క్రమంగా మాస్కోవంటి
కొత్త ప్రదేశంలో, కొత్త జీవితానికి, కొత్త వాతావరణానికీ అలవాటు పడడం
ప్రారంభించాము. మా పిల్లలు, సందీప్, సంతోష్ ఇద్దర్నీ ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా వున్న
ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేంద్రీయ
విద్యాలయ్ లో చేర్పించాము. మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళిన
ఏడాదే ఈ ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ స్కూలు మాస్కోలో
ప్రారంభించారు.
రష్యన్
స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో
వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనం, స్కూలు యూనిఫారాలు, పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, ఇండియన్ స్కూల్లో ఇందుకు విరుద్ధం.
ఫీజులు వుంటాయి. రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే
ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే
ఎంచుకోవాల్సివచ్చింది. అలాగే ఇంగ్లీష్ మాట్లాడే మరి కొన్ని దేశాల రాయబార కార్యాలయాల అధికారుల పిల్లలకు కూడా ఇండియన్ స్కూలు
ఉపయోగపడింది.
అక్కడా
ఎడ్మిషన్లు అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము
కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్ గంగల్
కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని
యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక, ఆ రోజుల్లో ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్
గా పని చేస్తున్న సీనియర్ ఐ ఎ ఎస్ అధికారి కె యస్ శర్మ గారికి (తదనంతర కాలంలో
శర్మగారు ప్రసార భారతికి సీ.ఈ.ఓ.గా పనిచేసారు.) ఫోన్ చేసి విషయం వివరించాను.
ఆయన
కూల్ గా విని, రేపు ఉదయం పోయి
ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా
హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్
అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కాని, మా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న
పద్దతిలో ఎడ్మిషన్ లభించింది. ఆ స్కూలు చదువు వాళ్ళిద్దరి జీవితాల్లో పెనుమార్పు
తీసుకురాగలదని కలలో కూడా ఊహించలేదు.
ఎదుగుతున్న
దశలో, ఓ విదేశంలో, వాళ్లకు లభించిన ఎక్స్పోజర్ భవిష్యత్తులో
యెంతో ఉపకరించింది. పెద్ద డిగ్రీలు లేకపోయినా, రకరకాల దేశాలకు చెందిన పిల్లలతో కలిసిమెలిసి
తిరుగుతూ పెరగడం వల్ల అలవడిన కమ్యూనికేషన్
స్కిల్స్, పోటీ ప్రపంచంలో ఎదగడానికి దోహదపడ్డాయి. ముందు ఇబ్బంది పెట్టిన ప్రిన్సిపాల్ గంగల్
గారు కూడా పిల్లల చదువు విషయంలో తీసుకున్న శ్రద్ధ మరచి పోలేనిది. అలాగే శర్మ
గారు. అడగకనే వరాలిచ్చే దేవుడిగా ప్రసార భారతిలో సిబ్బంది మన్ననలందుకున్నారు.
రేడియో
మాస్కో చిన్నపాటి ఐక్యరాజ్య సమితి అనుకోవాలి. ఎనభయ్ దేశాలకు చెందిన వారు అక్కడ
పనిచేసేవారు. అందులో మళ్ళీ భాషల తేడా. మన దేశం విషయం తీసుకుంటే పద్నాలుగు భారతీయ
భాషల్లో మాస్కో రేడియో ప్రసారాలు జరిగేవి. తెలుగు, గుజరాతీ, కన్నడ భాషల కోసం ఆకాశవాణి న్యూస్
రీడర్లను తీసుకున్నారు. మిగిలిన భాషల కోసం, అక్కడే చదువుకుని ఆయా భాషల్లో
ప్రావీణ్యం వున్నవారిని ఎంపిక చేసుకున్నారు.
ఊలిచ్చ
వావిలోవాలో వున్న రేడియో మాస్కో భవనంలో వివిధ దేశాలకు చెందిన వారికి వసతి
కల్పించారు. మాతో పాటు, దాసన్
(మళయాళం), రామకృష్ణ (కన్నడ), వ్యాస్ (గుజరాతీ), జస్వంత్ సింగ్, వాలియా సింగ్ (పంజాబీ), అరుణ్ మహంతి, (ఒడియా), ఇలా అందరం కుటుంబాలతో ఒకే చోట వుండేవాళ్ళం. ఒకే దేశం నుంచి
వెళ్లాం అన్నమాటే కాని, ఒకరి
భాష మరొకరికి తెలియదు. ఇంగ్లీషే మళ్ళీ దండలో దారం. ఇదే భవనంలో మాస్కో రేడియోలో పనిచేసే
ఇండొనీషియా, ఫిలిప్పీన్స్, కొరియా, చైనా, క్యూబా తదితర దేశాలకు చెందిన విదేశీయులు
కూడా కాపురాలు వుండేవాళ్ళు. పెద్దల మాతామంతీకి
భాష అవాంతరం అయినా,
పిల్లల ఆటలకు ఆ అడ్డంకి వుండదు కదా! అందుకే చాలా చిన్నతనం నుంచే అనేక దేశాల వారితో
కలిసి పెరిగే అరుదైన అవకాశం మా పిల్లలకు లభించింది.
