిదు, ఏడు ఇలాగన్న మాట. సరి సంఖ్యలో ఇస్తే మొహం చిన్నబుచ్చుకుంటారు.
మహిళల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. ఆనాటి సోవియట్ యూనియన్ లో అతివలదే హవా! అక్కడ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. అన్ని విషయాల్లో పెద్దపీట వారిదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ, వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా, దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది.
చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్లు, మనవద్ద మాదిరిగా ప్లాటుఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చాజీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా ఇరవై ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడు కూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.
సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు, పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు.
అయితే అక్కడ 'ఏకపతీవ్రతం' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా ఆయన గారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకు పోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చిన తరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు. అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే, మాస్కోలో వున్నన్ని రోజులు మా పిల్లలే మాకు దుబాసీలు. ఎందుకంటే, ఇండియన్ స్కూల్లో రష్యన్ కూడా నేర్పేవారు.
రేడియో మాస్కో వాళ్ళు నాకు కూడా రష్యన్ భాష నేర్పడానికి ఒక లేడీ టీచర్ ను పెట్టారు. వారానికి రెండు రోజులు మా ఇంటికి వచ్చేది రష్యన్ నేర్పడానికి. చివరికి జరిగింది ఏమిటంటే, నాకు ఒక్క రష్యన్ భాష ఒక్క ముక్కా రాకపోగా, ఆవిడ మాత్రం ఎంచక్కా మా దగ్గర తెలుగు నేర్చుకుని వెళ్ళిపోయింది.
ఇక- చిన్న పిల్లల విషయానికి వస్తే,
ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయినా సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. మా అబ్బాయిని డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష, (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు) పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో, తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే భాద్యత కూడా సర్కారుదే కావడంవల్ల, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్ల, వారికీ అభ్యంతరాలు వుండవు.
మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్నికంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగా వుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న సంతానలక్ష్ములను జాతీయ అవార్డులతో సత్కరిస్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి, సుఖప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడిబుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు, ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.
గమ్మత్తేమిటంటే దేవుడి మీద నమ్మకం లేని ఆ దేశంలో పిల్లలే దేవుళ్ళు .
పిల్లలే ప్రత్యేకం అనుకుంటే, వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రులు, ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక దుస్తుల దుకాణాలు, ప్రత్యేక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గౌన్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు, దువ్వెనలు, బ్యాటరీ సెల్ తో పనిచేసే బుల్లిబుల్లి హెయిర్ డ్రైయర్లు, ఇలాంటివన్నీ అమ్మే ప్రత్యేక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈత కొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ, పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు, మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు, పడక గదులు, ఒకటా రెండా అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం. మరికొన్నింటి ధరలు నామమాత్రం.
మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదాను, ఉద్యోగాన్ని బట్టి కాకుండా, వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాస్కో వెళ్ళినప్పుడు మాకు రెండు పడక గదుల అపార్ట్ మెంటు ఇచ్చినా, తర్వాత మాకు ఇద్దరు పిల్లలు అని తెలుసుకుని వాళ్ళంతట వాళ్ళే అదే అపార్ట్ మెంటులో మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.
కింది ఫోటోలు:
మాస్కోలో మా అపార్ట్ మెంట్ బయట మంచులో ఆడుకుంటున్న మా రెండో అబ్బాయి సంతోష్.




(ఇంకావుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ప్రపంచ పురుషుల దినోత్సవం నవంబర్ 19. పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. మగవారి ఆవేదనలు సమస్యల గురించి చర్చ జరగాలి.