మేమున్న
రోజుల్లో, మాస్కోలో తెలుగు కుటుంబాలు అనేకం వుండేవి. ప్రగతి ప్రచురణల్లో నిడమర్తి
రాజేశ్వరరావు, రాదుగ
పబ్లికేషన్స్ లో ఆర్వీయార్,
ఇండియన్ ఎంబసీలో కేవీ రమణ, పరకాల
సుధీర్, దాసరి రాము, శ్రీధర్ కుమార్, గీతేష్ కుమార్, రమేశ్ చంద్ర, మోహన్ రెడ్డి (ఇండియా తిరిగివచ్చిన
తరువాత ఇస్కాన్ లో చేరి మోహన్ దాస్ గా పేరు మార్చుకున్నారు) రామారావు, స్టేట్ బ్యాంక్ తరపున రాధాకృష్ణ, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచర్
కృష్ణన్ ఈ విధంగా ఇన్ని తెలుగు కుటుంబాలు ఒకేసారి మాస్కోలో వున్న సందర్భం మరోటి
లేదు. వీళ్ళకు తోడు తెలుగు విద్యార్ధులు అనేకమంది. డాక్టర్ రావు మల్లు ( మల్లు రవి, మల్లు భట్టి సోదరుడు), డాక్టర్ సమంత, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ శశికళ, అర్చన, నన్నపనేని
సుధ (నన్నపనేని రాజకుమారి కుమార్తె) ఇలా ఎందరెందరో మా ఇంటి పిల్లలుగా మసిలి
మధురానుభూతులను మాకు మిగిల్చారు. శని, ఆది వారాలు వస్తే, చాలు వీరందరితో మా ఇల్లు సందడే సందడి.
ఇక్కడ
ఒక విషయం చెప్పాలి. నేను రాసే సంగతులు చదివేవారు దాదాపు నలభయ్ ఏళ్ళ నాటి పరిస్థితులను
దృష్టిలో వుంచుకోవాలి. నేను దేశం విడిచి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉన్నంత
మెరుగ్గా లేవు. ఈ కోణంలో చూడకపోతే, పరాయి దేశాన్ని అతిగా పొగిడినట్టు అనిపించడం
సహజం.
కొంతకాలం
గడిచిన తర్వాత కొన్ని విషయాలు వింటుంటే, విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని ‘ఔనా!’
అనిపిస్తే,
మరికొన్ని ‘ఔరా!’ అనిపిస్తాయి. గతానికి వున్న గొప్పతనం అదే!
ఆరోజుల్లో
నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.
ఆ
రోజుల్లో ఇలా వుండేది, అలా
వుండేది అని రాస్తే నమ్మలేనంతగా ఈనాడు రష్యన్ల జీవన విధానాలు గుర్తుపట్టలేనంతగా
పూర్తిగా మారిపోయాయి.
రతనాలను
రాశులుగా పోసి వీధి అంగళ్ళలో విక్రయించిన స్వర్ణ యుగాలు చరిత్ర పుటల్లో ఆనవాళ్ళుగా
మిగిలిపోయినట్టే, ఆ
నాటి నా అనుభవాలు కూడా.
రేడియో
ఉద్యోగంలో వృత్తి రీత్యా అనేక రాజకీయ పార్టీల వాళ్ళతో అంటకాగి తిరిగివుండొచ్చు
కానీ ఏ రకమైన రాజకీయ వాసనలను నేను ఒంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి
రష్యాలో కాలుమోపాను. అక్కడ నేను గడిపిన జీవనం నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.
నేను, నా
భార్యాపిల్లలు అత్యంత సుఖ ప్రదమైన,
గౌరవనీయమైన,
తృప్తికరమైన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా, గోరంతను కొండంత చేసి చెబుతున్నానేమో
అనిపించక తప్పదు. అందుకే ఈ అనుభవాలను అక్షరబద్ధం చేయడానికి పాతికేళ్ళకు పైగా తటపటాయించాల్సి
వచ్చింది.
అంతేకాదు, కాలం గడుస్తున్న కొద్దీ,
గుర్తుంచుకోవాల్సిన విషయాలు గుర్తుకు రానంతగా మరపున పడడం సహజం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం
క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో అన్న సంశయం వెనక్కి
లాగుతుంది.
ఏతావాతా
జరిగింది ఏళ్లతరబడి కాలయాపన.
కింది
ఫోటోలు:
రెడ్
స్క్వేర్ వద్ద ఇండియన్ స్కూలు పిల్లల సందడి
మాస్కోలో
మా ఇంట్లో శని ఆదివారాల్లో సందడి
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి